నెలంతా పనిజేసినా జీతం సక్కగియ్యరా...

నెలంతా పనిజేసినా జీతం సక్కగియ్యరా...

కాగజ్ నగర్, వెలుగు: ఎండలు లెక్కచేయకుండా పారిశుద్ధ్య పనులు చేస్తే తమకు ఇవ్వాల్సిన జీతంలో కోత పెట్టారని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని డబ్బా గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు ఆరోపించారు.  మంగళవారం జీతాలు కటింగ్ చేసి ఇవ్వడం పై ఆందోళనకి దిగారు.  రెగ్యులర్ గా పనులకు హాజరైనా సర్పంచ్ తాహీర బేగం, పంచాయతీ సెక్రటరీ సురేశ్ కావాలని ఆబ్సెంట్ వేసి జీతాల్లో కోత పెట్టారన్నారు.  మూడు నెలలకు ఒకసారి జీతాలు ఇస్తున్నారని అయినా ఇప్పుడు వాటిలోనూ కోత పెడితే కుటుంబాలను పోషించడం ఎలా అని వాపోయారు.  తమకి రావాల్సిన జీతం డబ్బులు కాజేసేందుకు  చూస్తున్నారని మండిపడ్డారు. 

సర్పంచ్, సెక్రటరీ పై చట్టపరమైన చర్యలు తీసుకొని  జీతాలు  సరిగా అందేలా చూడాలని  డిమాండ్ చేశారు.  దీనిపై పంచాయతీ సెక్రటరీని వివరణ కోరగా...  గ్రామ పంచాయతీలో  కేవలం అయిదుగురు పారిశుద్ధ్య కార్మికులు మాత్రమే పనిలో పెట్టుకునే వీలు ఉందని కానీ  ప్రస్తుతం పది మంది పని చేస్తున్నారు. అయిదుగురు సగం జీతానికైనా పని చేస్తామని బాండ్ పేపర్  రాసి ఇచ్చారని ఆ తర్వాతే వారిని విధుల్లోకి తీసుకున్నామని సెక్రటరీ సురేశ్​ చెప్పారు.  వారు ఆందోళన చేయడం సరికాదన్నారు.  మహిళలకు మూడు వేలు, కారోబారి, కొందరు కార్మికులకు రూ. 8 వేల చొప్పున ఇస్తున్నామన్నారు.  ఇలా ఇవ్వడంపై గతంలోనే తీర్మానం అయిందన్నారు.