
కోడ్ ముగిసినా బోర్డులో స్టార్ట్ కానీ రిక్రూట్మెంట్ ప్రాసెస్
ఇప్పటికే 11వేల పోస్టులకు నాన్స్ క్లియరెన్స్
సర్కారు నుంచి ఆదేశాలు వస్తేనే ముందుకు
హైదరాబాద్, వెలుగు: టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీకేజీ ఎఫెక్ట్ గురుకుల పోస్టుల భర్తీపై పడింది. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే, నోటిఫికేషన్ ఇస్తామన్న ప్రభుత్వ పెద్దలు.. ఇప్పుడు ఆ మాటే ఎత్తడం లేదు. సుమారు 11వేల పోస్టుల భర్తీకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చినా.. రిక్రూట్మెంట్ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. దీంతో అభ్యర్థుల్లో అయోమయం నెలకొన్నది. అయితే, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ పై ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో, గురుకుల పోస్టుల నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు సర్కారు వెనుకాముందు అయితున్నట్టు సమాచారం.
అభ్యర్థులు అనుమానిస్తారని..
గురుకుల పోస్టులకు సంబంధించి ఫైనాన్స్ క్లియరెన్స్ ఇచ్చిన పోస్టుల భర్తీపై రిక్రూట్మెంట్ బోర్డు ఇంకా పనులు ప్రారంభించలేదు. ఆయా డిపార్ట్మెంట్ల నుంచి ఖాళీల ఇండెంట్లు కూడా సేకరించలేదు. మరోపక్క సొసైటీలు కూడా పోస్టుల భర్తీలో కొన్ని రూల్స్మారుస్తున్నట్టు తెలుస్తున్నది. అయితే, ఇప్పటికిప్పుడు ప్రక్రియ ప్రారంభించినా నోటిఫికేషన్‌కు కనీసం 15, 20 రోజుల టైమ్ పట్టే అవకాశముంది. వాటిని రిక్రూట్మెంట్ బోర్డు సరిచూకోవాల్సి ఉంది. మరోపక్క పోలీస్, మెడికల్, టీఎస్పీఎస్సీతో పాటు సెంట్రల్ ఎగ్జామ్స్ తేదీలను పరిశీలించి, నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. అయితే ముందు నోటిఫికేషన్ ఇచ్చి, ఎగ్జామ్ డేట్లు తర్వాత ప్రకటించే అవకాశమూ ఉంది. కానీ ఇదంతా కూడా సర్కారు నుంచి రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశాలు వస్తేనే జరుగుతుంది. అయితే, రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ల లీకేజీ లొల్లి నడుస్తోంది. ఈ క్రమంలో ఏ పరీక్ష పెట్టినా.. అభ్యర్థులు అనుమానంగానే చూసే అవకాశముందని సర్కారు పెద్దలు భావిస్తున్నారు. దీంతో కొంత ఆలస్యంగానే గురుకుల నోటిఫికేషన్ ఇవ్వాలని యోచిస్తున్నట్టు తెలుస్తున్నది.
ప్రాసెస్ కూడా జరగట్లేదు
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ.. ఎడ్యుకేషన్ సొసైటీ గురుకులాల్లోని పీజీటీ, టీజీటీ, ప్రిన్సిపల్ ఇతర పోస్టులను తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) ద్వారా భర్తీ చేయనున్నారు. గతేడాది మార్చిలో గురుకులాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని సర్కారు ప్రకటించింది. దీనికి అనుగుణంగానే జూన్‌లో 9,096 పోస్టులకు, జనవరిలో మరో 1,900 పోస్టుల భర్తీకి ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ క్లియరెన్స్ ఇచ్చింది. ఈ క్రమంలోనే మహబూబ్ నగర్-రంగారెడ్డి- హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో కోడ్ ముగియగానే, నోటిఫికేషన్ ఇస్తామని బోర్డు అధికారులు చెప్పారు. అయితే, ఎన్నికల కోడ్ ముగిసినా.. నోటిఫికేషన్ రిలీజ్ కాలేదు. ఆ ప్రాసెస్ కూడా జరగడం లేదు.