
ప్రజాపాలనలో దళారులపై పోలీసుల నిఘా
ఆరు గ్యారంటీ స్కీంల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు
బీఆర్ఎస్ హయాంలో దళితబంధు, డబుల్‍ఇండ్లు, బీసీ లోన్ల కోసం వసూళ్లు
బీఆర్‍ఎస్ పుట్టిముంచిన కొందరు లీడర్లు, కేడర్
అది రిపీట్‌కాకుండా ముందుగానే అలర్టయిన కాంగ్రెస్ సర్కారు
పోలీసులు, ఆఫీసర్ల ద్వారా ప్రజలకు అవగాహన..
దళారులకు వార్నింగులు
వరంగల్, వెలుగు: ఆరు గ్యారెంటీ స్కీముల అమలుకోసం కాంగ్రెస్ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోంది. శనివారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 40లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. ఏ కౌంటర్ ముందు చూసినా స్కీముల కోసం జనం బారులు తీరుతుండడంతో ఇదే అదనుగా దళారులు రంగప్రవేశం చేసే ప్రమాదముందని సర్కారు పెద్దలు అనుమానిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేసిన దళితబంధు, డబుల్ బెడ్‍రూం ఇండ్లు, బీసీ లోన్లు లాంటి స్కీములు ఇప్పిస్తామని ఆ పార్టీ లీడర్లు, దళారులు పెద్ద ఎత్తున అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు.
దళితబంధు ఇప్పిస్తానని రూ.లక్ష నుంచి రూ.3లక్షల దాకా వసూలుచేసినట్లు స్వయంగా నాటి సీఎం కేసీఆర్చెప్పారు. ఏ స్కీములైతే తమను గట్టెక్కిస్తాయని బీఆర్ఎస్నేతలు ఆశించారో, ఆయా స్కీముల్లో జరిగిన అక్రమాలే ఆ పార్టీ కొంపముంచాయి. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ముందుగానే అలర్టయ్యింది. అర్హులైన వాళ్లందరికీ స్కీములు వర్తిస్తాయని, ఎవరికీ పైసా ఇవ్వనక్కర్లేదని పోలీసులు, ఆఫీసర్ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు దళారులకు వార్నింగులు ఇప్పిస్తోంది.
గతంలో పైసలు లేనిదే పని జరగలే!
బీఆర్‍ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్‍రూం ఇండ్లు, దళితబంధు, గృహలక్ష్మి, బీసీ లోన్లు కేటాయించే క్రమంలో ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారంటూ ఊరురా జనాలు ఆందోళనలు, ధర్నాలు చేశారు. దళితబంధు పథకంలో ఒక్కో లబ్ధిదారుడికి రూ.10 లక్షలు కేటాయించిన నేపథ్యంలో.. కొందరు ఎమ్మెల్యేలు వారి అనుచరుల ద్వారా రూ.3 లక్షల చొప్పున వసూలు చేశారు. అసలైన పేద దళితులను వదిలి రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఫైనాన్సర్లు, కోట్లాది ఆస్తులున్నవారికి స్కీం వర్తింపజేశారు.
ఉదాహరణకు స్టేషన్ ఘన్‍పూర్ నియోజకవర్గంలో అప్పటి ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య స్వయంగా తన సోదరుడితో పాటు కొంతమంది ప్రజాప్రతినిధులకు దళితబంధు ఇప్పించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అక్కడి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కార్పొరేటర్లకు సైతం దళితబంధు డబ్బులను కేటాయించారు. దీంతో అసలైన పేదలు రోడ్డెక్కి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇలాగే మెజార్టీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు వారికి కావాల్సిన వారికే దళితబంధు ఇప్పించారన్న ఆరోపణలు వచ్చాయి.
కట్టిన ఇండ్లు కూడా ఇయ్యలే..
బీఆర్ఎస్ప్రభుత్వంలో డబుల్ బెడ్‍రూం ఇండ్ల కేటాయింపు కూడా ఇలాగే జరిగింది. ప్రజాప్రతినిధులు, వారి అనుచరులు ఇండ్లు ఇప్పించడానికి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేశారన్న ఆరోపణలు వచ్చాయి. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 2015లో సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా ఏసియన్మాల్ పక్కన ఉన్న పేదలకు డబుల్ బెడ్‍రూం ఇండ్లు కేటాయించారు.
