ఆదిలాబాద్: కిడ్నాప్ యత్నం కేసులో ఇద్దరు అరెస్ట్

ఆదిలాబాద్: కిడ్నాప్ యత్నం కేసులో ఇద్దరు అరెస్ట్

ఆదిలాబాద్​ టౌన్(జైనథ్​)​, వెలుగు: ఆదిలాబాద్​ జిల్లా జైనథ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నీరాల గ్రామం వద్ద ఓ మహిళను కిడ్నాప్ చేయడానికి యత్నించిన ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌‌‌‌‌‌‌‌కు తరలించినట్లు సీఐ జి.శ్రావణ్ శుక్రవారం తెలిపారు. సీఐ వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ కు చెందిన మహిళ ఈ నెల 8న రైలులో ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌కు వచ్చింది. తిరిగి వెళ్లే మార్గం తెలియక అక్కడే ఉన్న మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా పాటన్​కు చెందిన అశోక్ భూమన్న బట్టవార్,  వణి థాలుకాకు చెందిన సంజీవ్ నాగోరావ్ ను అడిగింది. 

దీంతో వారు దగ్గర్లో ఉన్న రైల్వే స్టేషన్ వద్ద దింపుతామని చెప్పి బైక్​పై ఎక్కించుకొని తీసుకెళ్లారు. నీరాల సమీపానికి చేరుకున్న తర్వాత ఆ మహిళకు అనుమానం రావడంతో వాహనం ఆపాలని కోరగా, నిందితులు ఆమెపై దాడి చేసి అక్కడే వదిలివేసి వెళ్లిపోయారు. బాధితురాలిని గమనించిన స్థానికులు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. సదరు మహిళ ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి బైక్​ను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. మహిళలు అపరిచిత వ్యక్తులను నమ్మి వారి వాహనాల్లో ప్రయాణించవద్దని, ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులు ఎదురైనా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.