- ఇజ్రాయెల్పై దాడులు ఆపేశాం
- ట్రంప్ పిలుపుతో ఇరాన్ కీలక ప్రకటన
- యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్, ఇరాన్‌కు ట్రంప్ సూచన
- ట్రూత్ సోషల్ మీడియా వేదికగా వరుస పోస్టులు..
- ఉదయం పరస్పరం దాడి చేసుకున్న ఇరాన్, ఇజ్రాయెల్
- ఇరాన్‌లోని మాహ్‌షహర్ పెట్రోకెమికల్ ప్లాంట్‌పై ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్
- ఇజ్రాయెల్ వైమానిక స్థావరాలపై ఇరాన్ అటాక్
వాషింగ్టన్: పశ్చిమాసియాలో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్‌పై తాము చేపట్టిన సైనిక చర్యలను తక్షణమే నిలిపివేస్తున్నట్టు సోమవారం ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరు దేశాలకూ చేసిన శాంతి విజ్ఞప్తిపై స్పందించిన ఇరాన్.. కాల్పుల విరమణ నిర్ణయం తీసుకున్నట్టు ఫార్స్ వార్తా సంస్థ వెల్లడించింది. ఒకవేళ ఇజ్రాయెల్ గనుక లెబనాన్‌పై మళ్లీ దాడులకు తెగబడితే మాత్రం ప్రతిదాడి తీవ్రంగా ఉంటుందని ఇరాన్ గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఆదివారం రాత్రి బీరుట్‌లోని హెజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడులు చేయడంతో ఇరుపక్షాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. వెస్ట్ బ్యాంక్‌లో జరిగిన ఒక కాల్పుల ఘటన తర్వాత ఈ ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి.
‘శాంతి ఒప్పందం’ దిశగా ట్రంప్ చొరవ
పశ్చిమాసియాలో శరవేగంగా మారుతున్న ఈ పరిణామాల నేపథ్యంలో.. ఇరు దేశాలు (ఇరాన్, ఇజ్రాయెల్) వెంటనే యుద్ధాన్ని ఆపేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా వరుస పోస్టులు చేసిన ట్రంప్.. ‘‘ఇజ్రాయెల్, ఇరాన్ దేశాలు తక్షణమే పరస్పర దాడులను ఆపివేయాలి”అని స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఇరు దేశాలు తాత్కాలిక సీజ్‌ఫైర్‌కు సిద్ధంగా ఉన్నాయని, తుది శాంతి ఒప్పందం దిశగా చర్చలు వేగంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ ఒప్పందం పూర్తయ్యే వరకు ఇరాన్‌పై ఉన్న ఆంక్షలు, దిగ్బంధం పూర్తిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.
ఏప్రిల్ సంధి తర్వాత అతిపెద్ద ఘర్షణ
గత ఏప్రిల్ 8న కుదిరిన తాత్కాలిక సంధి తర్వాత ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య అతిపెద్ద ప్రత్యక్ష ఘర్షణ చోటుచేసుకున్నది. సోమవారం ఉదయం ఇరు దేశాలు పరస్పరం క్షిపణులతో దాడి చేసుకున్నాయి. ఇరాన్ మూడు విడతలుగా ఇజ్రాయెల్‌పై క్షిపణుల వర్షం కురిపించగా, ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని విజయవంతంగా అడ్డుకుంది. ప్రతిచర్యగా ఇజ్రాయెల్ దళాలు ఇరాన్ కేంద్ర, పశ్చిమ ప్రాంతాలలోని సైనిక స్థావరాలతో పాటు మాహ్‌షహర్‌లోని ఒక పెట్రోకెమికల్ ప్లాంట్‌పై ఎయిర్ స్ట్రైక్స్ చేశాయి. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌కు చెందిన నెవాటిమ్, టెల్ నోఫ్ వైమానిక స్థావరాలపై దాడులు జరిపినట్టు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్‌జీసీ) ప్రకటించింది.
ఇజ్రాయెల్‌కు ట్రంప్ హెచ్చరిక?
మరోవైపు ఇరాన్ దాడికి ఇజ్రాయెల్ ప్రతి దాడి చేయడాన్ని ట్రంప్ వ్యతిరేకించినట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడిన ట్రంప్.. ఇరాన్‌పై ఇకపై ఎలాంటి దాడులు చేయవద్దని, దౌత్యపరమైన చర్చలకు సమయం ఇవ్వాలని సూచించినట్టు అంతర్జాతీయ మీడియా సంస్థ ‘అక్సియోస్’ కథనం ప్రచురించింది. అమెరికా–-ఇరాన్ మధ్య జరుగుతున్న శాంతి చర్చలను ఇజ్రాయెల్ దాడులు దెబ్బతీసే అవకాశం ఉందని ట్రంప్ ఆందోళన వ్యక్తంచేశారు. మరోవైపు ఇరాన్–-అమెరికా మధ్య శాంతి చర్చలు సఫలం కావాలంటే లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు పూర్తిగా ఆగాలని ఇరాన్ పట్టుబడుతోంది. కొన్ని రోజుల క్రితమే లెబనాన్, ఇజ్రాయెల్ ప్రభుత్వాల మధ్య ఒక ఒప్పందం కుదిరినప్పటికీ హెజ్బొల్లా దాన్ని తిరస్కరించింది. ప్రస్తుతానికి ఇరాన్ తన దాడులను నిలిపివేస్తున్నట్టు ప్రకటించడంతో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కాస్త తగ్గుముఖం పట్టాయి.
తక్షణమే ఇరాన్‌ను వీడండి..
ఇరాన్‌లో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అక్కడి భారత పౌరులకు ఇండియన్ ఎంబసీ కీలక హెచ్చరిక జారీ చేసింది. ఇరాన్‌కు వెళ్లాలనుకునే వారు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, ఇప్పటికే అక్కడ ఉన్నవారు అందుబాటులో ఉన్న రవాణా సౌకర్యాల ద్వారా తక్షణమే ఆ దేశాన్ని విడిచిపెట్టాలని అడ్వైజరీలో పేర్కొన్నది. అలాగే, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాలు పరస్పరం భారీ దాడులకు దిగడంపై భారత్ ఆందోళన వ్యక్తంచేసింది. ఇరు దేశాలు తక్షణమే దాడులను ఆపి, వెనక్కి తగ్గాలని పిలుపునిచ్చింది. చర్చల ద్వారా పరిష్కారాన్ని అన్వేషించి ప్రాంతీయ శాంతిని పునరుద్ధరించాలని భారత్ కోరింది.
