వీకెండ్ లాక్‌డౌన్‌పై తేల్చండి

వీకెండ్ లాక్‌డౌన్‌పై తేల్చండి
  • ఈ నెల 8లోగా నిర్ణయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
  • టెస్టులు తక్కువ చేసి కేసులు తగ్గినయంటారా..?
  • జనం రాకుంటే వాళ్ల దగ్గరకే పోయి పరీక్షలు చేయాలెగా?
  • టెస్టులు పెంచండని ఎన్నిసార్లు చెప్పినా సర్కారుకు పట్టట్లేదు
  • ప్రైవేటు హాస్పిటల్స్ లో ఫీజులపై గైడ్ లైన్స్ ఇవ్వాలని ఆదేశం

హైదరాబాద్, వెలుగు: ‘రాత్రిళ్లు కర్ఫ్యూ పెడితే సరిపోతుందా? పగలంతా జనం తిరుగుతూనే ఉన్నరు. రాత్రి కర్ఫ్యూ పెట్టి చేతులు దులుపుకుంటే చాలదు. వీకెండ్‌‌ లాక్‌‌డౌన్‌‌ను పరిశీలించాలి. ఈ నెల 8వ తేదీలోగా నిర్ణయం తీసుకోవాలి’ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కరోనా టెస్టులను తగ్గించడంపై ప్రభుత్వాన్ని నిలదీసింది. టెస్టులు చేయించుకునేందుకు జనం రావట్లేదని పబ్లిక్‌‌ హెల్త్‌‌ డైరెక్టర్‌‌ శ్రీనివాస్‌‌రావు చెప్పడంపై మండిపడింది. టెస్టులు చేయకుండా జనాన్ని వెనక్కి పంపినట్లు పత్రికల్లో వార్తలు వచ్చాయని గుర్తు చేసింది. ‘మే 1న 80 వేల టెస్టులు చేసి 2వ తేదీన 58,742 టెస్టులే ఎందుకు చేశారు? కావా లని టెస్టులు తగ్గించి జనం రావట్లేదంటరా? జనం రాకుంటే ప్రభుత్వమే వాళ్ల దగ్గరికి వెళ్లి టెస్టులు చేయాలిగా? లక్షకు తగ్గకుండా పరీక్షలు చేయాలని ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వానికి పట్టట్లేదు. పరీక్షలు పెంచాల్సిందే’ అని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు చేస్తున్న టెస్టుల్లో 10 శాతం పాజిటివ్‌‌ నమోదవుతుంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం కావట్లేదా అని కామెంట్‌‌ చేసింది. కరోనాపై దాఖలైన పిల్స్‌‌ను చీఫ్‌‌ జస్టిస్‌‌ హిమా కోహ్లీ, జస్టిస్‌‌ బి. విజయ్‌‌సేన్‌‌రెడ్డిలతో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ బుధవారం మరోసారి విచారించింది. హెల్త్‌‌ డైరెక్టర్, డీజీపీ మహేందర్‌‌రెడ్డి హాజరయ్యారు.    
ప్రైవేట్‌‌ హాస్పిటల్స్‌‌లో ఫీజులపై గైడ్‌‌లైన్స్‌‌ ఇవ్వండి
ప్రైవేట్‌‌ ఆస్పత్రులు కరోనా రోగుల నుంచి ఇష్టానుసారంగా ఫీజులు దోచుకుంటున్నాయని, ప్రభుత్వం వెంటనే స్పందించాలని హైకోర్టు చెప్పింది. ‘ట్రీట్‌‌మెంట్‌‌కు అయ్యే బిల్లులకు కచ్చితమైన ధర నిర్ణయిస్తూ మార్గదర్శకాలు జారీ చేయాలి. అన్ని హాస్పిటల్స్‌‌లో ఒకే ఫీజు వసూలు చేయాలి. సీటీ స్కాన్‌‌పై ఇష్టానుసారం చార్జీలు వసూలు చేయకుండా చేయాలి’ అని ఉత్తర్వులు జారీ చేసింది.
