నిరసనకారులను చంపితే మేమొస్తం.. ఇరాన్కు ట్రంప్ వార్నింగ్

నిరసనకారులను చంపితే మేమొస్తం..  ఇరాన్కు ట్రంప్ వార్నింగ్
  •     తమపై చెయ్యెత్తితే నరికేస్తామన్న ఖమేనీ అడ్వైజర్ 
  •     యూఎస్ సోల్జర్ల భద్రతపై ఆలోచించుకోవాలన్న మరో నేత 

వాషింగ్టన్/టెహ్రాన్: ఇరాన్ లో శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న ప్రజలను కాల్చి చంపితే తాము జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. నిరసనకారులపై కాల్పులు కొనసాగిస్తే.. వారిని కాపాడేందుకు తాము వస్తామన్నారు. ఇరాన్ లో సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనల్లో పలువురు పోలీసు కాల్పుల్లో చనిపోయిన నేపథ్యంలో ట్రంప్ శుక్రవారం తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా ఈ మేరకు స్పందించారు.

 ‘‘మేం లోడ్ చేసి, లాక్ చేసి, రెడీగా ఉన్నాం..’ అంటూ పరోక్షంగా మిసైల్ దాడులకు సిద్ధంగా ఉన్నామని ఆయన వార్నింగ్ ఇచ్చారు. దీంతో ట్రంప్ పై ఇరాన్ తీవ్రంగా మండిపడింది. ఖమేనీ అడ్వైజర్ అలీ షంఖానీ శుక్రవారం ‘ఎక్స్’లో స్పందిస్తూ.. ‘‘ఇరాన్ భద్రతకు భంగం కలిగించేలా ఎవరైనా చెయ్యెత్తితే.. ఆ చేతిని నరికేస్తాం” అంటూ హెచ్చరించారు. ‘‘ఇరాక్, అఫ్గానిస్తాన్ నుంచి గాజా వరకూ అమెరికన్లు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ల సంగతి ఇరాన్ ప్రజలకు బాగా తెలుసు” అని ఆయన ఎద్దేవా చేశారు.

అమెరికా తన సోల్జర్ల గురించి ఆలోచించుకోవాలి.. 

ట్రంప్ కామెంట్లపై ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ అలీ లారిజనీ కూడా ‘ఎక్స్’ వేదికగా ఫైర్ అయ్యారు. ‘‘ఇరాన్ అంతర్గత సమస్యలపై అమెరికా జోక్యం చేసుకుంటే ఈ ప్రాంతం(మిడిల్ ఈస్ట్)లో అస్థిరత్వానికి దారితీస్తుంది. అప్పుడు ఈ ప్రాంతంలో అమెరికా ప్రయోజనాలు నాశనమవుతాయని ట్రంప్ తెలుసుకోవాలి” అని అన్నారు.

 ‘‘ట్రంప్ విరోధాన్ని ప్రారంభించారన్నది అమెరికా ప్రజలు గమనించాలి. అమెరికన్లు వాళ్ల సొంత సోల్జర్ల భద్రత గురించి ఆలోచించుకోవాలి” అంటూ మిడిల్ ఈస్ట్ లోని అమెరికా స్థావరాలను ఉద్దేశిస్తూ లారిజనీ కామెంట్ చేశారు. ఇరాన్​లో నిరసనకారులను ఇజ్రాయెల్, అమెరికా రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు. 

అయితే, ఇరాన్ ప్రభుత్వం నిషేధించిన ‘ఎక్స్’ ద్వారానే వీరిద్దరూ పోస్టులు చేయడం విశేషం. కాగా, గత జూన్​లో ఇజ్రాయెల్ వార్ సందర్భంగా ఇరాన్ లోని అణు స్థావరాలను అమెరికా ధ్వంసం చేసిన తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. తాజాగా ట్రంప్ వార్నింగ్ తో మరోసారి రెండు దేశాల మధ్య మాటల యుద్ధం సాగింది.