జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం చేయాలి : మామిడి సోమయ్య 

జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం చేయాలి : మామిడి సోమయ్య 
  • టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య 

హైదరాబాద్ సిటీ, వెలుగు:  రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం చేయకపోవడం బాధాకరమని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య ఒక ప్రకటనలో అన్నారు. తల్లిదండ్రుల రక్షణ, న్యాయవాదుల రక్షణ వంటి చట్టాలు చేయడం అభినందనీయమని, కానీ జర్నలిస్టుల రక్షణ చట్టం చేయకుండా విస్మరించడం అన్యాయమన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి బడ్జెట్ లో రూపాయి కూడా కేటాయించలేదన్నారు. ఇండ్ల స్థలాలు, పెన్షన్ ల ప్రస్తావన చేయలేదన్నారు.

రెండేండ్లుగా పేపర్లకు అడ్వర్టైజ్ మెంట్స్ బిల్స్, అక్రిడిటేషన్ కార్డులు, ఆరోగ్య కార్డులు ఇవ్వడం లేదన్నారు.  ఇప్పటికే ఛత్తీస్ గడ్‌‌‌‌, మహారాష్ట్రల్లో జర్నలిస్టుల రక్షణకు చట్టం చేశారన్నారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిసాతో సహా అనేక ఇతర రాష్ట్రాల్లో అధ్యయన కమిటీలు వేశారన్నారు. తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాలకంటే ఎక్కువ పోరాడిన జర్నలిస్టులను గత ప్రభుత్వం విస్మరించిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే ధోరణి అవలంభి స్తోందన్నారు.