టొబాకో బోర్డులా పసుపు బోర్డు ఉండాలె : డా. దొంతి  నర్సింహారెడ్డి

టొబాకో బోర్డులా పసుపు బోర్డు ఉండాలె : డా. దొంతి  నర్సింహారెడ్డి

ప్రపంచంలో పసుపు ఉత్పత్తి, వినియోగం, ఎగుమతిలో భారత్ అగ్రస్థానంలో ఉంది. పసుపు అందానికి, ఆరోగ్యానికి ఉపయోగించే ఔషధం. ఈ ఔషధ పంటలో భారతదేశంలో అనేక యేండ్ల నుంచి అగ్ర స్థానంలో ఉంది. రోజూ వంటలో వాడు తున్న భారతీయులు దీనిని ఆహారంగా భావిస్తారు. బహుశ, కరోన సమయంలో భారతీయులను కాపాడిన కిటుకులలో ఇది ఒకటి. ఈ పంటను, పండించే రైతులను, అవసరమైన విధానాలను గత 70 ఏండ్లలో పట్టించుకోని ప్రభుత్వాలు ఇప్పటికైనా పట్టించుకోవాల్సిన అవసరం వచ్చింది. ప్రమాదకర రోగాలకు, క్యాన్సర్ ఇంకా ఇతర ప్రాణాంతక వ్యాధులకు దివ్యౌషధం పసుపు అని మన ప్రాచీన ఆరోగ్య గ్రంథాలు, ఆధునిక శాస్త్రం చెబుతున్నా కూడా పాలకులకు ఇంతకాలం ఈ పంట పట్ల కనీస సోయి లేకపోవడం దురదృష్టకరం. ప్రపంచ పసుపు ఉత్పత్తిలో  భారత్ 75 శాతానికి పైగా ఉంది. దేశంలోని 20కి పైగా రాష్ట్రాల్లో పసుపు పండిస్తారు. దేశంలో 16.6 శాతం పసుపును ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం తెలంగాణ. 

ప్రపంచ పసుపు వాణిజ్యంలో భారత్ వాటా 62 శాతానికి పైగా ఉంది. 2022-–23లో 380 మందికి పైగా ఎగుమతిదారులు 207.45 మిలియన్ డాలర్ల విలువైన 1.534 లక్షల టన్నుల పసుపు, పసుపు ఉత్పత్తులను ఎగుమతి చేశారు. భారత పసుపునకు ప్రధాన ఎగుమతి మార్కెట్లు బంగ్లాదేశ్, యుఎఇ, అమెరికా (యుఎస్ఎ), మలేషియా.  యూకే, మొరాకో, జర్మనీ, జపాన్ తదితర దేశాలు కూడా దిగుమతి చేసుకుంటున్నాయి.  పసుపును మనం ఎగుమతి చేస్తూ, ఇపుడు దిగుమతి  చేసుకునే పరిస్థితికి దిగజారిపోతున్నాం. ఇది ఆశ్చర్యం కలిగిస్తున్నది.

భారంగా మారుతున్న పెట్టుబడి

పసుపు విస్తీర్ణం దేశ వ్యాప్తంగా తగ్గుతున్నది. రైతులకు ఎకరాకు రూ.60 వేల నుంచి 70 వేల వరకు ఖర్చు వస్తున్నది. మార్కెట్లో డిమాండ్ ఉన్నా, రైతుకు గిట్టుబాటు ధర రావడం లేదు. జాతీయ ఏకీకృత మార్కెట్ ద్వారా కొనుగోలుదారులు పెరుగుతారు, రైతుకు ఉపయోగపడతదని భావించినా నిజామాబాద్​లో ఫలితం కానరాలేదు. పసుపు పంటకు ప్రభుత్వం ప్రమాణాలు తయారు చేసి,  ప్రకటించివుంటే వ్యాపారం సులువు అయ్యేది అని పసుపు రైతుల సమాఖ్యలు అంటున్నాయి. మన దేశంలో పసుపును పూజకు, వంటకు, మందుకు, సౌందర్యానికి వాడుతున్న నేపథ్యంలో తగినంత ఉత్పత్తి లేక, సరఫరా లేక, కల్తీ పెరిగింది. 

తెలంగాణలో పసుపు రైతులపై నిర్లక్ష్యం

పసుపు ఉత్పత్తిలో తెలంగాణ ఉన్నత స్థానంలో ఉన్నా, ఏటా దాదాపు రూ.200 కోట్ల విలువ అయిన ఉత్పత్తి దేశానికి అందిస్తుండగా, భారత ‘ఎగుమతి’ ప్రతిష్టను అనేక సంవత్సరాలుగా కాపాడుతున్న పరిస్థితి ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం గత 9 ఏండ్లలో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ఈ వైఖరి వల్ల రైతులు నష్టపోతున్నారు. కోట్లాది ప్రజల రోజువారీ ఆహారం, అందం, ఆరోగ్యం, ఆధ్యాత్మిక అవసరాన్ని తీర్చుతున్న పసుపుకు కనీస మద్దతు ధర నిర్ణయించటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెనుకాడుతున్నాయి. ఈ నిర్లక్ష్యం వలన తెలంగాణా పసుపు విస్తీర్ణం దారుణంగా పడిపోయింది. రైతులకు గిట్టుబాటు ధర రాకపోవడంతో పసుపు పంట వేయడం మానేస్తున్నారు. ఒకప్పుడు 50 వేల ఎకరాల పైన ఉన్న పంట విస్తీర్ణం ఇప్పుడు 10 వేల ఎకరాలకు తగ్గిపోవడం, రైతుకు ఆదాయం లేకపోవడం వల్లనే.

ప్రత్యేక చట్టం అవసరం

పసుపు పండించే రైతుల బాగోగులు చూసుకునే సంస్థగా పసుపు బోర్డును మలచాల్సిన అవసరం ఉన్నది.  పసుపు ఉత్పత్తి పెరిగి, దేశీయంగా వినియోగం  పెరిగితే భారత పౌరుల ఆరోగ్యం పెరుగుతుంది. కాబట్టి, పసుపు బోర్డు ఏర్పాటు ఒక ప్రత్యెక చట్టం ద్వారా చేస్తే సంస్థ దృఢంగా, సుస్థిరంగా ఉంటుంది. నిధులు కూడా విధిగా, చట్ట ప్రకారం కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి పొందే అవకాశం వస్తుంది. మొదట్లో కేంద్ర నిధులు అవసరం అవుతాయి. తరువాత, ఎగుమతుల నుంచి, పరిశ్రమల నుంచి సొంత నిధులు సమకూర్చుకోవచ్చు. ఇప్పటికిప్పుడు, కేంద్ర ప్రభుత్వం కనీసం రూ.1000 కోట్ల బడ్జెట్ ఇవ్వాలి. తెలంగాణ ప్రభుత్వం కూడా కనీసం రూ.500 కోట్లు ఖర్చు చెయ్యాలి. ఈ రెండు నిధులు రైతులకు గిట్టుబాటు ధర అందించి, వాళ్ళ ఆదాయం పెంచడానికి అధికంగా ఉపయోగించాలి. క్వింటాలుకు రూ.14 వేల కనీస ధర వచ్చేలా తెలంగాణ  ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సమన్వయంతో, చర్యలు తీసుకోవాలి.

పంట విధానం, ధర నియంత్రణ బోర్డు బాధ్యత కావాలె

దిగుమతులను నియంత్రిస్తూ దేశీయంగా పసుపు ఉత్పత్తి పెంచే విషయంలో విధానపరమైన జోక్యం చాలా అవసరం. ప్రభుత్వం పరిష్కరించాల్సిన కీలకమైన సమస్య ఇది. ఈ లక్ష్యసాధనలో శాస్త్రీయ సాగు పద్ధతులు, సహజ వ్యవసాయ పద్దతులను అవలంబిస్తూ పసుపులో కర్కుమిన్ శాతం పెంచుతూ సాగు విస్తీర్ణాన్ని పెంచడంపై దృష్టి పెట్టడం, ధరల హెచ్చుతగ్గులను నియంత్రించే యంత్రాంగాన్ని రూపొందించడం పసుపు బోర్డుకున్న ప్రాథమిక లక్ష్యంగా ఉండాలి. సామాన్య వినియోగదారులకు నాణ్యమైన పసుపు అందుబాటులో ఉండే విధంగా పసుపు బోర్డు ప్రమాణాలు తయారు చేసి, నిబంధనలు ప్రకటించి, యంత్రాంగం ఏర్పాటు చెయ్యాలి.

పసుపు రంగం పెరుగుదలకు..

పసుపునకు కనీస మద్దతు ధర రూ.10,500 (క్వింటాలుకు) వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఏటా, పసుపు కనీస మద్దతు ధర రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించాలి. పసుపు ఆరోగ్యానికి అన్ని రకాల ఉపయోగం, ఉపయుక్తం కనుక ప్రభుత్వం పసుపు పండించే రైతులను గుర్తించి, ప్రోత్సాహకాలు ఇవ్వాలి. అధిక దిగుబడినిచ్చే, మార్కెట్ అవసరాల కు సరిపోయే విత్తన రకాలకు విస్తృత ప్రచారం కల్పించాలి. 

