
కలియుగ ప్రత్యక్ష దైవం కొలువైన పవిత్ర పుణ్య క్షేత్రం.. అలాంటి తిరుమల కొండను పరిశుభ్రంగా ఉంచుకుందాం.. పవిత్రంగా ఉందాం అనే నినాదంతో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి రంగంలోకి దిగారు. 2025, ఏప్రిల్ 19వ తేదీ తిరుమల కొండలో పేరుకుపోయిన చెత్తను.. ఎక్కడపడితే అక్కడ భక్తులు విసిరిపోరేస్తున్న ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను ఏరివేశారు. 400 మంది సిబ్బందితో కలిసి.. ట్రాక్టర్ల కొద్దీ చెత్తను ఏరిపారేశారు. స్వచ్ఛ తిరుమలలో భాగంగా.. తిరుమల కొండల్లోని వేస్ట్ అంతా శుభ్రం చేయించారు అదనపు ఈవో వెంకయ్య చౌదరి
పవిత్ర పుణ్య క్షేత్రమైన తిరుమలలో భక్తులు ప్రయాణం చేసే వాహనాల నుంచి.. రోడ్లపైకి చెత్తను విసరడం మానుకోవాలని సూచించారు టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి. -స్వచ్ఛ తిరుమలలో భాగంగా తిరుమల మొదటి ఘాట్ రోడ్ లోని కుంకాల పాయింట్ (ఆఖరి మెట్టు) దగ్గర ఆయన సిబ్బందితో స్వచ్ఛ తిరుమల ప్రతిజ్ఞ చేయించటమే కాకుండా.. స్వయంగా ఆయనే చెత్తను తొలగించి.. సిబ్బందిలో కార్యదక్షతను, ఉత్సాహాన్ని తీసుకొచ్చారు.
►ALSO READ | టీటీడీ గోశాల వివాదం వేళ షాకింగ్ ఘటన.. ఈవో శ్యామల రావు బంగ్లాలో నాగుపాము కలకలం
తిరుమల కొండపై ప్లాస్టిక్ నిషేధం అమలులో ఉన్నప్పటికీ.. వాహనదారులు ప్లాస్టిక్ కవర్లు, తిను బండారాలు, వాటర్ బాటిళ్లను తీసుకొచ్చి రోడ్ల పక్కన విసిరి వేస్తున్నారని.. ఇది మంచి పద్దతి కాదని.. పవిత్రమైన శుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారాయన. తిరుమల కొండపై ప్రతి చోట.. పెద్ద సంఖ్యలో డస్ట్ బిన్స్ ఏర్పాటు చేశామని.. రోడ్ల పక్కన కూడా డస్ట్ బిన్స్ ఉన్నాయని.. వాటిలోనే వాటర్ బాటిళ్లు, చెత్తను వేయాలని పిలుపునిచ్చారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. కొండకు వచ్చే భక్తులందరూ ఆ డస్ట్ బిన్ లలో చెత్త వేయాలని.. వాహనంలో ప్రయాణిస్తూ రోడ్డుపై చెత్త విసరడం మంచి పద్ధతి కాదన్నారాయన.
తిరుమలను పరిశుభ్రంగా ఉంచేందుకు ఆరు వేల మంది సిబ్బందితో.. నిరంతరాయంగా కృషి చేస్తున్నామని.. వారి కృషిని అందరూ అభినందించాలన్నారాయన. భక్తులు వాళ్లకు సహరించి.. వాళ్లు చెప్పే సూచనలు పాటించాలని భక్తులకు విజ్ణప్తి చేశారు వెంకయ్య చౌదరి. స్వచ్ఛ తిరుమలకు ప్రతి భక్తుడు సహకరించాలన్న ఆయన.. ఘాట్ రోడ్డు మార్గంలో ఎనిమిది ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెత్త తొలిగించే కార్యక్రమంలో పాల్గొన్నారు.