గ్రామం,మండలం,జిల్లాల వారీగా భూముల లెక్కలు

గ్రామం,మండలం,జిల్లాల వారీగా భూముల లెక్కలు

ధరణి పోర్టల్​ను ఆసరాగా చేసుకొని గత బీఆర్​ఎస్​ పాలనతో పక్కా స్కెచ్​తో ప్రభుత్వ భూములను అక్రమార్కులు కొల్లగొట్టారు. ఒకవైపు రైతుల పట్టా భూములను ప్రభుత్వ భూములుగా నమోదు చేసి.. ఇంకోవైపు ప్రభుత్వ భూములను పట్టా ల్యాండ్స్​గా రికార్డ్​ చేశారు. దీంతో సర్కార్ భూముల్లో ఎంతవరకు పట్టా భూములుగా మారాయో లెక్క తెలియకుండా పోర్టల్​లో గోల్​మాల్​ చేశారు. ఈ భూ దందాను ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది.

ధరణి సమస్యల పరిష్కారానికి, అందులోని తప్పులను తేల్చేందుకు కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఇతర శాఖల ఉన్నతాధికారులతో కమిటీ సమావేశాలు నిర్వహించింది. ఈ సందర్భంగా అసలు ధరణి పోర్టల్​లో ఏ భూములు ఎంత చూపిస్తున్నాయి ? వాస్తవంగా ఎంత భూమి ఉండాలి ? గత ప్రభుత్వం ఏయే భూములను ప్రభుత్వ అవసరాలకు సేకరించింది? అందులో అటవీ, దేవాదాయ, వక్ఫ్​ ల్యాండ్స్​తో పాటు ఇతర ప్రభుత్వ భూములు ఏమున్నాయి?... అనే వివరాలను కమిటీ సరిపోల్చింది. ధరణిలో నమోదైన భూములకు.. రికార్డుల్లో ఉన్నవాటికి తేడాలు గమనించింది.

రికార్డులతో పోలిస్తే ధరణి పోర్టల్​లో దేవాదాయ, వక్ఫ్​ ల్యాండ్స్​ 40 శాతం తక్కువగా చూపిస్తున్నది. అదే ఫారెస్ట్​ ల్యాండ్స్​ 6 లక్షల ఎకరాలు తక్కువగా చూపిస్తున్నది. ఇంకా ఇతర ప్రభుత్వ భూములపై స్పష్టత లేదు. ఇదే విషయం సీఎం రేవంత్​ రెడ్డి దృష్టికి కూడా వెళ్లింది. దీంతో అసలు ప్రభుత్వ భూములపై పూర్తి లెక్కలు తీయాలని రాష్ట్ర సర్కార్​ డిసైడ్​ అయింది. మండలాలు, జిల్లాల వారీగా ఏయే గ్రామంలో అటవీ, దేవాదాయ, వక్ఫ్, ఇతర ప్రభుత్వ భూములు 2014 కంటే ముందు(తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కంటే ముందు) ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి ? ఇప్పుడు ఎంత ఉన్నాయి ? ధరణి వచ్చాక ఎంత విస్తీర్ణంలో మార్పులు వచ్చాయి ? ఏయే సంవత్సరంలో ఎలా మారాయి ? ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఎంత అమ్మారు ? ఇతర అవసరాలకు ఏ మేరకు మారాయి?.. అనేవి వివరాలను పూర్తిస్థాయిలో సేకరించే పనిలో పడింది. ఫలితంగా ఎవరు.. ఎక్కడ ఏ ప్రభుత్వ భూమిని పట్టాగా మార్చుకున్నారో తేలిపోనుంది.