గ్రూప్‌1 రద్దు తీర్పుపై అప్పీలుకు..నేడు(సెప్టెంబర్ 26) విచారణ

గ్రూప్‌1 రద్దు తీర్పుపై  అప్పీలుకు..నేడు(సెప్టెంబర్ 26) విచారణ
  • నేడు విచారణ చేపడుతామన్న డివిజన్​ బెంచ్

హైదరాబాద్, వెలుగు : గ్రూప్1 ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్​ జడ్జి ఇచ్చిన తీర్పుపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్​పీఎస్సీ) అప్పీలుకు వెళ్లింది. సోమవారం అత్యవసర విచారణకు లంచ్ మోషన్ అనుమతి కోరగా,  హైకోర్టు అందుకు నిరాకరించింది. మంగళవారం విచారణ చేపడతామని జస్టిస్‌ అభినందకుమార్‌ షావిలి, జస్టిస్‌ జూలకంటి అనిల్‌ కుమార్‌తో కూడిన డివిజన్‌ బెంచ్‌ ప్రకటించింది.

జూన్‌11న నిర్వహించిన గ్రూప్‌1 ప్రిలిమ్స్‌ పరీక్షను రద్దు చేస్తూ ఈ నెల 23న సింగిల్‌ జడ్జి జస్టిస్‌ పి.మాధవీదేవి ఆదేశాలు ఇచ్చారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దుతో అభ్యర్థులతోపాటు కమిషన్‌లోనూ తీవ్ర ఆందోళన నెలకొంది. ఇప్పటికే రెండుసార్లు పరీక్ష రాశామని, మూడోసారి రాయడమంటే తట్టుకోలేని వ్యయప్రయాసలు ఎదుర్కోవాల్సి వస్తుందని అభ్యర్థులు భయపడుతున్నారు. మరోసారి ప్రిలిమినరీ పరీక్ష అంటే లక్షల మంది అభ్యర్థులు మానసికంగా ఇబ్బందులకు గురవుతారని కమిషన్ సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నది.

ఈ క్రమంలో ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై టీఎస్​పీఎస్సీ డివిజన్ బెంచ్‌అప్పీలుకు వెళ్లింది. బయెమెట్రిక్‌ విధానాన్ని అమలు చేయలేదని సింగిల్‌ జడ్జి పరీక్షను రద్దు చేయడం చెల్లదని, గ్రూప్‌1 నోటిఫికేషన్‌లోనే నిబంధనలను సవరించే అధికారం కమిషన్​కు ఉందని, ఆ విషయాన్ని పట్టించుకోకుండా తీర్పు వచ్చిందనిదే టీఎస్​పీఎస్సీ డివిజన్​బెంచ్ కు వెల్లడించనుంది.

బయెమెట్రిక్‌ లేకపోవడం వల్ల ఒకరి బదులు మరొకరు పరీక్ష రాశారని వాదనలో పిటిషనర్లు ఆధారాలు చూపలేదని, కాబట్టి పరీక్షలను రద్దు చేయడం చెల్లదని సర్వీస్‌ కమిషన్‌ అప్పీల్‌పిటిషన్‌లో హైకోర్టును కోరనుంది.