సెప్టెంబర్ 29న కోర్టుకు రావాల్సిందే.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు హైకోర్టు ఆదేశం

సెప్టెంబర్  29న కోర్టుకు రావాల్సిందే.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు హైకోర్టు ఆదేశం
  • మంత్రి శ్రీనివాస్ గౌడ్​కు హైకోర్టు ఆదేశాలు 
  • ఎన్నికల అఫిడవిట్ కేసులో విచారణ

హైదరాబాద్, వెలుగు :  మహబూబ్‌‌నగర్‌‌ ఎమ్మెల్యే, మంత్రి వి. శ్రీనివాస్‌‌ గౌడ్‌‌ ఎన్నిక చెల్లదన్న పిటిషన్‌‌పై హైకోర్టు స్పందించింది. ఈ నెల 29న అడ్వకేట్‌‌ కమిషనర్‌‌ నిర్వహించే క్రాస్‌‌ ఎగ్జామినేషన్‌‌కు హాజరుకావాలని మంత్రిని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌‌ కె.లక్ష్మణ్‌‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబ్‌‌నగర్‌‌ ఓటర్‌‌ సీహెచ్‌‌ రాఘవేంద్రరాజు దాఖలు చేసిన ఎలక్షన్‌‌ పిటిషన్‌‌ను హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది.

ఎన్నికల సమయంలో శ్రీనివాస్‌‌ గౌడ్‌‌ నామినేషన్‌‌ డాక్యుమెంట్స్‌‌తోపాటు సమర్పించాల్సిన ఎలక్షన్ అఫిడవిడ్‌‌ను ట్యాంపర్ చేశారని పిటిషనర్‌‌ ఆరోపించారు. ఒకసారి ఎలక్షన్‌‌ అఫిడవిట్‌‌ దాఖలు చేశాక దానిని వెనక్కి తీసుకుని మరో అఫిడవిట్‌‌ సమర్పించారని, ఇది ఎన్నికల చట్ట నిబంధనలకు వ్యతిరేకమని వాదించారు. ఎలక్షన్‌‌ పిటిషన్‌‌ వ్యవహారంలో సాక్షులను అడ్వకేట్‌‌ కమిషన్‌‌ ఎదుట హాజరుకావాలని హైకోర్టు తాజాగా ఆదేశిస్తూ పిటిషన్ పై విచారణను వాయిదా వేసింది.