ట్విట్టర్‌లో ‘బ్లూటిక్‌’ కోసం నెలకు రూ.719 చెల్లించాలి !

ట్విట్టర్‌లో ‘బ్లూటిక్‌’ కోసం నెలకు రూ.719 చెల్లించాలి !

ఇటీవలే డీల్ పూర్తి చేసి ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్న ఎలాన్ మస్క్ ట్విట్టర్ లో భారీ మార్పులు తీసుకొస్తున్నారు. బ్లూ టిక్ కు సైతం నెలకు 8డాలర్లు చెల్లించాలని మస్క్ ఈ మధ్యే ప్రకటించగా.. ఇప్పుడు ఆ సబ్ స్క్రిప్షన్ ధరపై కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నెలకు రూ.719గా ఉండొచ్చని పల నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే ప్రస్తుతం (ఐఫోన్) ఐఓఎస్ యూజర్లకు మాత్రమే ఈ రకమైన మెసేజులు వచ్చినట్టు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఈ ఛార్జీలను అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నట్టు సమాచారం. బ్లూటిక్‌ సబ్‌స్క్రిప్షన్‌ మెసేజ్‌లు వచ్చిన యూజర్లు కొందరు వాటిని స్క్రీన్‌షాట్లు తీసి ట్విట్టర్‌లో పోస్టు చేస్తున్నారు. అందులో నెలవారీ ఛార్జీ రూ.719గా ఉన్నట్టు తెలుస్తోంది. 

అయితే ‘ట్విటర్‌ లో బ్లూ’ కోసం ఈ సబ్‌స్క్రిప్షన్‌ చెల్లించినవారికి ఎలాంటి వెరిఫికేషన్‌ లేకుండానే బ్లూటిక్‌ వస్తుంది. దీంతో పాటు ఈ బ్లూటిక్‌ ఖాతాదారులకు మరిన్ని ప్రయోజనాలు కూడా ఉండనున్నట్లు ఎలాన్‌ మస్క్‌ ఇప్పటికే వెల్లడించారు. అయితే ఇలా వెరిఫికేషన్ లేకుండా ఇవ్వడం వల్ల నకిలీ ఖాతాలు పెరిగే ప్రమాదముందని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే కొందరు ముఖ్య వ్యక్తులను గుర్తించేందుకు ‘అధికారిక’ గుర్తును ట్విట్టర్‌ తీసుకొచ్చింది. ఈ గుర్తు చాలా మంది ప్రభుత్వేతర వ్యక్తుల ఖాతాల్లోనూ కనిపించడంతో గందరగోళం నెలకొంది. దీంతో కొన్ని గంటల్లోనే ‘అధికారిక’ గుర్తును వెనక్కి తీసుకుంటున్నట్లు ట్విట్టర్‌ ప్రకటించింది.