కేంద్ర వాణిజ్య వ్యవహారాల శాఖ పరిధిలో ఉన్న ఎగుమతి ప్రోత్సాహక పథకాలు, తద్వారా నిధులు, ఈ ప్రాంతంలో ఉపయోగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక అధికారిని నియమించి లక్ష్యం పూర్తి అయ్యేవరకు చర్యలు చేపట్టాలి. తెలంగాణ ప్రజా ప్రతినిధులు అందరూ, అన్ని రాజకీయ పార్టీలు, ఈ దిశగా ఇక్కడి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి. పసుపు మీద రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారం చాల తక్కువ. తెలంగాణాలో పసుపు పని చేసే శాస్త్రవేత్తలు, వ్యవసాయ పరిశోధన కేంద్రాలు లేకపోవడం స్పష్టంగా కనిపిస్తుంది. వ్యవసాయ పరిశోధనలు లేక, స్వతహాగా పరిశోధన చేసే పసుపు రైతులకు ప్రోత్సాహం లేక, పసుపు రకాలలో కృషి తగ్గిపోతున్నది. 

విస్తృత బాధ్యతలతో బోర్డు పనిచేయాలి
 

పసుపుకు ఉన్న డిమాండ్ బట్టి బహిరంగ వేలం పద్ధతి వల్ల ఫలితం వస్తుందా అధ్యయనం చేయాలి. తెలంగాణణాలో కనీసం మూడు ప్రత్యేక పసుపు మార్కెట్ యార్డులు పెట్టాలి. కేంద్ర వ్యవసాయ శాఖ అమలు చేస్తున్న పథకాలు  తెలంగాణ పసుపు రైతులకు కూడా వర్తింప జేయాలి. ప్రధాన మంత్రి భీమా యోజన పసుపు రైతులకు కూడా వర్తించేవిధంగా చూడాలి.రాష్ట్ర స్థూల వ్యవసాయ ఆదాయంలో పసుపు ఉత్పత్తి, వ్యాపారం పొందుపరచాలి. పంట సేకరణకు ఉపయోగపడే పసుపు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తే రైతులకు భరోసా ఉంటుంది. 

ముఖ్యమంత్రి దగ్గర వున్న రూ.5 వేల కోట్ల నిధులు దీనికి ఇవ్వాలి. నిజామాబాద్​ జిల్లాలో ఉన్న పసుపు పరిశోధన కేంద్రం బలోపేతానికి నిధులిచ్చి పరిశోధన విస్తృతం చేసి, రైతులకు ఉపయోగపడే దేశి రకాలను అందుబాటులోకి తీసుకురావాలి. అంతర్జాతీయంగా పసుపు మీద మనకున్న ప్రథమ స్థానం నిలబెట్టుకుని, ప్రపంచ వాణిజ్యంలో 70, -80 శాతం సరఫరా మన గుప్పిట్లో ఉండే విధంగా పసుపు బోర్డు అధికారాలను, పరిధిని నిర్ణయించాలి. అవసరమైన వనరులను తక్షణమే అందించాలి. టొబాకో, మసాల దినుసుల బోర్డులలాగా, గట్టి పసుపు బోర్డు కోసం ప్రత్యేక చట్టం చేయాలి.

బలమైన బోర్డు కావాలె

పసుపు బోర్డు ఏర్పాటు చెయ్యాలి అనే డిమాండ్ మేము 2006 నుంచి చేస్తున్నాం. ఆరోగ్యానికి హాని చేసే టొబాకోకు ఒక బోర్డు 1975లోనే ఏర్పాటు అయ్యింది. అనేక సంవత్సరాల ఒత్తిడి ఫలితంగా, ఇటీవల జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్లో చాల బలహీనతలు ఉన్నాయి. పసుపు రైతు ఎదుర్కొంటున్న సమస్యలకు దీటుగా పసుపు బోర్డు నిర్మాణం జరగాలి. కాగా, మూడు బోర్డులు - టొబాకో, మసాలా దినుసులు, పసుపు బోర్డు – ఏర్పాటు ఉద్దేశ్యాలు పోలిస్తే పసుపు బోర్డు ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వం వైఖరిలో లోటు కనిపిస్తున్నది. 

మొదటి రెండు బోర్డులకు ప్రత్యేక చట్టం దన్ను ఉన్నది. వాటి పని కూడా చాల వివరంగా, లోతుగా చట్టంలో నిర్వచించారు. పొగాకు బోర్డు చట్టం, 1975లోని సెక్షన్ 16 ప్రకారం, కేంద్ర ప్రభుత్వం పొగాకు బోర్డుకు గ్రాంట్లు లేదా రుణాల రూపంలో నిధులు అందించాలి. అయితే, వివిధ మార్గాలలో ఈ బోర్డు తన నిధులను పెంచుకున్నది. 1991-92 నుంచి ప్రభుత్వ నిధులు అడగడం లేదు. అయినా 2021–-22లో రూ.1000 కోట్లకు పైగా  టర్నోవర్​కు చేరుకున్నది. 

- డా. దొంతి  నర్సింహారెడ్డి, పాలసీ ఎనలిస్ట్