కాగజ్ నగర్ లో వరుస చోరీలు చేస్తున్న ఇద్దరి అరెస్ట్.. 18 తులాల బంగారం స్వాధీనం

కాగజ్ నగర్ లో వరుస చోరీలు చేస్తున్న ఇద్దరి అరెస్ట్.. 18 తులాల బంగారం స్వాధీనం
  • కాగజ్ నగర్ లో వరుస చోరీలు చేస్తున్న ఇద్దరి అరెస్ట్ 
  • 18 తులాల బంగారం స్వాధీనం
  • వివరాలు వెల్లడించిన డీఎస్పీ

కాగజ్‌నగర్‌, వెలుగు: ఇండ్లలో పాకీ పనికి వెళ్లి, ఆ చుట్టుపక్కల తాళం వేసి ఉన్న ఇండ్లను గుర్తించి వాటికి కన్నం వేస్తున్న దొంగల ముఠాను కాగజ్ నగర్ టౌన్ పోలీసులు సోమవారం పట్టుకున్నారు. వివరాలు డీఎస్పీ వహీదుద్దీన్ ప్రెస్​మీట్​లో వెల్లడించారు.  కాగజ్ నగర్ పట్టణంలోని ఓల్డ్ కాలనీకి చెందిన గాల్లోత్ కుషాల్ ఇండ్లలో పాకీ పని చేస్తూ జీవిస్తున్నాడు. జూదానికి అలవాటు పడిన అతడు తనతో పనిచేసే మైనర్ ఓర్సు అనిల్(16), మధ్యప్రదేశ్​కు చెందిన తన బంధువు జైకుమార్​తో కలిసి దొంగతనాలు చేస్తున్నాడు. స్కావెంజర్ పనులు చేస్తూ  చుట్టుపక్కల  తాళాలు వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్నారు. 

ఈ నెల 1న కాగజ్​నగర్​లోని న్యూ కాలనీలో ఎస్పీఎం కంపెనీ ఉద్యోగి కిశోర్ కుమార్ తన క్వార్టర్​కు తాళం వేసి బయటకు వెళ్లాడు. తిరిగొచ్చేసరికి తాళం పగులగొట్టి బీరువాలో ఉన్న 213 గ్రాముల బంగారం, రూ.50 వేల నగదు దొంగలించారు. దీంతోపాటు పలు చోట్ల చోరీలు చేశారు. పట్టణంలో వరుస చోరీలు జరగడంతో పోలీసులు గట్టి నిఘా పెట్టారు. సీసీ కెమెరాల సాయంతో కుషాల్, అనిల్ ను పట్టుకున్నారు. వీరి వద్ద నుండి సుమారు రూ.20 లక్షల విలువచేసే18 తులాల బంగారం, రూ.10 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. జై కుమార్ పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు. సమావేశంలో టౌన్, రూరల్​ సీఐలు ప్రేమ్ కుమార్, కుమారస్వామి, ఎస్సై సుధాకర్ పాల్గొన్నారు.