ట్రంప్ టారిఫ్లపై..ఆందోళన అక్కర్లేదు

ట్రంప్ టారిఫ్లపై..ఆందోళన అక్కర్లేదు

రెండోసారి అధికారం చేపట్టినప్పటి నుంచి ఇతర దేశాల వస్తువుల దిగుమతులపై  సుంకాల మోత మోగిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈసారి భారత్ పై సుంకాల పెంపు విల్లును ఎక్కుపెట్టాడు.  

భారత్ తనకు మిత్ర దేశం,  ప్రధాని మోదీ తనకు మంచి మిత్రుడు అని చెప్పుకునే  ట్రంప్ సుంకాల పెంపు రూపంలో భారత్ నడ్డి  విరిచేందుకు సిద్ధమయ్యాడు.  గత వారమే భారత్ ఉత్పతులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించిన  ట్రంప్  తాజాగా మరో 25 శాతం విధించబోతున్నట్లు  ప్రకటించాడు. అది ఈ నెల 27 తేదీ నుంచి అమలులోకి రానుంది. 

మొత్తంగా  భారత్  ఉత్పతులపై 50 శాతం దిగుమతి సుంకాన్ని విధించేందుకు అమెరికా సిద్ధం అయింది.  రష్యాతో భారత్​కు ఉన్న స్నేహబంధాన్ని ‘బూచి’గా చూపి భారత్ ఉత్పతులపై  పన్ను లు పెంచి,  భారత్​ను తనదారికి తెచ్చుకునేలా ట్రంప్ వ్యవహరిస్తున్నాడు.  రష్యా నుంచి భారత్ ఆయుధాలు, చమురు దిగుమతి చేసుకోవడం రుచించని  ట్రంప్ భారత్​పై  ఇలా  కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడు.

వాస్తవానికి  ఈ ఏడాది  ఏప్రిల్ 2న  మన దేశంతోపాటు ఇతర దేశాలపై దిగుమతి సుంకాలను 26 శాతానికి పెంచిన ట్రంప్  ఈ నిర్ణయాన్ని 90 రోజులపాటు వాయిదా వేశాడు.  తిరిగి  ఆ గడువును ఆగస్టు 1 వరకు పెంచాడు.  ఇప్పటికే  అమెరికా భారత్ మధ్య పలు దఫాలుగా వాణిజ్య ఒప్పందాలు జరుగుతున్నాయి.  ఆగస్టు 25 న అమెరికా బృందం వాణిజ్య చర్చల కోసం భారత్ రావాల్సి ఉంది.  

ఇంతలోనే ట్రంప్  సుంకాల పెంపు నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యమే. ఈ నిర్ణయంతో ఇరు దేశాల వాణిజ్య చర్చలపై ఇప్పుడు నీలిమేఘాలు కమ్ముకున్నాయి.  అంతేకాదు,  ఇరు దేశాల మధ్య వాణిజ్యం విలువ  2030 సంవత్సరం నాటికి సుమారు  500 బిలియన్ డాలర్లకు  చేరాలనే దీర్ఘకాలిక లక్ష్యం కూడా ట్రంప్  నిర్ణయంతో ప్రశ్నార్థకం అయింది.

సుంకాల పెంపునకు రెండు కారణాలు

ట్రంప్  సుంకాల పెంపునకు  ముఖ్యంగా రెండు కారణాలు.  మొదటిది.. ఇరు దేశాల మధ్య ప్రస్తుతం జరుగుతున్న వాణిజ్య ఒప్పందాలలో అమెరికా డిమాండ్లు సాధించుకునేలా  భారత్​పై  ఒత్తిడి తీసుకురావడం. అమెరికా, -భారత్ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల కోసం ఇరుదేశాలు ఇప్పటివరకు ఐదుసార్లు చర్చలు జరిపాయి. చివరిసారిగా  గతవారం వాషింగ్టన్​లో భేటీ అయ్యాయి.  

ఒప్పందాల నిర్ణయం కోసం ఆరోసారి ఆగస్టు 25న అమెరికా బృందం భారత్ రానుంది.  ఈలోపే  సుంకాలు 25 శాతం పెంచడం ద్వారా భారత్​పై  ఒత్తిడి తెచ్చి  ఆగస్టు 25 న జరిగే చర్చల్లో అమెరికా డిమాండ్లకు భారత్ తలవంచేలా చేయడం ట్రంప్ వ్యూహం. 

ఇటీవల ఇంగ్లాండ్​తో జరిగిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ద్వారా అమెరికాకు దీటుగా సమాధానం ఇచ్చిన భారత్.. రానున్న చర్చల్లో తమ వైఖరి ఎలా ఉంటుందో  అమెరికాకు  చెప్పకనే చెప్పింది. అయితే ఆస్టులో జరగబోయే చర్చల్లో భారత్ అమెరికా డిమాండ్లపై  ఎలా వ్యవహరిస్తుందో  వేచి చూడాలి.

అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై  ప్రభావం

ప్రపంచ వాణిజ్యంలో కీలక స్థానాలలో ఉన్న ఈ రెండు దేశాల మధ్య కుదిరే  ఏ ఒప్పందం అయినా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై  ప్రభావం పడనుంది.  ఇక  రెండో ముఖ్య కారణం..భారత్​తో అమెరికాకు  ఉన్న  వాణిజ్య లోటు.  గత  దశాబ్దకాలంలో  రెండు దేశాల మధ్య వాణిజ్యం గణనీయంగా పెరిగినప్పటికీ అమెరికా వస్తువుల వాణిజ్య లోటు పెరిగింది.  

ట్రంప్ సైతం పలు దఫాలుగా  భారత్ తమ ఉత్పతులపై అధిక సుంకాలు విధిస్తోందని  అసహనం వ్యక్తం చేశాడు.  గత సంవత్సరం అమెరికా భారత్ నుంచి 87 బిలియన్ డాలర్ల వస్తువులను దిగుమతి చేసుకోగా భారత్ అమెరికా నుంచి 42 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంది. 

ఇక పన్నుల విధానాన్ని పరిశీలిస్తే  భారత్ అమెరికా నుంచి వచ్చే అన్ని రకాల వస్తువులపై  సగటున 11శాతం దిగుమతి సుంకం విధిస్తుండగా,  అమెరికా భారత్  ఉత్పతులపై  సగటున 2.8 శాతం దిగుమతి సుంకాలు విధిస్తోంది.  రెండు దేశాల మధ్య పన్నుల విధింపులో భారీ వ్యత్యాసం ఉండటం ట్రంప్​కు ఆగ్రహం కలిగిస్తోంది.

ప్రభావం కొంతే

ట్రంప్ నిర్ణయం భారత్ ఆర్థికవ్యవస్థపై కొంతమేర  ప్రతికూల ప్రభావమే చూపనుంది. భారత్ మొత్తం ఎగుమతుల్లో అమెరికా వాటా సుమారు 18 శాతం.  భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులలో జనరిక్ ఔషధాలు ముఖ్యమైనవి. 2023–-24  సంవత్సరంలో  సుమారు 8.1 బిలియన్ డాలర్ల విలువైన ఔషధాల ఎగుమతులు జరిగాయి. 

అలాగే,  టెలికం పరికరాల ఎగుమతులు 6.5 బిలియన్ డాలర్లు, విలువైన రత్నాల ఎగుమతులు 5.3 బిలియన్ డాలర్లు. పెట్రోలియం  ఉత్పతుల  ఎగుమతులు  4.1  బిలియన్ డాలర్లు, ఇలా అనేక రంగాల నుంచి వివిధ  వస్తువులను భారత్  అమెరికాకు  ఎగుమతులు చేస్తోంది.  

అమెరికాతో భారత్ కు 2022-23 లో  27.7  బిలియన్ డాలర్లు, 2023-24 లో 35.32 బిలియన్ డాలర్లు, 2024-25 లో 41 బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులు నమోదయింది. 2024-25 లో అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం  విలువ సుమారు 186 బిలియన్ డాలర్లు. వీటిలో భారత్ ఎగుమతుల విలువ 86.5 బిలియన్ డాలర్లుకాగా, దిగుమతుల విలువ 45.3 బిలియన్ డాలర్లు. సేవా రంగం నుంచి  భారత్ అమెరికాతో  వాణిజ్య మిగులు కలిగి ఉంది. 

