
కోల్‌కతా: బెంగాల్‌లోని మేదినీపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. చిప్స్ పాకెట్ కొనుక్కోవడానికి షాపుకు వెళ్లిన బాలుడిపై యజమాని దొంగతనం అంటకట్టాడు. చెంపదెబ్బలు కొట్టి అందరి ముందు గుంజీలు తీయించాడు. విషయం తెలిసి అక్కడికి వచ్చిన తల్లి కూడా తనను తిట్టడంతో పన్నెండేళ్ల ఆ బాలుడు తట్టుకోలేకపోయాడు.
ఇంటికి చేరాక తన గదిలోకి వెళ్లి పురుగుమందు తాగాడు. తల్లి గమనించి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. చిప్స్ పాకెట్ తన కొడుకు ప్రాణం తీసిందంటూ ఆ తల్లి కన్నీటిపర్యంతం కాగా.. ‘నేను దొంగను కాను. చిప్స్ పాకెట్ దొంగిలించలేదు’ అంటూ ఆ బాలుడు రాసిన సూసైడ్ లెటర్ స్థానికులను కంటతడి పెట్టించింది.
ఏం జరిగిందంటే..
పన్స్కురా ఏరియాలోని గోసాయిబజార్ సమీపంలో తల్లిదండ్రులతో పాటు ఉంటున్న క్రిష్ణేందు దాస్ (12) గురువారం సాయంత్రం చిప్స్ పాకెట్ కొనుక్కోవడానికి కిరాణా షాపుకు వెళ్లాడు. ఆ సమయంలో ఓనర్ శుభాంకర్ దీక్షిత్షాపులో లేడు. ఎంతసేపు పిలిచినా ఎవరూ రాకపోవడంతో క్రిష్ణేందు దాస్ వెనుదిరిగాడు. షాపు ముందు చిప్స్ పాకెట్ పడి ఉండడంతో తీసుకుని ఇంటికి బయలుదేరాడు. మళ్లీ వచ్చి షాప్ అంకుల్‌కు డబ్బులివ్వొచ్చని చిప్స్ పాకెట్ తీసుకుని వెళుతుండగా అప్పుడే షాపుకు వచ్చిన దీక్షిత్ గమనించాడు.
క్రిష్ణేందును పట్టుకుని షాపులో దొంగతనం చేశాడని ఆరోపిస్తూ చేయిచేసుకున్నాడు. తాను దొంగను కాదని, చిప్స్ పాకెట్ కిందపడి ఉంటే తీసుకున్నానని చెప్పినా వినిపించుకోలేదు. సారీ చెప్పి డబ్బులు ఇస్తానన్నా తీసుకోలేదు. ఈ గొడవకు స్థానికులు గుమిగూడగా.. అందరిముందు క్రిష్ణేందుతో గుంజీలు తీయించాడు. విషయం తెలిసి అక్కడికి చేరుకున్న క్రిష్ణేందు తల్లి కూడా కొడుకును తిట్టి ఇంటికి తీసుకెళ్లింది.
దీంతో మనస్తాపం చెందిన క్రిష్ణేందు తన గదిలోకి వెళ్లి పురుగుమందు తాగాడు. క్రిష్ణేందు ఎంతకీ తలుపు తీయకపోవడంతో చుట్టుపక్కల వాళ్ల సాయంతో డోర్ బద్దలు కొట్టి చూడగా.. క్రిష్ణేందు చలనం లేకుండా పడి ఉన్నాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ క్రిష్ణేందు చనిపోయాడు. బాలుడి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు