ఎమ్మెల్యే గురించి మాట్లాడ్తే చంపి బొందపెడ్తం.. ఎమ్మెల్యే గాదరి కిషోర్ అనుచరుల వీరంగం 

ఎమ్మెల్యే గురించి మాట్లాడ్తే చంపి బొందపెడ్తం.. ఎమ్మెల్యే గాదరి కిషోర్ అనుచరుల వీరంగం 
  • ఎమ్మెల్యే గురించి మాట్లాడ్తే.. చంపి బొందపెడ్తం
  • తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ అనుచరుల వీరంగం 
  •  దళితులపై ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు 
  • ఖండిస్తూ మాట్లాడిన అడ్వకేట్ యుగేందర్​పై దాడి  
  • కిషోర్ అనుచరులపై చర్యలు తీస్కోవాలంటూ అఖిలపక్షం డిమాండ్ 
  • కనీసం కేసు కూడా నమోదు చేయని పోలీసులు

సూర్యాపేట, వెలుగు:  సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ అనుచరులు వీరంగం సృష్టించారు. దళితులపై ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన అడ్వకేట్ పర్రిపాటి యుగేందర్​పై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేసి కొట్టారు. ఎమ్మెల్యే గురించి మాట్లాడితే చంపి బొంద పెడ్తామని బెదిరించారు. తిరుమలగిరి మండలం పైలెట్ ప్రాజెక్ట్ దళిత బంధులో గాదరి కిషోర్ అనుచరులు సగానికి సగం దోచుకున్నారంటూ కొంతకాలంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తున్నారు. శుక్రవారం తిరుమలగిరి బీఆర్‌‌ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్, బీజేపీ, ఎమ్మార్పీఎస్, అఖిలపక్ష కొడుకులకు దళిత బంధు అందింది’’ అంటూ కామెంట్లు చేశారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలకు 24 గంటల్లోగా క్షమాపణలు చెప్పాలని శనివారం అఖిల పక్ష భేటీలో నాయకులు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వాఖ్యలను ఖండిస్తూ అడ్డగూడూరుకు చెందిన అడ్వకేట్ యుగేందర్ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. ఆయన కారులో తిరిగి వెళ్తుండగా.. తిరుమలగిరి మోడల్ స్కూల్ వద్ద ఎమ్మెల్యే అనుచరుడు కందుకూరి ప్రవీణ్, మరికొందరు అడ్డుకున్నారు. కారు అద్దాలు పగులగొట్టి, కర్రలతో దాడి చేశారు. యుగేందర్​ను స్థానికులు సూర్యాపేట జనరల్ హాస్పిటల్​కు తరలించారు. ఇంత పెద్ద దాడి జరిగినా.. బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. యుగేందర్​ను సూర్యాపేట దవాఖానలో అఖిల పక్ష నేతలు బీఎస్పీ చీఫ్ ఆర్​ఎస్ ప్రవీణ్ కుమార్, చెరుకు సుధాకర్, ఏపూరు సోమన్న, సంకినేని వరుణ్ రావు, గుడిపాటి నర్సయ్య, మల్లేపాక సాయిబాబు శనివారం పరామర్శించారు. ఆర్ఎస్​ ప్రవీణ్‌‌కుమార్​ మాట్లాడుతూ, దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గాదరి కిషోర్​పై పీడీ యాక్ట్ నమోదు చేయాలని డిమాండ్‌‌ చేశారు. దాడికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి జగదీశ్ రెడ్డిని బర్తరఫ్ చేయాలన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ దళితులను థర్డ్ క్లాస్ ఫెలోస్‌‌ అంటూ వ్యాఖ్యలు చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు.  ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియాపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్టే కిషోర్‌‌‌‌పై కూడా నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దాడిపై  హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని కోరారు. గాదరి కిషోర్ 24 గంటల్లో క్షమాపణలు చెప్పాలని, దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలని చెరుకు సుధాకర్ డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. 

దళితులను అవమానించారు 

దళితబంధులో అక్రమాలు జరిగాయని స్వయంగా సీఎం కేసీఆర్ చెప్పారు. దళితబంధు స్కీంలో ఎమ్మెల్యే, ఆయన అనుచరులు 50 శాతం కమీషన్ తీసుకున్నారు. కమీషన్ తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తే.. ఒక దళిత ఎమ్మెల్యేనే దళితులను కొడుకులు అంటూ అవమానించారు. తుంగతుర్తిలో ఆయన 2014 నుంచి గూండాలను పోషిస్తున్నారు. యుగేందర్ పై దాడిని అడ్వకేట్ అసోసియేషన్ ఖండించాలి.  
- సంకినేని వరుణ్ రావు, బీ‌‌జే‌‌వై‌‌ఎం రాష్ట్ర అధికార ప్రతినిధి

 ఇంటికి వచ్చి చంపుతామన్నరు  

ఎమ్మెల్యే గాదరి కిషోర్ దళితులను ఉద్దేశించి మాట్లాడితే ఖండించినందుకు నన్ను చంపించేందుకు ప్రయత్నించిండు. దళితుడై ఉండి దళితులతో దాడులు చేయిస్తున్నడు. కిషోర్ ప్రధాన అనుచరుడు కందుకూరి ప్రవీణ్ కుమార్ ఈ దాడికి పాల్పడ్డాడు. ఎమ్మెల్యే గురించి మాట్లాడితే ఇంటికి వచ్చి చంపుతామని బెదిరించాడు. ఇకపై గాదరి కిషోర్ ఓటమి కోసమే పని చేస్తా.   
- పర్రిపాటి యుగేందర్, అడ్వకేట్