తిరుమలలో ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు.. వీఐపీ బ్రేక్​ దర్శనాలు రద్దు

తిరుమలలో ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు.. వీఐపీ బ్రేక్​ దర్శనాలు రద్దు

అధికమాసం కారణంగా ఈ ఏడాది సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో రెండు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. 

అన్నివిభాగాల అధికారులు  జిల్లా యంత్రాంగం తో సమన్వయం  చేసుకుని భక్తులకు ఎలాంటి  ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని అధికారులను కోరారు. అనంతరం ఈవో మీడియాతో  మాట్లాడుతూ.. సెప్టెంబర్ 18 నుండి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఒకటిన్నర నెల ముందుగానే ప్రారంభించనున్నట్లు చెప్పారు. 15 రోజుల తరువాత, జిల్లా యంత్రాంగంతో సమీక్ష నిర్వహించనున్నామన్నారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 18న ధ్వజారోహణం ఉంటుందని, అదే రోజు ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. 

22న గరుడ సేవ, 23న స్వర్ణరథం, 25న రథోత్సవం, 26న చక్రస్నానం, ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయన్నారు. నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 15న ప్రారంభమై 19న గరుడవాహనం, 22న స్వర్ణరథం, 23న చక్రస్నానంతో ముగుస్తాయని వెల్లడించారు. 

వీఐపీ బ్రేక్​ దర్శనాలు రద్దు..

బ్రహ్మోత్సవాల నేపథ్యంలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఈవో వెల్లడించారు. స్వయంగా వచ్చే ప్రముఖలకు మాత్రమే బ్రేక్‌ దర్శనం కల్పించనున్నట్లు తెలిపారు. గరుడసేవకు వచ్చే వారు వాహనసేవ తిలకించేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు.