తెలంగాణలో తాగునీటి సప్లైకి స్పెషల్ ఆఫీసర్లు .. ఐఏఎస్​లకు అదనపు బాధ్యతలు

తెలంగాణలో తాగునీటి సప్లైకి స్పెషల్ ఆఫీసర్లు .. ఐఏఎస్​లకు అదనపు బాధ్యతలు
  • జులై చివరి వరకు సెలవు తీసుకోవద్దని ప్రభుత్వం ఆదేశం
  • తాగునీటి సమస్యల్లేకుండా చూడాలని సూచన

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్లను నియమించింది. వివిధ శాఖల్లో డైరెక్టర్లు, కమిషనర్లు, కార్యదర్శుల హోదాల్లో పని చేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారులకు జిల్లాల వారీగా ప్రత్యేక బాధ్యతలు అప్పగించింది. మొత్తం పది మంది ఆఫీసర్లను దీని కోసం నియమించింది. వీరు రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లో తాగునీటికి ఇబ్బందుల్లేకుండా పర్యవేక్షించనున్నారు.

ఆయా జిల్లాల కలెక్టర్లతో వివిధ శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యామ్నాయ చర్యలపై సమన్వయం చేయనున్నారు. రోజువారీ బాధ్యతలు నిర్వహిస్తూనే జులై చివరి వరకు అదనంగా తాగునీటి సమస్యలపై మానిటర్ చేస్తారని సీఎస్ శాంతి కుమారి చెప్పారు. ఈ మేరకు ఆమె బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జులై చివరి దాకా అధికారులు ఎవరూ సెలవులు తీసుకోవద్దని సూచించారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి తాగునీరు, కరెంట్​పై రివ్యూ చేశారు. ఈ సందర్భంగా ఎక్కడా ఎలాంటి సమస్య రాకుండా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు. 

దీని కోసం స్పెషల్ ఆఫీసర్లను నియమించాలని సూచించారు. తాగునీటి సమస్యలు తలెత్తకుండా సరిపడా నిధులను కలెక్టర్లకు అందుబాటులో ఉంచాలని సీఎస్​ను ఆదేశించారు. గ్రామాల వారీగా స్పెషల్ డ్రింకింగ్ వాటర్ యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని సూచించారు. దానికి అనుగుణంగా సీఎస్ శాంతికుమారి ఉన్నతాధికారులు, కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అన్ని జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్లను నియమించనున్నట్టు స్పష్టత ఇచ్చారు. దానికి అనుగుణంగా సీనియర్ ఐఏఎస్ అధికారులకు ఉమ్మడి జిల్లాల వారీగా ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. 

స్పెషల్ ఆఫీసర్లు.. వారికి కేటాయించిన జిల్లాల 

బి.గోపి :  వరంగల్, హనుమకొండ, జనగామ, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్
ఆర్వీ కర్ణన్ :  కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల
విజయేంద్ర బోయి :  రంగారెడ్డి, వికారాబాద్, మల్కాజిగిరి
శృతి ఓఝా :  మహబూబ్‌‌నగర్, నారాయణపేట, వనపర్తి, గద్వాల, నాగర్‌‌కర్నూల్
ప్రశాంత్ జీవన్ పాటిల్ :  ఆదిలాబాద్, నిర్మల్
కృష్ణ ఆదిత్య :  ఆసిఫాబాద్, మంచిర్యాల
అనితా రామచంద్రన్ :  నల్గొండ, భువనగిరి, సూర్యాపేట
ఏ.శరత్ :  నిజామాబాద్, కామారెడ్డి
భారతి హోళికేరి :  మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట
సురేంద్ర మోహన్ :  ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం.