శ్రీవారి దర్శన టికెట్ల బుకింగ్​లో సాంకేతికలోపం

శ్రీవారి దర్శన టికెట్ల బుకింగ్​లో సాంకేతికలోపం
  • టీటీడీ వెబ్‌సైట్‌లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల

తిరుపతి: తిరుమల  శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. సాంకేతిక సమస్యతో భక్తులు టికెట్లు బుకింగ్‌ చేసుకోలేకపోతున్నారు. ఇవాళ ఉదయమే టికెట్లు విడుదల చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించడంతో భక్తులు భారీ సంఖ్యలో లాగిన్ అయ్యారు. దాంతో  ఉదయం నుంచి  వెబ్‌సైట్‌ మొరాయిస్తోంది. భక్తులు బుకింగ్ చేసుకోవడానికి ఇబ్బందులుపడుతున్నారు.

కొంత మంది పరిస్థితిని నేరుగా టీటీడీ అధికారులకు తెలియజేయగా.. స్పందించారు. మొరాయిస్తున్న వెబ్ సైట్ సమస్య పరిష్కారానికి టీటీడీ సాంకేతిక  సిబ్బంది ప్రయత్నం చేస్తోందని తెలిపారు. సమస్య పరిష్కరించి మధ్యాహ్నం 12 గంటల అనంతరం టికెట్ల విడుదల ప్రక్రియ కొనసాగనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ముందుగా నిర్ణయించిన ప్రకారమే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శన టికెట్లను బుధవారం టీటీడీ విడుదల చేసింది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఈనెల 24వ తేదీనుంచి 28వ తేదీ వరకు ప్రతిరోజు అదనంగా 13వేల టికెట్ల చొప్పున వెబ్ సైట్ లో ఉంచింది. అలాగే మార్చి నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను కూడా అందుబాటులో ఉంచింది. ఇవి రోజుకు 20వేల చొప్పున విడుదల చేశారు.  ఇంత వరకు రోజుకు 15వేల చొప్పున టికెట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. మార్చి 1వ తేదీ నుంచి నెలాఖరు వరకు రోజుకు 20వేల చొప్పున ఆన్ లైన్ లో టికెట్లు అందుబాటులో ఉంటాయని టీటీడీ ప్రకటించింది. తిరుపతిలోని కౌంటర్ల ద్వారా ఆఫ్ లైన్ లో అదనంగా 5వేల టికెట్లు ఇవ్వనున్నారు.