తీహార్ జైలులో ఆప్ మంత్రి రాజభోగాల వ్యవహారంలో ట్విస్ట్

తీహార్ జైలులో ఆప్ మంత్రి రాజభోగాల వ్యవహారంలో ట్విస్ట్

న్యూఢిల్లీ: తీహార్ జైలులో ఉన్న ఆప్ మంత్రి సత్యేందర్ జైన్ మసాజ్ వీడియోపై రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఈ వ్యవహారంలో తాజాగా ఊహించని ట్విస్ట్ బయటపడింది. సత్యేందర్ జైన్ కు మసాజ్ చేసిన వ్యక్తి ఫిజియో థెరపిస్ట్ కాదని.. రేప్ కేసులో నిందితుడన్న విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వైద్యుల సూచన మేరకు ఫిజియోథెరపీ తీసుకుంటున్నారన్న ఆమ్ ఆద్మీ పార్టీ మాటల్లో నిజం లేదని తేలిపోయింది. 

సత్యేందర్ జైన్ కు మసాజ్ చేసిన వ్యక్తి తీహార్ జైలులో పోక్సో చట్టం కింద శిక్ష అనుభవిస్తున్న రింకూ అనే ఖైదీ అని జైలు అధికారులు గుర్తించారు. అతను పోక్సోతో పాటు ఐపీసీ 376, 506, 509 సెక్షన్ల కింద అభియోగాలు ఎదుర్కొంటున్న చెప్పారు. జైలు అధికారుల ప్రకటనతో మంత్రి సత్యేందర్ సహచర ఖైదీలతో మసాజ్ చేయించుకున్నారన్న విషయం వెల్లడైంది. అయితే తీహార్ జైలు అధికారులు మాత్రం ఈ విషాన్ని బహిరంగంగా చెప్పేందుకు నిరాకరిస్తున్నారు. 

తాజా పరిణామాల నేపథ్యంలో బీజేపీ ఆరోపణలకు మరింత బలం చేకూరినట్లైంది. మంత్రి సత్యేంద్ర జైన్ మసాజ్ వీడియోపై మరింత దుమారం రేగే అవకాశం ఉంది. తీహార్ జైల్లో సత్యేందర్ జైన్ కు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారంటూ బీజేపీ ఆరోపిస్తోంది. అందుకే ఆయనను వెంటనే వేరే జైలుకు మార్చాలని డిమాండ్ చేస్తోంది.