యూపీఎస్సీ తరహాలో టీఎస్‌పీఎస్సీ కమిషన్​ను ప్రక్షాళన చేస్తం: సీఎం రేవంత్ రెడ్డి

యూపీఎస్సీ తరహాలో టీఎస్‌పీఎస్సీ కమిషన్​ను ప్రక్షాళన చేస్తం: సీఎం రేవంత్ రెడ్డి
  • డిసెంబర్ నాటికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని వెల్లడి
  • ఢిల్లీలో యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనితో భేటీ
  • టీఎస్​పీఎస్సీ ప్రక్షాళన, యూపీఎస్సీ పనితీరుపై చర్చ
  • సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి
  • టీఎస్​పీఎస్సీ చైర్మన్, సభ్యులు, సిబ్బందికి శిక్షణ ఇస్తామని యూపీఎస్సీ చైర్మన్ హామీ

న్యూఢిల్లీ, వెలుగు : యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ) తరహాలో తెలంగాణ స్టేట్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్సీ)ను తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కమిషన్​ను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని చెప్పారు. డిసెంబ‌ర్ నాటికి 2 ల‌క్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని వెల్లడించారు. శుక్రవారం ఢిల్లీలో యూపీఎస్సీ చైర్మన్ డాక్టర్ మ‌నోజ్ సోని, సెక్రటరీ శ‌శిరంజ‌న్ కుమార్‌ తో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు సాగిన సమావేశంలో టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళ‌న‌, యూపీఎస్సీ ప‌నితీరుపై చ‌ర్చించారు. ఈ సందర్భంగా టీఎస్ పీఎస్సీని ప్రక్షాళన చేయాలనుకుంటున్నట్టు యూపీఎస్సీ చైర్మన్ దృష్టికి రేవంత్ తీసుకెళ్లారు. ఉద్యోగాల భర్తీలో నూతన విధానాలు అమలు చేయాలని భావిస్తున్నట్టు తెలిపారు. ఇందుకోసం తమకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఎలాంటి అవినీతి మ‌ర‌క లేకుండా ప్రతిఏటా జాబ్ క్యాలెండర్, ఉద్యోగాల భర్తీలో యూపీఎస్సీ పాటిస్తున్న పార‌ద‌ర్శక‌త, సుదీర్ఘకాలంగా స‌మ‌ర్థవంతంగా పని చేస్తున్న తీరుపై అడిగి తెలుసుకున్నారు. ‘‘యూపీఎస్సీకి దాదాపు వందేండ్ల చ‌రిత్ర ఉంది. నిర్దిష్ట కాల‌ప‌రిమితిలోనే నోటిఫికేష‌న్లు, ప‌రీక్షలు, ఇంట‌ర్వ్యూలు నిర్వహిస్తూ పారదర్శకంగా ఉద్యోగ నియామ‌కాలు చేప‌డుతున్న యూపీఎస్సీకి అభినంద‌న‌లు’’ అని పేర్కొన్నారు. టీఎస్‌పీఎస్సీని కూడా అలా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. అందుకు కావాల్సిన గైడెన్స్ ఇవ్వాలని యూపీఎస్సీ చైర్మన్ ను కోరారు.

గ‌త బీఆర్ఎస్ ప్రభుత్వం టీఎస్ పీఎస్సీ చైర్మన్‌, స‌భ్యుల నియామ‌కాన్ని రాజ‌కీయం చేసిందని రేవంత్ విమర్శించారు. ‘‘గత ప్రభుత్వం టీఎస్ పీఎస్సీని రాజ‌కీయ పున‌రావాస కేంద్రంగా మార్చింది. ఫ‌లితంగానే పేప‌ర్ల లీకేజీ ఘటనలు జరిగాయి. నోటిఫికేష‌న్ల జారీ, ప‌రీక్షల నిర్వహ‌ణ‌, ఫ‌లితాల వెల్లడి ఓ ప్రహ‌స‌నంగా మారింది. నీళ్లు, నిధులు, నియామ‌కాలే ల‌క్ష్యంగా తెలంగాణ ఏర్పాట‌యింది. కానీ గ‌త ప్రభుత్వ అస‌మ‌ర్థత‌తో నియామ‌కాల విష‌యంలో తీవ్ర నిర్లక్ష్యం జరిగింది” అని అన్నారు. తాము రాజ‌కీయ ప్రమేయం లేకుండా కమిషన్ చైర్మన్‌, స‌భ్యుల నియామ‌కాలు చేప‌డ‌తామ‌ని సీఎం తెలిపారు. టీఎస్‌పీఎస్సీలో అవ‌క‌త‌వ‌ల‌కు తావులేకుండా సిబ్బందిని శాశ్వత ప్రాతిప‌దిక‌న నియ‌మిస్తామ‌ని చెప్పారు.

రేవంత్ ను అభినందించిన మనోజ్ సోని..

ఉద్యోగ నియామ‌కాల ప్రక్రియ‌పై దృష్టిసారించడంపై సీఎం రేవంత్ రెడ్డిని యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోని అభినందించారు. యూపీఎస్సీ చైర్మన్‌, స‌భ్యుల నియామ‌కంలో రాజ‌కీయ ప్రమేయం ఉండ‌ద‌ని.. స‌మ‌ర్థత ఆధారంగా ఎంపిక ఉంటుంద‌ని ఆయన తెలిపారు. యూపీఎస్సీ త‌ర‌హాలోనే టీఎస్ పీఎస్సీని తీర్చిదిద్దాల‌నుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌తో పాటు స‌భ్యుల‌కు తాము శిక్షణ ఇస్తామ‌ని, సిబ్బందికి అవ‌గాహ‌న త‌ర‌గతులు నిర్వహిస్తామ‌ని హామీ ఇచ్చారు. సమావేశంలో సీఎస్ శాంతికుమారి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వి.శేషాద్రి, ఓఎస్డీ అజిత్ రెడ్డి, టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ అనితా రామ‌చంద్రన్, రాష్ట్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ చీఫ్ సెక్రటరీ వాణీ ప్రసాద్‌ పాల్గొన్నారు.