హైదరాబాద్, వెలుగు: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి సకాలంలో చికిత్స అందించేందుకు రాష్ట్రంలో ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. జిల్లా హాస్పిటళ్లు, మెడికల్ కాలేజీలతో పాటు అవసరాన్ని బట్టి ఏరియా హాస్పిటళ్లు, పీహెచ్‌సీలలోనూ ట్రామా కేర్ సెంటర్లు పెట్టాలని నిర్ణయించింది. ఈ సెంటర్లు ఎలా ఉండాలనే దానిపై డీఎంఈ రమేశ్‌రెడ్డి, వీవీపీ కమిషనర్ అజయ్‌కుమార్, ఇతర అధికారులతో కూడిన బృందం చెన్నై వెళ్లి అక్కడి ట్రామా కేర్ విధానాన్ని అధ్యయనం చేసి వచ్చింది.
ప్రభుత్వ దవాఖాన్లతో పాటు, ప్రైవేట్ హాస్పిటల్స్‌లోనూ ట్రామా కేర్ చికిత్సలు అందేలా తమిళనాడు ప్రభుత్వం ఓ వ్యవస్థను రూపొందించింది. యాక్సిడెంట్లు, స్ట్రోక్స్, సూసైడ్స్ తదితర ఎమర్జెన్సీ కండీషన్‌లో ఉన్న పేషెంట్లకు ప్రైవేటు హాస్పిటల్స్‌లో ఉచితంగా చికిత్స అందేలా ట్రామా కేర్ ప్యాకేజ్‌ను అక్కడి ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ ప్యాకేజీలో భాగంగా ట్రామా కేర్‌లో అడ్మిట్ అయ్యే పేషెంట్‌కు రూ.లక్ష వరకూ చార్జీలను ప్రభుత్వమే భరిస్తోంది. గోల్డెన్ హవర్‌లో ట్రీట్‌మెంట్ అందించి పేషెంట్ ప్రాణాలను కాపాడడమే ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం.
మన స్టేట్‌లో కూడా ఇదే తరహా పద్ధతిని అమలు చేసే అవకాశాలు ఉన్నాయని హెల్త్ ఆఫీసర్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా ట్రామా కేర్ ప్యాకేజీని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చే చాన్స్ ఉందని చెబుతున్నారు. దీంతో ఆరోగ్యశ్రీ ఎంపానల్‌మెంట్ ఉండి, స్పెషాలిటీ సర్వీసెస్ అందుబాటులో ఉన్న హాస్పిటల్స్‌ను ట్రామా కేర్‌కు ఉపయోగించుకోవచ్చునని ఆఫీసర్లు చెబుతున్నారు.
తమిళనాడులో ఇలా..
రోడ్డు యాక్సిడెంట్లు, ఇతర ఎమర్జెన్సీల్లో పేషెంట్లకు వీలైనంత త్వరగా ట్రీట్‌మెంట్ అందేలా తమిళనాడు ట్రామా కేర్ సిస్టమ్ ఉంది. యాక్సిడెంట్ గురించి పోలీసులకు లేదా ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్(108 తరహా)కు ఫోన్ వచ్చిన వెంటనే దగ్గరిలోని ట్రామా కేర్ సెంటర్లకు కూడా సమాచారం వెళ్లేలా అక్కడ ఓ చైన్ సిస్టమ్ ఉంది. జీపీఎస్ ఆధారంగా యాక్సిడెంట్ లొకేషన్‌కు దగ్గరలో ఉన్న అంబులెన్స్‌ను స్పాట్‌కు పంపిస్తారు. యాక్సిడెంట్ లొకేషన్‌కు చేరుకున్న వెంటనే బాధితుడికి అయిన గాయాల వివరాలను ట్రామా కేర్ కాల్ సెంటర్‌కు అంబులెన్స్‌లోని హెల్త్ స్టాఫ్ చేరవేస్తారు.
బాధితుడికి ట్రీట్‌మెంట్ అందించేందుకు ఏయే స్పెషాలిటీ డాక్టర్లు అవసరమో చెప్తారు. ఈ వివరాలను బట్టి ఏ ట్రామా కేర్ సెంటర్‌కు పేషెంట్‌ను తరలించాలో అంబులెన్స్ డ్రైవర్‌కు ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ సూచిస్తుంది. దవాఖానకు అంబులెన్స్ చేరుకునేలోగా డాక్టర్లు సిద్ధంగా ఉంటారు. ట్రీట్‌మెంట్ స్టార్ట్ చేసి పేషెంట్ లైఫ్ సేవ్ చేస్తారు. ఇందుకు అవసరమైన డబ్బులను ప్రభుత్వమే ఆ హాస్పిటల్‌కు చెల్లిస్తుంది. పేషెంట్ స్టేబుల్ అయిన తర్వాత, కుటుంబ సభ్యుల కోరిక ప్రకారం అక్కడే చికిత్స కొనసాగించొచ్చు. లేదా మరేదైనా హాస్పిటల్‌కూ తరలించొచ్చు.
ప్రైవేట్ హాస్పిటల్స్ ఒప్పుకుంటయా?
ఆరోగ్యశ్రీ పేషెంట్లకు ట్రీట్‌మెంట్ అందించిన ప్రైవేటు హాస్పిటళ్లకు ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించడం లేదు. ఎమర్జెన్సీలో వచ్చే పేషెంట్లను చాలా ప్రైవేటు హాస్పిటళ్లు పెద్ద ఆదాయ మార్గంగా చూస్తాయి. ఎమర్జెన్సీలో ఉన్న పేషెంట్‌కు డబ్బులతో సంబంధం లేకుండా ట్రీట్‌మెంట్ అందించాలన్న నిబంధనలు పెడుతూ ఇటీవల రాజస్థాన్ ప్రభుత్వం తీసుకొచ్చిన రైట్ టు హెల్త్ యాక్ట్ ను అక్కడి డాక్టర్లు, ప్రైవేటు హాస్పిటళ్ల ఓనర్లు వ్యతిరేకిస్తున్నారు. వీరికి మన రాష్ట్రంలోని ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలు కూడా మద్దతు తెలిపాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చే ట్రామా కేర్ ప్యాకేజీని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అంగీకరిస్తాయో లేదోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
