వీళ్లిద్దరూ అసాధ్యులు!

వీళ్లిద్దరూ అసాధ్యులు!

ఒక పెద్దావిడ పద్మ శ్రీ అందుకోవడానికి స్టేజ్​ వైపు నడుస్తోంది.. కాళ్లకి చెప్పులు లేవు. హలక్కీ గిరిజన తెగ సంప్రదాయ కట్టులో ఉంది.  ఆమెని చూడగానే మోడీ నమస్కారం పెట్టారు. తర్వాత  ప్రేమగా పలకరించారు కూడా. అంతలోనే పంచెకట్టుతో మరో పెద్దాయన స్టేజ్​వైపు వెళ్తున్నాడు. మెడలో తువ్వాలు చుట్టుకుని, కాళ్లకి చెప్పులు లేకుండా నడుస్తున్న ఆయన్ని చూడగానే  హాలంతా చప్పట్ల వర్షం. ఇంతకీ ఎవరు వీళ్లు? 

తాజాగా పద్మ అవార్డులు అందుకున్న వాళ్లలో 76 యేళ్ల  తులసి గౌడ, 68 యేళ్ల హరేకల హజబ్బా చాలా ప్రత్యేకం. వీళ్లిద్దరికీ చదవడం, రాయడం రాదు. ఇద్దరూ నిరుపేదలే. అయితేనేం.. డబ్బు కన్నా విలువైన మంచి మనసుంది వీళ్ల దగ్గర.  అదే నలుగురి బాగు కోసం అడుగు వేయించింది. ఆ అడుగు తులసితో 40 వేల మొక్కలు నాటించింది. బత్తాయిలు అమ్మే హజబ్బాతో స్కూల్​ కట్టించింది. వీళ్ల కృషికి దక్కిన గౌరవమే పద్మ శ్రీ. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మ అవార్డులు అందుకున్న ఈ ఇన్‌స్పిరేషనల్​పర్సనాలిటీల​ గురించి  మరిన్ని విషయాలు.

తులసివనమే అయింది

‘ఎన్​సైక్లోపిడియా ఆఫ్​ ఫారెస్ట్​’గా పేరుతెచ్చుకున్న తులసి కర్ణాటకలోని హొన్నాలిలో పుట్టింది. పుట్టిన రెండేళ్లకే తండ్రి చనిపోవడంతో తులసి జీవితం చీకటయ్యింది. పేదరికం ఆమెని చదువుకి దూరం చేసింది. పదేళ్లకే పెండ్లి పీటలు ఎక్కించింది. కాస్త ఊపిరి పీల్చుకుందాం అనుకుంటున్న టైంలో భర్త దూరమయ్యాడు. అయినా సరే కుంగిపోలేదు ఆమె. తనకి తానే బాసటైంది. ఆ బాధ నుంచి బయటికి రావడానికి  అడవి బాట పట్టింది. వందల రకాల మొక్కలు నాటింది. అవన్నీ చూసి  అటవీ శాఖ ఆమెకి కాంట్రాక్ట్​ ఉద్యోగమిచ్చింది. ప్రకృతిపై ఆమెకున్న ప్రేమ  చూసి కొద్ది రోజులకి ఆ ఉద్యోగాన్ని పర్మినెంట్​కూడా చేసింది. అలా అరవైయ్యేళ్లుగా మొక్కలే ప్రపంచం అన్నట్టు బతుకుతోందామె. రేయింబవళ్లు వాటి ఆలనాపాలనలోనే గడుపు తోంది. ఇప్పటి వరకు దాదాపు 40,000కి పైగా మొక్కలు నాటింది తులసి. రిటైరయ్యాక 
కూడా తన పెన్షన్​ డబ్బుతో మొక్కలు పెంచుతోంది.

పండ్ల రేటు చెప్పలేక..

పేద పిల్లల కోసం బడి కట్టించిన హజబ్బా సొంతూరు మంగళూరులోని న్యూపడపు. పుట్టినప్పట్నించీ పేదరికం వెంటాడుతూనే వచ్చింది అతడ్ని. దాంతో పలకా, బలపం పట్టాల్సిన వయసులో కుటుంబ భారం మోశాడు. చిన్నాచితకా పనులు చేసి తండ్రికి అండగా నిలిచాడు. కొన్నేళ్లుగా బత్తాయి పండ్లు అమ్ముతూ బతుకు ఈడ్చుకొస్తున్నాడు.  ఒక రోజు హజబ్బా  బత్తాయి బండి దగ్గరికి విదేశీయులు​ వచ్చారు. ఇంగ్లీషులో పండ్ల రేటు ఎంత? అని అడిగారు. వాళ్ల ఎక్స్​ప్రెషన్స్‌ను బట్టి వాళ్లు ఏం అడుగుతున్నారో అర్థమైంది కానీ, దానికి సమాధానం ఎలా చెప్పాలో తెలియలేదు హజబ్బాకి. దాంతో కన్నడలోనే రేటు చెప్పాడు. అది వాళ్లకి అర్థం కాక విసుక్కొని  కొనకుండా వెళ్లిపోయారు. ఆ సంఘటన చాలా ఆలోచింపజేసింది అతన్ని. ఆ ఆలోచనే తనలా మరెవరూ చదువు రాక ఇబ్బంది పడకూడదన్న ఆశయానికి ప్రాణం పోసింది. పదేళ్ల కిందట తన సంపాదనలో కొంత భాగంతో ఒక చిన్న స్కూల్​ స్టార్ట్ చేశాడు హజబ్బా. తర్వాత తర్వాత స్టూడెంట్స్​ పెరగ డంతో బత్తాయిలు అమ్మి కూడబెట్టుకున్న డబ్బుతో ఎకరం స్థలం కొని అన్ని వసతులతో స్కూల్​కట్టించాడు. అసాధ్యమనుకున్న వాటిని సాధించిన వీళ్లకు పద్మశ్రీ రావడంలో ఆశ్చర్యమేముంది.