మాస్కు సరిగా పెట్టుకోకున్నా ఫైనేయండి
మాస్కు పెట్టుకోకపోతే రూ. వెయ్యి జరిమానా విధిస్తున్నామని, మందుల్ని బ్లాక్‌‌లో అమ్మేవారిపై 39 కేసులు నమోదు చేశామని డీజీపీ చెప్పారు. స్పందించిన కోర్టు.. ‘మాస్కు సరిగా పెట్టుకోని వారికీ ఫైన్‌‌ వేయాలి. మాస్క్‌‌ లేకుండా, కర్ఫ్యూ రూల్స్‌‌ ఉల్లంఘించి వెహికల్స్‌‌ నడిపితే సీజ్‌‌ చేసేలా పోలీసులకు అధికారం ఇచ్చేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలి’ అని చెప్పింది. కేంద్రం 430 టన్నుల ఆక్సిజన్‌‌ను కేటాయించిందని పబ్లిక్‌‌ హెల్త్‌‌ డైరెక్టర్‌‌ చెప్పారు. ఏప్రిల్‌‌ 30 నాటికి 600 టన్నుల ఆక్సిజన్‌‌ అవసరమని కేంద్రానికి సీఎస్‌‌ లేఖ రాశారని చెప్పారు. దీంతో తమిళనాడు నుంచి సరఫరా కాని ఆక్సిజన్‌‌ను వేరే మార్గాల ద్వారా రాష్ట్రానికి సరఫరా అయ్యేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. రెమ్డిసివిర్‌‌ ఇంక్షన్లు రాష్ట్రంలో 86 వేల వాయిల్స్‌‌ సరఫరా అవుతుంటే కేంద్రం 4,600 ఇంజక్షన్లు ఇచ్చిందని డైరెక్టర్‌‌ చెప్పారు. 
కేంద్రం తరఫున అడిషినల్‌‌ సొలిసిటర్‌‌ జనరల్‌‌ సూర్యకరణ్‌‌రెడ్డి వాదిస్తూ అదనంగా రెమ్‌‌డెసివిర్‌‌ కావాలని రాష్ట్రం నుంచి కేంద్రానికి ప్రతిపాదన అందలేదన్నారు. 
 నిర్ణయాలు చెప్పనప్పుడు కమిటీ వేసి ఏం లాభం? 
300 మెబైల్‌‌ వెహికల్స్‌‌ ద్వారా రాష్ట్ర సరిహద్దుల్లో పరీక్షలు చేయాలని చెప్తే ప్రభుత్వం ఆ వివరాలు ఇవ్వలేదని హైకోర్టు మండిపడింది. వైద్య నిపుణుల కమిటీ ఆన్‌‌లైన్‌‌ సమావేశమైందని చెప్పి ఏం నిర్ణయాలు తీసుకుందో చెప్పకపోవడమేంటని అడిగింది. నిర్ణయాలు చెప్పనప్పుడు కమిటీ సమావేశం జరిగి ఏం ఉపయోగమంది. విపత్తుల నిర్వహణ చట్టంలోని 17 ప్రకారం సలహా కమిటీని రెండ్రోజుల్లో ఏర్పాట్లు చేయాలని, మరో రెండ్రోజుల్లో ప్రభుత్వానికి కమిటీ సూచనలు చేయాలని చెప్పింది. రాష్ట్రంలోని ఎన్ని శ్మశానాలు ఉన్నాయో, ఎన్ని డెడ్‌‌ బాడీలకు అంత్యక్రియలు చేశారో లెక్కలు చెప్పాలంది. హితం యాప్‌‌ను వినియోగిస్తే జీహెచ్‌‌ఎంసీలో కాల్‌‌సెంటర్స్‌‌కు విపరీతంగా ఫోన్లు వచ్చాయని ప్రభుత్వం చెబుతోందని, జిల్లాల్లోనూ ఇలా ఏర్పాట్లు చేయాలని సూచించింది. ఖాళీ బెడ్స్‌‌ సమాచారం వెల్లడించడంలో ప్రభుత్వం పారదర్శకంగా లేదని చెప్పింది. ‘వ్యాక్సిన్‌‌ వినియోగంపై క్లారిటీ లేదు. వ్యాక్సిన్‌‌ 3.5 కోట్ల డోసులు అవసరమని సర్కారు చెబుతోంది. 18 నుంచి 44 ఏండ్ల వయసు వాళ్లకు 3.9 లక్షల డోసులు ఇచ్చినట్లు చెబుతోంది. కేంద్రం ఎంత వ్యాక్సిన్‌‌ ఇచ్చిందో చెప్పాలి. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్రాలు వివరాలు అందజేయాలి. ప్రైవేట్‌‌ ఆధ్వర్యంలోని 230 వ్యాక్సిన్‌‌ సెంటర్స్‌‌లో ఎన్ని డోస్‌‌లు ఇచ్చాయో కూడా చెప్పాలి’ అని ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, డీజీపీ, హెల్త్‌‌ డైరెక్టర్‌‌ నివేదిక సమర్పించాలంది. తర్వాతి విచారణను ఈ నెల 13కి వాయిదా వేసింది.