లూటీ చేయడమే డీఎంకే పని.. స్టాలిన్ ప్రభుత్వంపై టీవీకే చీఫ్ విజయ్ ఫైర్

లూటీ చేయడమే డీఎంకే పని.. స్టాలిన్ ప్రభుత్వంపై టీవీకే చీఫ్ విజయ్ ఫైర్

చెన్నై: ప్రజలను, రాష్ట్రాన్ని లూటీ చేయడం అధికార డీఎంకేకు అలవాటైందని టీవీకే చీఫ్, సినీ నటుడు విజయ్ విమర్శించారు. ఇసుక అక్రమ మైనింగ్‎తో రూ.4,730 కోట్ల ప్రజాధనాన్ని స్టాలిన్ ప్రభుత్వం దోచుకుందని ఆయన ఆరోపించారు. కరూర్‎లో తొక్కిసలాట జరిగిన రెండు నెలల తర్వాత విజయ్ మళ్లీ తన ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆదివారం కాంచీపురంలోని ఓ ఆడిటోరియంలో నిర్వహించిన సభకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు, మద్దతుదారులు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. వారిని ఉద్దేశిస్తూ విజయ్ మాట్లాడారు.

అధికార డీఎంకే పార్టీ వారసత్వ రాజకీయాలు చేస్తోందని ఫైర్ అయ్యారు. ఆ పార్టీ వ్యవస్థాపకుడు సీఎన్ అన్నాదురై ‘ప్రజల వద్దకే వెళ్లండి’ అన్న సిద్ధాంతాన్ని డీఎంకే మరిచిపోయిందని మండిపడ్డారు. ‘‘డీఎంకే ఐడియాలజీ గురించి అధికార పార్టీ నేతలు గొప్పలు చెప్పుకుంటారు. కానీ వాస్తవంలో పార్టీ సిద్ధాంతాలు, భావజాలాన్ని వారు తాకట్టుపెట్టారు. కాంచీపురం ప్రాంతానికి పలార్  నది ప్రాణాధారనది. 

అలాంటి నదిలో పరిమితికి మించి ఇసుక మైనింగ్ చేసి రూ.4,730 కోట్లు లూటీ చేశారు. 22.70 లక్షల యూనిట్ల ఇసుకను తరలించారు. ఇలా ఇసుక దోపిడీ చేస్తూ పోతే.. నదులు నాశనమవుతాయి. నదులు లేకపోతే వ్యవసాయం ఉండదు. వ్యవసాయం నాశనమైతే రైతులు ఉండరు. మొత్తంగా మానవాళి తుడిచిపెట్టుకుపోతుంది. లూటీ చేయడానికే ఒక పార్టీ (డీఎంకే) సిండికేట్‎ను ఏర్పాటు చేయడం ఎక్కడైనా చూశామా?” అని విజయ్  వ్యాఖ్యానించారు.

సమానత్వమే టీవీకే సిద్ధాంతం

ప్రజలను నమ్మించి అధికార డీఎంకే పార్టీ మోసం చేసిందని విజయ్ విమర్శించారు. ప్రజలకు తప్పుడు హామీలిచ్చి అధికారంలోకి వచ్చారని అన్నారు. జనానికి మంచి చేస్తున్నట్లు నటిస్తున్నారని స్టాలిన్ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. ప్రజల సమస్యలు, అధికార పార్టీ ఇచ్చిన హామీలపై ప్రభుత్వాన్ని తాను ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలు తనకు అన్నీ ఇచ్చారని, తమ పార్టీ అధికారంలోకి వస్తే ‘ప్రజల వద్దకే పాలన’ అన్న అన్నాదురై పిలుపును నిజం చేస్తానని చెప్పారు. 

సీఎం స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం సిద్ధాంతాలను గాలికొదిలేసిందని దుయ్యబట్టారు. సమానత్వం, సామాజిక న్యాయమే టీవీకే సిద్ధాంతమన్నారు. ‘‘ప్రతి ఒక్కరికీ శాశ్వత పక్కా ఇల్లు ఉండాలి. ప్రతి ఇంటికీ ఓ మోటార్ సైకిల్ ఉండాలి. ప్రతిఒక్కరూ కనీసం డిగ్రీ వరకైనా చదువుకోవాలి. ఇంట్లో కనీసం ఒక్కరికైనా స్థిర ఆదాయం ఉండాలి. ఇదే మా మేనిఫెస్టో. మేము అధికారంలోకి వస్తే ఉద్యోగావకాశాలు కల్పిస్తాం. విద్యారంగంలో సంస్కరణలు తెస్తాం. ప్రజలు భయపడకుండా ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లేలా తీర్చిదిద్దుతాం” అని విజయ్  పేర్కొన్నారు.