జిల్లా సమగ్రాభివృద్ధికి యాక్షన్​ ప్లాన్ ​తయారు చేయండి : తుమ్మల నాగేశ్వరరావు

జిల్లా సమగ్రాభివృద్ధికి యాక్షన్​ ప్లాన్ ​తయారు చేయండి : తుమ్మల నాగేశ్వరరావు

భద్రాచలం/బూర్గంపాడు : భద్రాద్రికొత్తగూడెం జిల్లా సమగ్రాభివృద్ధికి యాక్షన్​ ప్లాన్​ తయారు చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలెక్టర్​ను ఆదేశించారు. కలెక్టర్​ ప్రియాంక అల, ఎస్పీ డాక్టర్​ వినీత్​తో ఆయన ఆదివారం ఐటీసీ గెస్ట్ హౌస్​లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

భద్రాచలం అభివృద్ధికి ఐటీసీ పేపర్​ బోర్డు ద్వారా సీఎస్​ఆర్​ నిధుల కేటాయింపు, సీతమ్మసాగర్​, సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయడానికి నిధులు మంజూరు, భూ సేకరణ, పోడు సమస్య, జిల్లాలో శాంతి భద్రతల పరిస్థితులు, ఆంధ్రాలో కలిసిన ఐదు పంచాయతీలు తిరిగి తెలంగాణలో విలీన ప్రక్రియ తదితర అంశాలపై చర్చించారు. మంత్రి మాట్లాడుతూ జిల్లాలో అభివృద్ధి పనులపై శాఖల వారీగా సమీక్షలు జరిపి సమగ్రమైన నివేదికలు ఇవ్వాలన్నారు.

పెండింగ్​ పనులను వేగవంతం చేయాలని సూచించారు. పరిపాలనలో నిర్లక్ష్యం, అలసత్వం, అవకతవకలకు తావు లేకుండా ప్రజలకు సుపరిపాలన అందించేందుకు అన్ని శాఖలను బలోపేతం చేయాలని చెప్పారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాలు గిరిజన ప్రాంతాలని, ఇక్కడ ఎట్టిపరిస్థితుల్లో పనుల్లో జాప్యం జరుగకుండా చూడాలన్నారు.

భద్రాచలం టౌన్​ డెవలప్​మెంట్​కు ఐటీసీ ఏటా రూ.2.50కోట్లు జిల్లా కలెక్టర్​కు అందించాలన్నారు. ఇరు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడి ఆంధ్రాలో విలీనమైన ఐదు పంచాయతీలను తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామని  చెప్పారు. భద్రాచలం పట్టణాభివృద్ధి, రహదారులు వెడల్పు, డివైడర్ల సుందరీకరణ, రామాలయం డెవలప్​మెంట్​ పై ప్రత్యేకంగా దృష్టిసారించాలన్నారు. ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు.

గోదావరి రెండో వంతెనపై రాకపోకలు జరగాలి

భద్రాచలం, వెలుగు : ఫిబ్రవరి నెలాఖరులోపు గోదావరి రెండో వంతెనపై రాకపోకలు జరగాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. కలెక్టర్​ ప్రియాంక అలతో కలిసి భద్రాచలం వద్ద గోదావరిపై నిర్మిస్తున్న రెండో వంతెన నిర్మాణ పనులను ఆయన ఆదివారం తనిఖీ చేశారు. 2015లో తాను కేంద్ర మంత్రి గడ్కరీతో కలిసి ఈ వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తే నేటి వరకు పనులు చేయకుండా సాగదీస్తున్నారని కాంట్రాక్టర్లపై అసంతృప్తి వ్యక్తం చేశారు.  

రూ.100కోట్ల పనులు పూర్తి కావాలంటే పదేళ్ల సమయం కావాలా? అని నేషనల్​ హైవే ఇంజనీర్లను ప్రశ్నించారు. తక్షణమే పనులు ప్రారంభించాలని చెప్పారు. రోజువారీ పని నివేదికలు తనకు ఇవ్వాలని కలెక్టర్​ను కోరారు. భద్రాచలానికి దేశ, విదేశాల నుంచి భక్తులు వస్తుంటారని, డివైడర్లు, ఫుట్​పాత్​లు సుందరంగా తయారు చేయాలని సూచించారు.

అందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు. అప్రోచ్​ రోడ్డుకు మట్టి దొరకడం లేదని సైట్​ ఇంజినీర్​ చెప్పడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మట్టేమైనా చంద్రమండలం నుంచి తెస్తారా.?అంటూ నిలదీశారు. పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్​ కు ఆయన బాధ్యతలు అప్పగించారు. దీనితో కలెక్టర్​ సంబంధిత అధికారులు, ఏజెన్సీలు సమగ్ర నివేదికలతో కొత్తగూడెంలోని తన కార్యాలయానికి రావాలని ఆదేశించారు. మంత్రి వెంట ఎస్పీ డాక్టర్​.వినీత్​, నేషనల్ హైవే ఈఈ యుగంధర్​, ఆర్డీవో మంగీలాల్​ ఉన్నారు.