
ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో టీయూడబ్ల్యూజే విజయం
అల్లం నారాయణ టీం ఓటమి
వరంగల్, వెలుగు : హోరాహోరీగా సాగిన గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) విజయం సాధించింది. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, ట్రెజరర్ వంటి పదవులన్నీ టీయూడబ్ల్యూజే యూనియన్ కే దక్కాయి. అధికార అల్లం నారాయణ యూనియన్ ఐజేయూ(143)కు చెందిన నేతలు ఓటమి పాలయ్యారు. అల్లం నారాయణ యూనియన్ నుంచి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా తుమ్మ శ్రీధర్ రెడ్డి, కక్కెర్ల అనిల్ గౌడ్ బరిలో నిలవగా.. టీయూడబ్ల్యూజే నుంచి అధ్యక్షునిగా వేముల నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా బొల్లారపు సదానందం పోటీ పడ్డారు. మొత్తం 591 ఓట్లకు గాను 572 ఓట్లు పోలయ్యాయి. కాగా, శ్రీధర్ రెడ్డికి 268 రాగా, సమీప ప్రత్యర్థిగా నాగరాజు 300 ఓట్లు సాధించి 32 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ప్రధాన కార్యదర్శి అనిల్ గౌడ్ కు 264 ఓట్లు రాగా, సదానందానికి 278 ఓట్లు వచ్చాయి. 14 ఓట్ల తేడాతో సదానందం విజయం సాధించారు. ట్రెజరర్ గా బొల్లా అమర్ 146 ఓట్లు సాధించి గెలుపొందారు.
టీయూడబ్ల్యూజే నేతల సంబరాలు..
అధ్యక్ష, కార్యదర్శులుగా టీయూడబ్ల్యూజే( ఐజేయూ) అభ్యర్థులు విజయం సాధించడంతో ఆ యూనియన్ నాయకులు సంబరాలు చేసుకున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ, అధ్యక్షుడు నగునూరి శేఖర్ విజయం సాధించిన నేతలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇది ఐజేయూ సభ్యుల సమష్టి విజయమన్నారు. ఈ సంబరాల్లో నాయకులు దాసరి కృష్ణారెడ్డి, గాడిపెళ్లి మధు, గుంటి విద్యాసాగర్, వల్లాల వెంకటరమణ, గడ్డం కేశవ మూర్తి, పిన్నా శివకుమార్, విద్యాసాగర్, గడ్డం రాజిరెడ్డి, తోట సుధాకర్, కంచ కుమార్ పాల్గొన్నారు.
ఏజెన్సీలో చెరువులపై ఆదివాసీలకే హక్కు
గూడూరు, వెలుగు : ఏజెన్సీలో చెరువులపై ఆదివాసీలకే హక్కు ఉంటుందని తుడుందెబ్బ నాయకులు స్పష్టం చేశారు. మహబూబాబాద్ జిల్లాలో ఏజెన్సీ చట్టాలకు వ్యతిరేకంగా మత్స్యశాఖ కమిటీలను రద్దు చేసిన ఆ శాఖ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈమేరకు గురువారం మహబూబాబాద్ జిల్లా గూడూరు నేషనల్ హైవేపై ధర్నా చేశారు. ఈ సందర్భంగా తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు ఈసం సుధాకర్ మాట్లాడుతూ.. 1/70 యాక్ట్ ప్రకారం షెడ్యూల్ ఏజెన్సీ ఏరియాలోని చెరువులపై ఆదివాసీలకే హక్కు ఉంటుందన్నారు. ప్రతి గ్రామంలో సొసైటీలను ఏర్పాటు చేసి, చెరువులపై ఆదివాసీలకు హక్కులు కలిగేలా ఐటీడీఏ ఆఫీసర్లు చొరవ తీసుకోవాలన్నారు.
వర్ధన్నపేట మాస్టర్ ప్లాన్ రిలీజ్
2041 సంవత్సరం వరకు అమలు
అభ్యంతరాల స్వీకరణకు రెండు నెలల గడువు
వర్ధన్నపేట, వెలుగు : వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ ను ఎట్టకేలకు ఆఫీసర్లు రిలీజ్ చేశారు. 2041 సంవత్సరం వరకు ఈ మాస్టర్ ప్లాన్ అమలులో ఉండనుంది. 2011 లెక్కల ప్రకారం.. వర్ధన్నపేట మున్సిపాలిటీ జనాభా 13,652 ఉంది. ఇది 2041 నాటికి 25వేలు దాటుతుందని, మరో 5 వేల కొత్త ఇండ్ల నిర్మాణం కావొచ్చని ఆఫీసర్లు అంచనా వేశారు. నీటి వనరులను కాపాడుతూ, రోడ్డు సౌకర్యాలను పెంచుతూ, వాణిజ్య సముదాయాలు, పరిశ్రమలను అభివృద్ధి చేసే ఆలోచనతో ప్లాన్ రూపొందించారు. గురువారం మున్సిపాలిటీ చైర్ పర్సన్ ఆంగోతు అరుణ అధ్యక్షతన కౌన్సిల్ జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు. వైస్ చైర్మన్ ఎలేందర్ రెడ్డి, కమిషనర్ రవీందర్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ ను కమిషనర్, చైర్ పర్సన్ వివరించారు. స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేశ్ సూచనల మేరకు ఈ ప్లాన్ తయారు చేశామన్నారు. ప్రజలు తమ అభ్యంతరాలను 60 రోజుల్లోగా మున్సిపాలిటీకి సమర్పించాలన్నారు. ఈ డ్రాఫ్ట్ ను అన్ని ప్రభుత్వ ఆఫీసులు, తహసీల్దార్, మున్సిపల్ ఆఫీసులో అందుబాటులో ఉంచుతామన్నారు. అన్ని అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని తుది మాస్టర్ ప్లాన్ ను ఆమోదిస్తామన్నారు.
విద్యార్థులు సేవా గుణాన్ని అలవర్చుకోవాలి
మహబూబాబాద్ అర్బన్, వెలుగు : విద్యార్థులు సేవా గుణాన్ని అలవర్చుకోవాలని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కన్నా పరుశరాములు సూచించారు. గురువారం మహబూబాబాద్ మండలం కంబాలపల్లి హైస్కూల్లో జరిగిన సీసీ కెమెరాల ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. స్టూడెంట్లు క్రమశిక్షణతో చదువుకొని జీవితంలో రాణించాలన్నారు. టీచర్ల సూచనలు, సలహాలు పాటిస్తే.. అనుకున్నది సాధించగలుగుతారని తెలిపారు. లయన్స్ క్లబ్ జిల్లా అధ్యక్షులు డా.కల్వకూరి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఈ హైస్కూల్‌ను లయన్స్ క్లబ్ దత్తత తీసుకుని అన్ని విధాలా అభివృద్ధి చేస్తుందన్నారు. త్వరలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహిస్తామన్నారు. లయన్స్‌క్లబ్ బాధ్యులు వెంకట్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, పర్కాల శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, వెంకన్న, రవీందర్, కేఎస్ఎన్ రెడ్డి, పీవీ ప్రసాద్, నవాబ్ తదితరులున్నారు.
ప్రకృతిని కాపాడుకోవాలి
జనగామ అర్బన్, వెలుగు : ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, స్టూడెంట్లు ఆ దిశగా ఆవిష్కరణలు చేయాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. గురువారం జనగామ పట్టణంలోని సెయింట్ పాల్స్ హైస్కూల్ లో జీవ వైవిధ్య విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో బయోడైవర్సిటీ ఎగ్జిబిషన్ నిర్వహించారు. చీఫ్ గెస్టుగా ఎమ్మెల్యే హాజరై విద్యార్థుల ప్రాజెక్టులను తిలకించారు. స్టూడెంట్లు భవిష్యత్తులో పశుపక్షాదులను రక్షిస్తూ, కాలుష్యాన్ని నివారిస్తూ విప్లవాత్మక మార్పులు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున, హెచ్ఎం ఫాదర్ ఎన్. మరియా జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన జీవ వైవిధ్య విజ్ఞాన ప్రదర్శన ర్యాలీని జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి ప్రారంభించారు. పట్టణ ప్రజలు పర్యావరణాన్ని కాపాడాలని, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని సూచించారు.
గ్రామాల్లో ట్రాక్టర్లు, పనిముట్ల చోరీ!
నలుగురు దొంగల ముఠా అరెస్ట్
వర్ధన్నపేట, వెలుగు : గ్రామాల్లో ఆరు బయట కనిపించే పనిముట్లు, ట్రాక్టర్లు చోరీ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏసీపీ శ్రీనివాసరావు వివరాల ప్రకారం.. రాయపర్తికి చెందిన రాపోలు రమేశ్, తిరుమలాయపల్లికి చెందిన వల్లెపు రాజు(30), ఐనవోలు రెడ్డిపాలెంకు చెందిన రాపోలు నవీన్(19), పాలకుర్తికి చెందిన గుంజ సురేశ్(32) ఒక ముఠాగా ఏర్పడి కొద్దిరోజులుగా రాయపర్తి, వర్ధన్నపేట మండలాల్లో దొంగతనాలు చేస్తున్నారు. గ్రామాలు, తండాల్లో ఆరుబయట కనిపించే రొటోవేటర్లు, ట్రాక్టర్లు చోరీ చేస్తున్నారు. దీంతో పోలీసులు పలుచోట్ల కేసు నమోదు చేసి, వారిపై నిఘా పెట్టారు. గురువారం వర్ధన్నపేటలో ఆల్ఫోర్స్ స్కూల్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా.. నిందితులు పట్టుబడ్డారు. వారి నుంచి 2 రొటవేటర్లు, 2 ట్రాక్టర్ ట్రాలీలు, ఒక ఇంజన్ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.4లక్షలకు పైగా ఉంటుందన్నారు.
ఏజెన్సీలో చెరువులపై ఆదివాసీలకే హక్కు
గూడూరు, వెలుగు: ఏజెన్సీలో చెరువులపై ఆదివాసీలకే హక్కు ఉంటుందని తుడుందెబ్బ నాయకులు స్పష్టం చేశారు. మహబూబాబాద్ జిల్లాలో ఏజెన్సీ చట్టాలకు వ్యతిరేకంగా మత్స్యశాఖ కమిటీలను రద్దు చేసిన ఆ శాఖ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈమేరకు గురువారం మహబూబాబాద్ జిల్లా గూడూరు నేషనల్ హైవేపై ధర్నా చేశారు. ఈ సందర్భంగా తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు ఈసం సుధాకర్ మాట్లాడుతూ.. 1/70 యాక్ట్ ప్రకారం షెడ్యూల్ ఏజెన్సీ ఏరియాలోని చెరువులపై ఆదివాసీలకే హక్కు ఉంటుందన్నారు. ప్రతి గ్రామంలో సొసైటీలను ఏర్పాటు చేసి, చెరువులపై ఆదివాసీలకు హక్కులు కలిగేలా ఐటీడీఏ ఆఫీసర్లు చొరవ తీసుకోవాలన్నారు.