మెడికల్ పీజీ ఫీజులు డబుల్.. గత నెల 28నే సర్కార్ సీక్రెట్ జీవో

మెడికల్ పీజీ  ఫీజులు డబుల్.. గత నెల 28నే సర్కార్ సీక్రెట్ జీవో
  • క్లినికల్ కన్వీనర్ సీటు 7.5 లక్షలు  
  • మేనేజ్ మెంట్ సీటు రూ.23 లక్షలు 
  • 2020లో ఫీజులు పెంచుతూ  జీవో.. హైకోర్టు స్టే.. ఇప్పుడు కొత్తగా మరో జీవో తెచ్చిన ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: ప్రైవేట్ కాలేజీల్లో మెడికల్, డెంటల్ పీజీ సీట్ల ఫీజులను సర్కార్ భారీగా పెంచింది. కాలేజీని బట్టి మెడికల్ క్లినికల్ సీటు కన్వీనర్ కోటా ఫీజు రూ.7 లక్షల నుంచి రూ.7.75 లక్షలుగా.. బీ కేటగిరీ సీటు ఫీజును కొన్ని కాలేజీల్లో రూ.23 లక్షలుగా, మరికొన్ని కాలేజీల్లో రూ.24 లక్షలుగా నిర్ణయించింది. ఇక సీ కేటగిరీ సీటుకు రూ.69 లక్షల నుంచి రూ.72 లక్షల వరకూ వసూలు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. మెడికల్ పీజీ క్లినికల్, పారా క్లినికల్, నాన్ క్లినికల్ తో పాటు డెంటల్ పీజీకి సంబంధించిన క్లినికల్, పారా క్లినికల్ సీట్ల ఫీజులన్నింటినీ డబుల్ చేసింది. ఈ మేరకు పోయిన నెల 28న ఆరోగ్యశాఖ సెక్రటరీ రిజ్వీ రెండు జీవోలు(107, 108) జారీ చేశారు. కానీ, వీటిని జీవోల వెబ్‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌లో గానీ, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో గానీ అప్‌‌‌‌లోడ్ చేయలేదు.  

మేనేజ్ మెంట్ల ఒత్తిడితో.. 

2016లో మెడికల్ క్లినికల్ సీటు కన్వీనర్ కోటా ఫీజు రూ.3.2 లక్షలు, మేనేజ్‌‌‌‌మెంట్ కోటా ఫీజు రూ.5.8 లక్షలుగా ఉండేది. ఈ ఫీజులను సవరిస్తూ 2020లో ప్రభుత్వం జీవో విడుదల చేసింది. కన్వీనర్ కోటా ఫీజు రూ.7 లక్షలకు, మేనేజ్‌‌‌‌మెంట్ కోటా ఫీజు రూ.23 లక్షలకు పెంచింది. దీంతో డాక్టర్లు హైకోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. సర్కార్ తీరును తప్పబడుతూ ఫీజుల పెంపుపై స్టే విధించింది. కన్వీనర్ కోటాకు రూ.3.5 లక్షలు, మేనేజ్‌‌‌‌మెంట్ కోటాకు రూ.11.5 లక్షలు మాత్రమే తీసుకోవాలని ఆదేశించింది. మూడేండ్ల నుంచి ఇవే ఫీజులు అమలవుతున్నాయి. అయితే ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలు ఒత్తిడి చేయడంతో, ఇప్పుడు మరోసారి ఫీజులను పెంచుతూ సర్కార్ జీవోలు తీసుకొచ్చింది. మెడికల్ పీజీ సీట్ల ఆలిండియా కోటా కౌన్సెలింగ్ ఇటీవల ప్రారంభమైంది. ఇంకో వారం, పది రోజుల్లో రాష్ట్రంలో కూడా కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఈ టైమ్ లో ఫీజుల పెంపు విషయం బయటకు వస్తే, డాక్టర్లు మళ్లీ కోర్టును ఆశ్రయిస్తారన్న భయంతోనే ప్రభుత్వం జీవోలు దాచినట్టు ఆరోపణలు వస్తున్నాయి. 

ఆందోళనలో డాక్టర్లు.. 

రాష్ట్రంలో 8,540 ఎంబీబీఎస్ సీట్లు ఉంటే, అందులో సగం కూడా పీజీ సీట్లు లేవు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1,492, ప్రైవేటు కాలేజీల్లో 1,484 పీజీ సీట్లు మాత్రమే ఉన్నాయి. ప్రైవేటు కాలేజీల్లో మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ కోటాలో మూడేండ్ల పీజీ కోర్సు చేయడానికి ఒక్కో స్టూడెంట్‌‌‌‌ రూ.80 లక్షల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ స్థాయిలో ఫీజులు పెంచితే ఎంబీబీఎస్‌‌‌‌ పూర్తి చేసిన పేద, మధ్య తరగతి విద్యార్థులు మెడికల్, డెంటల్ పీజీ ఎలా చేస్తారని డాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఫీజులను అడ్డగోలుగా పెంచితేనే హైకోర్టు మొట్టికాయలు వేసిందని, ఇప్పుడు మరోసారి సర్కార్ అదేవిధంగా వ్యవహరిస్తున్నదని హెల్త్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్‌‌‌‌ ప్రెసిడెంట్ డాక్టర్ మహేశ్‌‌‌‌ అన్నారు.