మూడేండ్ల క్రితం 294 ఇండ్ల నిర్మాణం పూర్తయ్యింది. రెండేండ్ల కింద నాటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ వీటిని ప్రారంభించారు. అయినా, వీటిని లబ్ధిదారులకు కేటాయించలేదు. ఈ ఇండ్ల పేరుతో స్థానిక ఎమ్మెల్యే అనుచరులు వందలాది మంది నుంచి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చాయి. అలాచేసిన కొందరిపై పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయి. తమ గుడిసెలు కూల్చి ఇండ్లు కట్టినా ఇవ్వలేదని బాధితులు, డబ్బులు వసూలు చేశారని ఆరోపిస్తూ ఇంకొందరు, కట్టిన ఇండ్లు పంపిణీ చేయాలని లబ్ధిదారులు ధర్నాలు చేశారు.
తూర్పు నియోజకవర్గంలో అప్పటి ఎమ్మెల్యే...జర్నలిస్టుల కోసం అంటూ 250కి పైగా డబుల్ బెడ్‍రూం ఇండ్ల నిర్మాణం చేపట్టారు. కేటీఆర్ స్వయంగా శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసినా అర్హులైన జర్నలిస్టులకు మాత్రం కేటాయించలేదు. మరికొన్నిరోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనగా ప్రవేశపెట్టిన బీసీ లోన్లు, గృహలక్ష్మి స్కీముల్లోనూ వసూళ్లకు దిగారు. రూ.30 వేల నుంచి 50 వేల వరకు తీసుకున్నారు. ఇదంతా బీఆర్ఎస్ పై వ్యతిరేకతకు దారి తీసి ఆ పార్టీ ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణమైంది.
కాంగ్రెస్ అలర్ట్..
మొన్న జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పథకాల అమలులో బీఆర్‍ఎస్ పార్టీకి మైనస్‌గా మారిన అంశాలను పరిగణలోకి తీసుకుంది. సీఎం రేవంత్‍రెడ్డి మొదలు లోకల్ ఎమ్మెల్యే వరకు ఎవరైనా పథకాల పేరుతో డబ్బులు వసూలు చేసినా, దళారులు ఎంట్రీ ఇచ్చినా పోలీసు కేసులు పెట్టాలంటూ ఆదేశిస్తున్నారు. పథకాల్లో బ్రోకర్ల ప్రమేయాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని, అర్హులకే పథకాలు అందాలనే తమ లక్ష్యాన్ని నీరుగార్చే వారు ఎవరైనా వదిలిపెట్టొద్దని చెప్పకనే చెబుతున్నారు. సభలు, మీటింగులు, ప్రెస్‍మీట్లలో ఇదే అంశాన్ని నొక్కి చెబుతున్నారు.
సెంటర్లను పరిశీలిస్తున్న కలెక్టర్లు, పోలీస్ ఆఫీసర్లు
రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఓవైపు పథకాల అమలులో అవినీతి ఉండదని స్పష్టం చేస్తుండగా మరోవైపు కలెక్టర్లు, సీపీ, ఎస్పీ స్థాయి ఆఫీసర్లతో దళారులకు వార్నింగులు ఇప్పిస్తున్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేసే క్రమంలో ప్రజాపాలన మొదలవగా.. ఉచితంగా అందించే దరఖాస్తులను ఎవరైనా డబ్బులకు అమ్మితే కేసులు పెడతామని వార్నింగ్ఇచ్చారు. మరో అడుగు ముందుకేసీ ఉమ్మడి వరంగల్‌లో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, ఆదిలాబాద్‍లో కలెక్టర్ రాహుల్ రాజ్, తదితర జిల్లాల్లోని పెద్దాఫీసర్లు సైతం పథకాల అమలులో దళారుల ప్రమేయం ఉండకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. పలు సెంటర్లను స్వయంగా పరిశీలించారు. ప్రజాపాలన అప్లికేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిశాక..ఎవరైనా పథకాలు ఇప్పిస్తామంటూ డబ్బులు డిమాండ్ చేస్తే నమ్మొద్దని చెప్పారు. అలాంటి వారు ఎవరైనా ఉన్నట్టు దృష్టికి వస్తే సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.