
కీడెంచి మేలెంచమన్నారు పెద్దలు! కీడులోనూ మేలు తీసుకుందామంటున్నారు సైంటిస్టులు. ఇంతకీ ఏమా కీడు.. ఏమా మేలు? పర్యావరణ మార్పులకు పెద్ద కారణం కార్బన్ డై ఆక్సైడ్. వాహనాలు, పరిశ్రమలు వెదజల్లే పొగతో కార్బన్ డై ఆక్సైడ్ విడుదలై భూమిని వేడెక్కిస్తోంది. దీంతో దునియాలోని దేశాలన్ని కలిసి ఆ విష వాయువును ఎట్లైనా సరే తగ్గించేసేయాలని డిసైడ్ అయ్యి, ఒప్పందాలూ చేసుకున్నాయి. మరి, ఆ విషవాయువును తగ్గించడమొక్కటే సమస్యకు పరిష్కారమా? వేరేది లేదా? అంటే.. ఎందుకు లేదూ.. భేషుగ్గా ఉందంటున్నారు సైంటిస్టులు.
కార్బన్ డై ఆక్సైడ్ విడుదలను తగ్గించలేనప్పుడు, మనిషికి ఉపయోగపడేలా దానిని మార్చుకోవడమే దానికి మెరుగైన పరిష్కారమని చెబుతున్నారు. విషమంటున్నారు.. మళ్లీ దాన్నే వాడుకోవచ్చంటున్నారు ఎలాగబ్బా అన్న సందేహం వచ్చింది కదా. టెక్నాలజీ కార్బన్ డై ఆక్సైడ్‌ను అడ్డుకుని పర్యావరణ మార్పులకు పరిష్కారం చూపించలేకపోవచ్చుగానీ, సాయం మాత్రం చేస్తుందంటున్నారు. ఇంధనాలు తయారు చేయడం, పాలీమర్లు, ఎరువులు, ప్రొటీన్లు, ఫోంలు, బిల్డింగ్ బ్లాకులు కట్టొచ్చని నిరూపిస్తున్నారు. మంచిగా ఆలోచిస్తే ముడి కార్బన్‌డై ఆక్సైడ్ నుంచి మంచి బిజినెస్ చేసుకోవచ్చంటున్నారు. బ్రిటన్‌లోని షెఫీల్డ్ యూనివర్సిటీకి చెందిన కార్బన్ యుటిలైజేషన్ సెంటర్ మేనేజర్ కేటీ ఆర్మ్‌స్ట్రాంగ్ దానిపై సలహాలిచ్చారు. ‘‘మనం బతుకుతున్న తీరుకు తగ్గట్టు ప్రొడక్ట్‌లను ఉత్పత్తి చేయాలి. చేసిన ప్రతిదానికీ ఓ ఫలం అనేది ఉంటుంది. కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలను పెంచకుండా ప్రొడక్ట్‌లను తయారు చేయాలి. అలా జరగాలంటే వేస్ట్ కార్బన్ డై ఆక్సైడ్‌ను ఉత్పత్తులుగా మలచాలి” అని కేటీ అన్నారు. అందుకు తగ్గట్టు చాలా చిన్న కంపెనీలు కార్బన్ డై ఆక్సైడ్‌ను చాలా బాగా వాడుకుంటున్నాయని చెబుతున్నారు. ఆ మూడు కంపెనీలు ఏం చేశాయి? అందులో ఎలా సక్సైస్ అయ్యాయో చెప్పారు.
కార్బన్ డై ఆక్సైడ్ ఎరువు
బ్రిటన్‌లోని స్విండన్ అనే ఓ చిన్న పట్టణం ఉంది. అక్కడ సీసీఎం టెక్నాలజీస్ అనే ఓ కంపెనీ ఉంది. అది కూడా చిన్నదే. ఆ కంపెనీ కార్బన్ డై ఆక్సైడ్తోనే ఎరువును తయారు చేసింది. బయో డైజెస్టర్‌లో జొన్నలు, ఆవు పేడను వేసి కలిపారు. దీంతో ఓ బ్యాక్టీరియా వాటిని విచ్ఛిన్నం చేసి బయోగ్యాస్‌ను విడుదల చేశాయి. మిగతా అంతా వేస్టే కదా. ఆ వేస్ట్‌ను ఎరువుల ఫ్యాక్టరీల నుంచి మిగిలిపోయిన పోషకాలు పుష్కలంగా ఉండే వేస్ట్‌తో కలిపి ఎరువును తయారు చేశారు. దానికి కార్బన్ డై ఆక్సైడ్‌ను పట్టించడం వల్ల అది మరింత పోషకంగా మారింది. అంటే కార్బన్ డై ఆక్సైడ్‌లో మగ్గించిన పెల్లెట్స్ అన్న మాట అవి. దాన్ని పంట పొలాలకు లేదా ఫుడ్ ఇండస్ట్రీకి వాడొచ్చు. ఇప్పటికే ఆ కంపెనీకి ఎగుమతుల ఆర్డర్లు వచ్చేశాయి.
బీర్ బబుల్స్..
బ్రిటన్‌లోని సఫోక్ పట్టణంలో స్ట్రట్ అండ్ పార్కర్ ఫార్మ్స్ అనే కంపెనీ ఉంది. ఆ కంపెనీ తవుడు, గుర్రం పెండను కలిపి బయోడైజెస్టర్లో ఉంచారు. బయోగ్యాస్‌తో పాటు కార్బన్ డై ఆక్సైడ్‌ను తయారు చేశారు. అడ్వాన్స్డ్ మెంబ్రేన్ల సాయంతో ఫుడ్ బివరేజెస్లో వాడే కార్బన్ డై ఆక్సైడ్‌ను వేరు చేశారు. అలా తయారైన స్వచ్ఛమైన కార్బన్ డై ఆక్సైడ్‌ను స్థానిక బ్రూవరీ (కూల్ డ్రింకులు, బీర్లు తయారు చేసే కంపెనీ)కి అమ్మారు. బీర్లు, లెమనేడ్ (నిమ్మకాయతో చేసే సోడా లాంటిది)ల తయారీకి కంపెనీ ఆ కార్బన్ డై ఆక్సైడ్‌ను వాడుతోంది.
ఎంత కావాలి?
ఏటా 37 గిగాటన్నుల కార్బన్ డై ఆక్సైడ్ గాల్లో కలుస్తోంది. మరి, దాంట్లో ఎంత మొత్తంలో వాడుకోవచ్చు అన్న ప్రశ్నలు తలెత్తాయి. 7 గిగాటన్నుల కార్బన్ డై ఆక్సైడ్ వరకూ వాడుకోవచ్చని సైంటిస్టులు అంటున్నారు. అలా అయినా, కొంతలో కొంతైనా విష వాయువులు తగ్గుతాయి కదా అని అంటున్నారు. చెడులోనూ మంచి దొరికింది కదా!! ఇలాంటివి చేస్తే పుడమిని కాపాడుకోవచ్చంటున్నారు.
బిల్డింగ్ బ్లాకులు
అవే కాదు, కార్బన్ డై ఆక్సైడ్తో బిల్డింగ్ బ్లాకులూ తయారు చేయొచ్చని నిరూపించిందో కంపెనీ. లీడ్స్‌లోని కార్బన్ 8 అగ్రిగేట్స్ అనే కంపెనీ, ఇన్సినరేటర్ ప్లాంట్ల నుంచి విడుదలయ్యే బూడిదను తీసుకుంది. ఆ బూడిదను కార్బన్ డై ఆక్సైడ్, నీళ్లతో కలిపింది. ఆ మిశ్రమంలో కార్బన్ డై ఆక్సైడ్ మొత్తం కలిసిపోయేలా చాలా ఎక్కువ వేడి వద్ద దానిని మరిగించింది. తద్వారా బిల్డింగ్ బ్లాకులకు ఉపయోగపడే లైమ్‌స్టోన్‌ను తయారు చేసింది. దీని వల్ల ఆ బూడిదను వృథాగా పడేయడం కన్నా ఇలా ఉపయోగపడే వస్తువును తయారు చేశారు. దీని వల్ల కార్బన్ డై ఆక్సైడ్‌ను ఎక్కువగా గాల్లోకి వదిలే సిమెంట్ వాడకాన్ని కూడా బాగా తగ్గించొచ్చు. ఇప్పుడు ఆ సంస్థ ఆ బిల్డింగ్ బ్లాకులను బయటి దేశాలకు ఎగుమతి చేస్తోంది.