పెరగనున్న ధరలు 

2024-25లో  సేవా రంగం నుంచి అమెరికాకు  భారత్ ఎగుమతుల విలువ 28.7 బిలియన్ డాలర్లు కాగా దిగుమతుల విలువ 25.5 బిలియన్ డాలర్లు.  ఇప్పుడు  ట్రంప్ విధించిన 25 శాతం పన్నుతో భారత్ ఉత్పతులకు అమెరికాలో  ధరలు పెరుగుతాయి. ఫలితంగా కొనుగోళ్లు తగ్గడం లేదా అక్కడి వినియోగదారుడు ఇతర చౌకవస్తువులను కొనడం జరుగుతుంది.  

తద్వారా  భారత్ వస్తువులకు డిమాండ్ తగ్గి ఆ ప్రభావం ఎగుమతుల మీద పడుతుంది.  దేశీయ వస్తువుల ఎగుమతులు  తగ్గితే ఆ ప్రభావం మన ఆర్థిక వ్యవస్థ మీద పడుతుంది. అమెరికా సుంకాల పెంపు ద్వారా   భారత్  జీడీపీపై 0.2 నుంచి 0.5  శాతం  లేదా సుమారు 2.60 లక్షల కోట్ల రూపాయల వరకు ప్రభావం పడుతుంది అని  అంచనా. 

ఇతర దేశాలతో ఒప్పందాలు పెంచుకోవాలి

మిగతా దేశాలతో పోలిస్తే అమెరికాకు భారత్​తో వాణిజ్య ఒప్పందాలు చాలా కీలకం.  ఆగస్టు 25న జరగబోయే  వాణిజ్య  సమావేశంలో తమకు అనుకూలంగా ఒప్పందాలు చేసుకునేలా ట్రంప్​ పావులు కదుపుతున్నాడు.  అయితే  అమెరికా  సుంకాల పెంపుతో  భారత్  ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదు. 
స్వల్పకాలంలో మొత్తం ఎగుమతులు కొంత తగ్గినా, దీర్ఘకాలంలో ఎగుమతులు పుంజుకునే అవకాశం ఉన్నది.  

అమెరికా మార్కెట్​కు ప్రత్యామ్నాయంగా భారత్ యూరప్ వైపు చూస్తోంది. ఇటీవల ఇంగ్లాండ్ తో  స్వేచ్ఛా వాణిజ్య  ఒప్పందంతో భవిష్యత్​లో భారత్ ఉత్పతుల  ఎగుమతులు పెరుగుతాయి.  స్థిరమైన ఆర్థికవ్యవస్థ కలిగిన భారత్  త్వరితగతిన ఇతర  దేశాలతో ముఖ్యంగా యూరప్  దేశాలతో వాణిజ్య ఒప్పందాలు పెంచుకోవాలి.    

అమెరికాకు కూడా నష్టమే

ట్రంప్ నిర్ణయం కేవలం భారత్ ఆర్ధిక వ్యవస్థపైనే కాకుండా అటు అమెరికాకు కూడా నష్టమే చేస్తుంది. భారత్ నుంచి అమెరికా దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలు పెంపు ద్వారా ఆయా వస్తువులకు ధరలు పెరుగుతాయి.  

భారత్ నుంచి అమెరికా దిగుమతి చేసుకునే స్మార్ట్ ఫోన్స్,  ఆటో మొబైల్  విడిభాగాలు,  రెడీమేడ్ దుస్తులు, ఔషధాలు, ఆభరణాలు మొదలగు వస్తువుల ధరలు పెరగడం ద్వారా అక్కడి వినియోగదారులపై  పెనుభారం పడనుంది. ఫలితంగా ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉన్నది.  ఇప్పటికే  అమెరికా ద్రవ్యోల్బణం  సుమారు 2.7  శాతం.  

దిగుమతి సుంకాలు పెరగడం ద్వారా అక్కడి వినియోగదారుల కొనుగోలు శక్తి తగ్గుతుంది. అది ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది.  ఒక విధంగా సుంకాల పెంపు ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపనుంది. 

-  డా. రామకృష్ణ బండారు,కామర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ,సెంట్రల్ యూనివర్సిటీ అఫ్ కేరళ