పసుపు వ్యాపారుల మాయాజాలం .. నూటికి రూ.2 చొప్పున కటింగ్‌‌ 

పసుపు వ్యాపారుల మాయాజాలం .. నూటికి రూ.2 చొప్పున కటింగ్‌‌ 
  • తక్‌‌పట్టీ రాసిచ్చినా కొనుగోలు లావాదేవీలన్నీ తెల్లపేపర్‌‌‌‌పైనే..
  • జగిత్యాల, మెట్​పల్లి మార్కెట్లలో ఇప్పటిదాకా రూ.40 కోట్ల వ్యాపారం
  • ఏటా సుమారు రూ. 2 కోట్లు నష్టపోతున్న రైతులు 

మెట్ పల్లి, వెలుగు: జగిత్యాల జిల్లాలోని వ్యవసాయ మార్కెట్లలో పసుపు రైతులను వ్యాపారులు నిండా ముంచుతున్నారు. క్యాష్‌‌ కటింగ్‌‌ పేరిట నూటికి రూ.2చొప్పున కటింగ్‌‌ పెడుతున్నారు. మార్కెట్లలో వ్యాపారులు, కమీషన్‌‌ ఏజెంట్లు కుమ్మక్కై ఈ దందా నడిపిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఓ వైపు తూకాల్లో మోసం చేస్తూ, మరోవైపు క్యాష్‌‌ కటింగ్‌‌, ఇతర ఖర్చుల పేరిట రైతులను దోపిడీ చేస్తున్నారు.

గతేడాది నుంచి ఇప్పటిదాకా మెట్‌‌పల్లి మార్కెట్‌‌లో  రూ.35 కోట్లు, జగిత్యాల మార్కెట్​లో రూ.5కోట్లకు పైగా పంట కొనుగోళ్లు జరిగాయి. ఈ కొనుగోళ్లలో సుమారు రూ.2కోట్ల దాకా క్యాష్‌‌ కటింగ్‌‌ పేరిట దోచుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెగుళ్లు సోకి దిగుబడి లేక, పండిన పంటకు మద్దతు ధర లేక ఇబ్బందులు పడుతున్న రైతులకు క్యాష్ కటింగ్​ తీవ్ర నష్టం చేస్తోంది.   

జిల్లాలో 22వేల ఎకరాల్లో సాగు 

 జగిత్యాల జిల్లాలో ఈ ఏడాది 22 వేల ఎకరాల్లో పసుపు సాగయింది. సాధారణంగా రైతులు పంట చేతికొచ్చాక వ్యవసాయ మార్కెట్‌‌లో తమకు పరిచయమున్న ఏజెంట్ల వద్దకు తీసుకొస్తారు. ఈనామ్‌‌ రూల్స్‌‌ ప్రకారం.. ఏజెంట్లు 2 శాతం లెక్కన కమీషన్‌‌ తీసుకొని వ్యాపారులకు అమ్మి, 24 గంటల్లో రైతులకు డబ్బు ముట్టజెప్పాలి. కానీ జిల్లాలోని మార్కెట్లలో వ్యాపారులు 15 రోజులైనా చెల్లింపులు చేయడం లేదు. చెల్లింపు టైంలోనూ వ్యాపారులు రూ. 2 శాతం కోత  విధిస్తున్నారు.  తాము డబ్బు వడ్డీకి తీసుకొచ్చి ఇస్తున్నామని అందుకే  రూ.2శాతం కటింగ్‌‌ పెడుతున్నామని వ్యాపారులు చెప్పడం గమనార్హం. 

ఈనామ్‌‌లో అమ్ముకున్నా కటింగ్‌‌ తప్పడం లేదు 

మెట్ పల్లి, జగిత్యాల మార్కెట్లలో ఏటా వేల క్వింటాళ్ల పసుపు అమ్మకాలు జరుగుతాయి. రైతుల తమ పంటను మార్కెట్‌‌కు తీసుకురాగానే సిబ్బంది ఆన్ లైన్ టోకెన్ ఇస్తారు. ఆ తర్వాత ఈ నామ్ ద్వారా ఆన్ లైన్ లోనే అమ్మకాలు చేస్తారు. పంట కొనుగోలు చేసిన వ్యాపారి 24 గంటల్లోనే పేమెంట్‌‌ చేయాలని రూల్స్​ఉన్నా ఇక్కడి రైతులు వాటిని పట్టించుకోవడం లేదు. క్యాష్ కటింగ్ పేరిట 2 శాతం కట్ చేస్తున్నారు.

ఈ ఏడాది పసుపు మోడల్ రేటు క్వింటాల్‌‌కు రూ. 12 వేలు ఉంది. ఈ లెక్కన రూ. 100 కోట్ల వ్యాపారం జరుగుతుంది. ఒక్క మెట్‌‌పల్లి మార్కెట్‌‌లోనే గతేడాది నుంచి ఇప్పటివరకు 25 వేల  క్వింటాళ్ల అమ్మకాలు జరిగాయి. క్వింటాల్‌‌కు రూ.12వేల చొప్పున రూ. 35 కోట్లకు  పైగా, జగిత్యాల మార్కెట్​లో  ఇప్పటిదాకా 7వేల క్వింటాళ్ల అమ్మకాలు జరగగా రూ.5కోట్లకు పైగా వ్యాపారం జరిగింది.

 2శాతం ఈ లెక్కన కటింగ్‌‌ పేరుతో రైతులు సుమారు రూ.2కోట్ల వరకు నష్టపోయారు.  పసుపు అమ్మిన వెంటనే పంట క్వాంటిటీ, రేటుతో సహా చెల్లించాల్సిన డబ్బు వివరాలు తక్‌‌పట్టీలో రాసి, మరో తెల్లకాగితంపై క్యాష్‌‌ కటింగ్​ చేసి రాసిస్తున్నారని రైతులు వాపోతున్నారు. పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరగడం, పంట కొనే వ్యాపారుల వద్దే అప్పులు తీసుకోవడంతో పైసలు కటింగ్​ పెట్టినా మౌనంగా ఉండాల్సి వస్తోందని  రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.