ప్రయాణికుడిని రైల్లో నుంచి తోసేసిన టీసీ

ప్రయాణికుడిని రైల్లో నుంచి తోసేసిన టీసీ

రైల్వే టీసీ ఆగ్రహం, అసహనం, ఫ్రస్టేషన్..ఓ ప్రయాణికుడి ప్రాణాల మీదకు తెచ్చింది. కదులుతున్న రైళ్లో నుంచి ఓ ప్యాసంజర్ను బయటికి తోశాడు టీసీ. జనరల్ టిక్కెట్ తీసుకుని స్లీపర్ కోచ్ లోకి ఎక్కాడని..రైలు స్పీడులో కదులుతుండగానే బయటికి తోశాడు. అతని స్నేహితులు, తోటి ప్రయాణికులు కాపాడి అతడిని ఆస్పత్రికి తరలించారు. వివరాల్లో వెళితే... 

బీహార్ లోని సమస్తిపూర్ జిల్లా భాతర్ తికులియా గ్రామానికి చెందిన బాధితుడు నవల్ ప్రసాద్ .. హౌరా వెళ్లేందుకు రక్సాల్ హౌరా మిథిలా ఎక్స్ ప్రెస్ ఎక్కాడు. ఉజియాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో కదులుతున్న రైలునుంచి బాధితుడు నవల్ ప్రసాద్ ను బయటికి తోశాడు. తీవ్రగాయాలు కావడంతో అతడి స్నేహితులు ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. 

జనరల్ టిక్కెట్ తీసుకున్న బాధితుడు నవల్ ప్రసాద్.. స్లీపర్ కోచ్ లో ఎక్కాడు. చెకింగ్ కు వచ్చిన టీసీ..జరిమానా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈక్రమంలో ఇద్దరిమధ్యా తీవ్ర వాగ్వాదం  జరిగింది. దీంతో ఆగ్రహించిన ట్రైన్ టిక్కెట్ ఎగ్జామినర్ నవల్ ప్రసాద్ ను కదులుతున్న రైళ్లోంచి బయటికి తోశాడు. దీంతో నవల్ ప్రసాద్ కు పట్టాలపై పడి  తీవ్రగాయాలయ్యాయి. 

అయితే రైల్వే అధికారుల వాదన మరోలా ఉంది. అతడు జనరల్ టికెట్ తీసుకొని స్లీపర్ కోచ్లో ఎక్కాడు..డీ బోర్డింగ్ చేస్తుండగా రైలు నుంచి కింద పడిపోయాడని.. అతనికి తీవ్ర గాయాలయ్యాయి.. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.