ఇంటి వద్ద దింపుతామని నమ్మించి అఘాయిత్యం

ఇంటి వద్ద దింపుతామని నమ్మించి అఘాయిత్యం
  • మహిళ కిడ్నాప్.. గ్యాంగ్​రేప్
  • ఇంటి వద్ద దింపుతామని నమ్మించి అఘాయిత్యం

గండిపేట, వెలుగు: పనులు ముగించుకొని ఇంటికెళ్తున్న మహిళను ఇద్దరు దుండగులు కిడ్నాప్  చేసి గ్యాంగ్  రేప్ కు పాల్పడ్డారు. రాజేంద్రనగర్ లో శనివారం రాత్రి ఈ దారుణం జరిగింది. నిందితులను కొన్ని గంటల వ్యవధిలోనే నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. రాజేంద్రనగర్ లో పీరం చెరువులోని ఇండస్‌‌ వ్యాలీలో ఓ మహిళ పనిమనిషిగా పని చేస్తోంది. శనివారం రాత్రి పనులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా లింబ్‌‌డమ్‌‌ విల్లా దగ్గర ఉన్న ఇద్దరు వ్యక్తులు ఆమెను సమీపించారు. తమ కారులో ఇంటి వద్ద దింపుతామని నమ్మించి ఆమెను వెహికల్ లో ఎక్కించుకున్నారు. అనంతరం ఆ మహిళను కిస్మత్‌‌పూర్‌‌లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశారు. అంతేకాకుండా బాధితురాలి వద్ద ఉన్న 2.5 తులాల బంగారు పుస్తెల తాడును కూడా ఎత్తుకెళ్లారు. అనంతరం బాధితురాలు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. నిందితులను బాచుపల్లి ప్రాంతానికి చెందిన శుభం శర్మ (29), సుమిత్‌‌ కుమార్‌‌ శర్మ(33) గా గుర్తించారు. కొన్ని గంటల వ్యవధిలోనే వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి పుస్తెల తాడు, రెండు మొౖబైల్‌‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌‌కు తరలించామని నార్సింగి ఏసీపీ జీవీ రమణ గౌడ్, ఇన్‌‌స్పెక్టర్‌‌  శివకుమార్‌‌  తెలిపారు.