Tirumala: తిరుమల శ్రీవారి దర్శనంపై సరికొత్త వివాదం.. టీటీడీ మాజీ ఈవో వర్సెస్ టీటీడీ చైర్మన్

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనంపై సరికొత్త వివాదం.. టీటీడీ మాజీ ఈవో వర్సెస్ టీటీడీ చైర్మన్

తిరుపతి: ఏఐ టెక్నాలజీని ఉపయోగించి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని సామాన్య భక్తులకు 2 గంటల లోపు తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనం చేయించే విధానం అమలు చేయాలని టీటీడీ భావిస్తోంది. ఇందుకు.. గూగుల్, టీసీఎస్లతో పాటు ఇతర సంస్థల సహకారం తీసుకుని ముందుకెళ్లాలని నిర్ణయించింది. అయితే.. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయంపై టీటీడీ మాజీ ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ విధానం ద్వారా రెండు మూడు గంటల్లో సామాన్య భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పించడం అసంభవమని ఆయన అభిప్రాయపడ్డారు. ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల ఆలయంలో  స్వామివారిని దర్శించుకుని ఆయన మొక్కులు చెల్లించుకున్నారు.

ఆలయం వెలుపల ఎల్వీ సుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడుతూ.. ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించిన త్వరితగతిన స్వామివారి దర్శన భాగ్యం కల్పించడం కష్టతరమని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ విధానానికి స్వస్తి పలికి సామాన్య భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని టీటీడీకి సూచనలు చేశారు. ఏపీ మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం చేసిన ఈ వ్యాఖ్యలపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు.

Also Read : భారత సింహం ప్రధాని మోడీ, 

టీటీడీలో ఈఓగా పని చేసిన ఎల్వీ సుబ్రహ్మణ్యం ఏఐ టెక్నాలజీపై అవగాహన లేకుండా వ్యాఖలు చేయడం బాధాకరమని చెప్పారు. శ్రీవారిని‌ క్షణ కాలం పాటు దర్శించుకునేందుకు గంటల కొద్దీ పడిగాపులు కాస్తున్న పరిస్థితి నుంచి బయటపడేసే ఉద్దేశంతోనే ఏఐ టెక్నాలజీ విధానంతో త్వరితగతిన దర్శనం చేయించాలని భావిస్తున్నట్లు తెలిపారు. భక్తుల్లో గందరగోళాన్ని సృష్టించేలా, ఒక సీనియర్ అధికారిగా పని చేసిన అనుభవం ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యం తిరుమలలో ఏఐ టెక్నాలజీ నిరుపయోగమని వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని బీఆర్ నాయుడు చెప్పారు. 

టీటీడీ దాతల సహాయంతో ఉచితంగా చేస్తున్న పనిని కూడా వృథా అని అనడం ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నానని టీటీడీ చైర్మన్ వ్యాఖ్యానించారు. భక్తులను గంటలు, రోజులు తరబడి షెడ్లలో, కంపార్టమెంట్లలో బంధించి పడిగాపులు కాసేలా చేయడం మంచిదా అని టీటీడీ చైర్మన్ ప్రశ్నించారు.