గ్రూప్ 2 పోస్టుల భర్తీకి టీఎస్​పీఎస్సీ నోటిఫికేషన్

గ్రూప్ 2 పోస్టుల భర్తీకి టీఎస్​పీఎస్సీ నోటిఫికేషన్
  • వచ్చే నెల 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు అప్లికేషన్లు  
  • జూన్ నెలాఖరు లేదా జులైలో ఎగ్జామ్ 
  • గతంలో ప్రకటించిన వాటికంటే 120 పోస్టులు పెరిగినయ్ 
  • అత్యధికంగా 165 జీఏడీ ఏఎస్ఓ, 126 పంచాయతీ రాజ్​ ఎంపీవో పోస్టులు 

హైదరాబాద్, వెలుగు: వివిధ ప్రభుత్వ శాఖల్లో 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి టీఎస్​పీఎస్సీ గురువారం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.18 డిపార్ట్​మెంట్లలో ఆయా పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. వచ్చే జూన్ నెలాఖరు లేదా జులైలో పరీక్ష నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. అయితే ఈ సారి ఇంటర్వ్యూలు లేకపోవడంతో ఎగ్జామ్ మెరిట్ ఆధారంగానే ఉద్యోగాలు రానున్నాయి. జనవరి 18 నుంచి ఫిబ్రవరి16 సాయంత్రం 5 వరకూ ఆన్​లైన్​లో దరఖాస్తులు స్వీకరించనున్నట్టు గురువారం అధికారులు ప్రకటించారు. టీఎస్పీఎస్సీ వెబ్ సైట్​లో పూర్తి వివరాలు పొందుపర్చనున్నట్టు వెల్లడించారు. అయితే ఈ సారి దరఖాస్తుల సంఖ్య 7 లక్షలు దాటుతుందనే భావనలో కమిషన్ అధికారులున్నారు. అత్యధికంగా జీఏడీ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు165 ఉన్నాయి. మరోపక్క ఎక్కువ మంది పోటీపడే పంచాయతీరాజ్ ఎంపీఓ పోస్టులు 126, నాయిబ్ తహసీల్దార్ పోస్టులు 98 ఉన్నాయి. మరోపక్క ఇయ్యాలో, రేపో గ్రూప్ 3తో పాటు మరో మూడు నోటిఫికేషన్లు కూడా రానున్నట్టు అధికారులు చెప్తున్నారు.  

పెరిగిన పోస్టులు..

గతంలో సీఎం కేసీఆర్ గ్రూప్ 2 ద్వారా 582 ఖాళీలను భర్తీ చేస్తామని పేర్కొన్నారు. ఆ తర్వాత ఫైనాన్స్ డిపార్ట్​మెంట్ 663 పోస్టులను నింపేందుకు ఆగస్టు నెలాఖరులో పర్మిషన్ ఇచ్చింది. తాజాగా ఆ సంఖ్య ఇప్పుడు 783 కు పెరిగింది. ఆర్థికశాఖ ప్రకటించిన తర్వాత 120 పోస్టులు పెరిగాయి. కొత్తగా ఏఎస్ డబ్ల్యూఓ, ఏటీడబ్ల్యూఓ, ఏబీసీడబ్ల్యూఓ, జువైనల్ సర్వీస్​విభాగంలో జిల్లా ప్రొబేషన్ ఆఫీసర్ తదితర పోస్టులను కొత్తగా గ్రూప్ 2లో చేర్చారు. 

జూన్ లేదా జులైలో ఎగ్జామ్  

గ్రూప్ 2 పరీక్షల తేదీని ప్రస్తుతం అధికారికంగా ప్రకటించలేదు. గ్రూప్ 4, గ్రూప్ 1 ప్రిలిమ్స్, ఇతర ఎగ్జామ్స్ నేపథ్యంలో ఆయా ఎగ్జాంలు లేని తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలను నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. మరోపక్క గ్రూప్​ 2 కోసం భారీగా అభ్యర్థులు పోటీ పడుతుండటం, ఇంటర్వ్యూలు ఎత్తేయ్యడంతో రాత పరీక్షలే కీలకంగా మారనున్నాయి. గతంలో నాలుగు పేపర్లతో పాటు ఇంటర్వ్యూలు ఉండేవి. ఇప్పుడు కేవలం నాలుగు పేపర్లతో జాబ్స్ రానున్నాయి. ఈ నేపథ్యంలో చాలామంది అభ్యర్థులు ప్రిపరేషన్ కోసం టైమ్ కావాలని కమిషన్ ఉన్నతాధికారులకు విజ్ఞప్తులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆరు నెలల టైమ్​ ఇవ్వాలని భావిస్తున్నారు. జూన్ నెలాఖరు లేదా జులైలో రాతపరీక్షలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు.