ప్రేమకథలతో విసిగిపోయా.. ఓ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఘర్షణ

ప్రేమకథలతో విసిగిపోయా.. ఓ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఘర్షణ

సిద్దార్థ్ హీరోగా కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘టక్కర్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ప్యాషన్ స్టూడియోస్ కలిసి నిర్మించాయి. ఈనెల 9న సినిమా విడుదలవుతున్న సందర్భంగా సిద్దార్థ్ ఇలా ముచ్చటించాడు.

‘‘టక్కర్ అంటే చాలా అర్థాలున్నాయి. ఈ సినిమా విషయంలో.. ఓ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఘర్షణ అని అర్థం. అది హీరోహీరోయిన్స్ మధ్య ఉండొచ్చు. అలాగే హీరో, విలన్ మధ్య ఉండొచ్చు. ఇగో, డబ్బు, వయసు అంటూ రకరకాల ఘర్షణలు ఉంటాయి. తనచుట్టూ ఉన్న పరిస్థితులు, డబ్బు సంపాదించాలనే కోరిక అతన్ని కిడ్నాపర్‌‌‌‌గా మారుస్తాయి. తన జర్నీ ఎమోషనల్‌‌గా ఉంటుంది. స్వతహాగా నేను డబ్బులో కాకుండా చిన్న చిన్న విషయాల్లో హ్యాపీనెస్‌‌ను వెతుక్కుంటాను. ఇందులో నా పాత్ర అలా కాదు. డబ్బే సర్వస్వం అని నమ్ముతుంది. ఈ సినిమా తర్వాత నాకు యాక్షన్ సినిమాల్లో ఎక్కువ ఆఫర్స్ రావడం ఖాయం. నిజానికి నేను చాలా సెన్సిటివ్.. ఒకవేళ యాక్షన్ సీన్స్ చేయాలంటే ప్రతి ఫైట్, ప్రతి కిక్‌‌ మీనింగ్‌‌ఫుల్‌‌గా ఉండాలి.

తెలుగులో సినిమాలు చేయడం లేదని అడుగుతుంటారు. ఇక్కడి నుండి వచ్చిన మంచి స్క్రిప్ట్‌‌లకు నేనెప్పుడూ నో చెప్పలేదు. మంచి సినిమాలు చేస్తున్న వాళ్లు నాకు ఆఫర్లు ఇవ్వడం లేదంతే. నన్ను మొదటగా ఆదరించింది తెలుగు ప్రేక్షకులే. నేను వారి బిడ్డను. నాకు, వాళ్లకు మధ్య గ్యాప్ లేదు. ఇక ప్రేమకథలు చేసి విసిగిపోయా. లవ్ స్టోరీస్‌‌తో హిట్స్ వచ్చాయని అవే మళ్లీ మళ్లీ చేయడం నచ్చదు. ప్రతిసారి డిఫరెంట్‌‌గా ట్రై చేయాలనుకుంటా. ఒకవేళ నేను మళ్లీ లవ్ స్టోరీతో సక్సెస్ కొడితే.. మరో పదేళ్లు అలాంటి చిత్రాలే వచ్చే ప్రమాదం ఉంది. ప్రస్తుతం నా సొంత బ్యానర్‌‌‌‌లో ‘చిన్నా’ అనే సినిమా చేస్తున్నా. ‘ఇండియన్-2’లోనూ నటిస్తున్నా. అలాగే మాధవన్, నయనతారలతో కలిసి ‘టెస్ట్’ అనే సినిమా ఉంది. ‘టక్కర్‌‌‌‌’ డైరెక్టర్‌‌‌‌తో మరో మూవీ చేయబోతున్నా. మొత్తానికి నా నుండి ఓ ఆరు డిఫరెంట్ సినిమాలు రాబోతున్నాయి’’