
- ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించేవరకు చైనాపైనా భారీ టారిఫ్‌లు విధించాలి
- తాను అధ్యక్షుడిగా ఉంటే ఈ యుద్ధం మొదలయ్యేదే కాదని వ్యాఖ్య
వాషింగ్టన్: రష్యాపై కఠిన ఆంక్షలు విధించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అయితే, నాటో మిత్ర దేశాలన్నీ రష్యా నుంచి ఆయిల్‌ను కొనడం ఆపేస్తేనే ఇలాంటి చర్యలకు తాను రెడీ అని అన్నారు. ఉక్రెయిన్‌తో శాంతి చర్చలు నిలిచిపోయాయని రష్యా ప్రకటించిన మరుసటి రోజే ట్రంప్ ట్రూత్ సోషల్‌లో చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇప్పటికీ నాటో కూటమిలోని కొన్ని దేశాలు రష్యా నుంచి ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటున్నాయని, ఇది చాలా షాకింగ్ విషయమని ట్రంప్ పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు నాటో కూటమి చర్చల శక్తిని బలహీనపరుస్తాయని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం ముగించేవరకూ చైనాపైన నాటో కూటమి దేశాలు 50 నుంచి 100 శాతం టారిఫ్‌లు వేయాలని సూచించారు.
ఇది బైడెన్, జెలెన్ స్కీ యుద్ధం
తాను అధ్యక్షుడిగా ఉండి ఉంటే.. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యేదే కాదని ట్రంప్ పేర్కొన్నారు. ఇది అమెరికా మాజీ ప్రెసిడెంట్ బైడెన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తెచ్చిన యుద్ధమని ఆరోపించారు. ‘‘నేను ఇక్కడ ఈ యుద్ధాన్ని ఆపడానికి, వేలాది రష్యన్ల, ఉక్రెయిన్ల ప్రాణాలను కాపాడటానికి మాత్రమే ఉన్నా. నాటో నా సూచనలను పాటిస్తే.. యుద్ధం త్వరగా ముగుస్తుంది. ఆ ప్రాణాలన్నీ కాపాడినవాళ్లమవుతాం. లేకపోతే నా టైం, అమెరికా సమయం, శక్తి, డబ్బు వృథా అవుతుంది” అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
భారీ టారిఫ్‌లు వేయాలని జీ7 దేశాలకు అమెరికా పిలుపు
రష్యా నుంచి ఆయిల్ కొంటున్న దేశాలపై భారీగా టారిఫ్‌లు వేయాలని జీ7 దేశాలను అమెరికా కోరింది. ముఖ్యంగా భారత్, చైనాపై అధిక సుంకాలు విధించాలని ట్రంప్ పాలకవర్గం ఈయూ, జీ7 దేశాలకు ప్రతిపాదించినట్టు తెలిసింది. ఇందుకు జీ 7 దేశాలు సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. జీ7 దేశాల ఆర్థిక మంత్రులతో శుక్రవారం ట్రంప్ పాలకవర్గం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఇందులో టారిఫ్‌ల విధింపుపై చర్చ జరిగింది. ఈ చర్చకు సంబంధించిన విషయాలను అమెరికా వాణిజ్య ప్రతినిధి జామిసన్ గ్రీర్ వెల్లడించారు.
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ముగించాలని అనుకుంటే.. ఆ దేశంపై ఒత్తిడి తెచ్చేలా జీ 7 దేశాలన్నీ ముందుకు రావాలని యూఎస్ వాణిజ్య మంత్రి స్కాట్ బెసెంట్ పిలుపునిచ్చారు. ఇందుకోసం ట్రంప్ చేసిన ప్రతిపాదనలను ప్రస్తావించారు. ఇప్పటికే.. భారత దిగుమతులపై అమెరికా భారీ టారిఫ్‌లు విధించిన విషయాన్ని గుర్తుచేశారు. ఇందుకు జీ 7 దేశాలన్నీ అంగీకరించాయని జామిసన్ తెలిపారు. ఆ దేశాలన్నీ తమతో కలిసి వస్తాయని ఆశిస్తున్నట్టు చెప్పారు.
ఇండియాపై టారిఫ్‌లు పెద్ద డీల్
రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్న ఇండియాపై 50 శాతం టారిఫ్‌లు విధించడం అంత తేలికైన విషయం కాదని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇది రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను సృష్టించిందని చెప్పారు. రష్యాపై చర్య తీసుకునేందుకు భారత్‌తో విభేదానికి తాము సిద్ధమయ్యామని తెలిపారు. భారత్‌లపై విధించిన టారిఫ్‌లపై ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
‘‘రష్యాకు భారత్ అతిపెద్ద క్రూడ్ ఆయిల్ కస్టమర్. ఆ దేశం నుంచి ఆయిల్ కొంటున్నారన్న కారణంతోనే నేను భారత్‌పై 50% టారిఫ్ వేశా. అది చాలా పెద్ద చర్య. దీంతో భారత్‌తో విభేదాలు కూడా వచ్చాయి. అయినా నేను వెనక్కి తగ్గలేదు. ఇలాంటి ఎన్నో పనులు చేశా’’ అని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడిగా తాను రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్- పాక్‌సహా ప్రపంచంలోని వివిధ దేశాల మధ్య సాగుతున్న 7 యుద్ధాలను ఆపినట్టు చెప్పారు.