ఇద్దరు బీజేపీ లీడర్ల ఆత్మహత్య.

ఇద్దరు బీజేపీ లీడర్ల ఆత్మహత్య.
  • తప్పుడు కేసు పెట్టించారని మంచిర్యాల జిల్లాలో మండల అధ్యక్షుడు..
  • తల్లిని కొట్టిన వీడియో వైరల్‌‌ కావడంతో మనస్తాపానికి గురై ఉప్పల్‌‌లో మరొకరు సూసైడ్‌‌

బెల్లంపల్లి రూరల్/యాదాద్రి, వెలుగు : వేర్వేరు చోట్ల ఇద్దరు బీజేపీ లీడర్లు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలోని నీల్వాయికొత్తగూడెం గ్రామానికి చెందిన బీజేపీ మండల అధ్యక్షుడు ఏట మధుకర్​(47) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం ఉదయం చెన్నూర్‌‌ వెళ్తున్నట్లు తన భార్య సరోజనకు చెప్పి బైక్‌‌పై బయటకు వెళ్లిన మధుకర్‌‌.. గ్రామానికి సమీపంలో రోడ్డు పక్కన చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. 

గమనించిన స్థానికులు కుటుంబసభ్యులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి చూడగా మధుకర్‌‌ షర్ట్‌‌ జేబులో సూసైడ్‌‌ నోట్‌‌ దొరికింది. ‘నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్‌‌ నాయకులు తప్పుడు కేసు పెట్టించారు, నా చావుకు రుద్రభట్ల సంతోష్, గాలి మధు, చింతకింది కమల కారణం, నేను ఎలాంటి తప్పు చేయలేదు, నా పరువు తీశారు, మండలంలో కుల రాజకీయాలు కొనసాగుతున్నాయి, దోషులను శిక్షించాలి, నా కుటుంబాన్ని బీజేపీ నాయకత్వం ఆదుకోవాలి’ అంటూ సూసైడ్‌‌ నోట్‌‌ రాశాడు. 

మధుకర్‌‌ మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కుటుంబసభ్యులు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్‌‌గౌడ్‌‌, నాయకులు ఏమాజీ, జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు, బీఆర్‌‌ఎస్‌‌ మండల అధ్యక్షుడు వేణుమాదవ్, పురాణం లక్ష్మీకాంత్, ముదిరాజ్‌‌ సంఘం నాయకులు ధర్నాకు దిగారు. బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్‌‌ వచ్చి.. కారకులపై కేసులు నమోదు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. 

ఉప్పల్‌‌కు చెందిన లీడర్‌‌ బీబీనగర్‌‌లో...

తల్లిని కొట్టిన వీడియో సోషల్‌‌ మీడియాలో వైరల్‌‌ కావడంతో ఉప్పల్‌‌కు చెందిన బీజేపీ నాయకులు రేవల్లి రాజు (50) యాదాద్రి జిల్లా బీబీనగర్‌‌ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. ఉప్పల్‌‌కు చెందిన రాజు పదిహేను రోజుల కింద తల్లి లక్ష్మితో గొడవ పడి, ఆమెను కొట్టాడు. ఈ ఘటనను అతడి మరదలు వీడియో తీసి సోషల్‌‌ మీడియాలో పోస్ట్‌‌ చేసింది. 

వీడియో వైరల్‌‌ కావడంతో తన పరువు పోయిందని మనస్తాపానికి గురైన రాజు గురువారం ‘నా తల్లి నా పై పగబట్టి నమ్మించి గొంతు కోసింది, అందుకే కొట్టాల్సి వచ్చింది, నా భార్యాపిల్లలు అమాయకులు, వారికి అన్యాయం చేయొద్దు’ అంటూ సెల్ఫీ వీడియో తీసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో ఉప్పల్‌‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఆ తర్వాత ఫోన్‌‌ ఇంట్లోనే కన్పించడంతో అందులోని వీడియో బయటకు వచ్చింది. శుక్రవారం ఉదయం యాదాద్రి జిల్లా బీబీనగర్‌‌ చెరువులో యువకుడి డెడ్‌‌బాడీ కనిపించడంతో సమాచారం అందుకున్న పోలీసులు వివిధ స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న రాజు భార్య, కుమారులు, బంధువులు భువనగిరికి చేరుకొని చనిపోయింది.. రాజుగా గుర్తించారు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.