పడవలు బోల్తా ఘటన..6 మృతదేహాలు లభ్యం

పడవలు బోల్తా ఘటన..6 మృతదేహాలు లభ్యం
  • మృతులు, గల్లంతైన వారంతా ఒడిశాలోని కొందుగూడ గ్రామస్తులు
  • హైదరాబాద్ నుండి స్వగ్రామానికి తిరిగి వెళ్తూ ప్రమాదానికి..

విశాఖపట్టణం: సీలేరు నది రిజర్వాయర్ లో నాటు పడవలు బోల్తా పడిన ఘటనలో గల్లంతైన 8 మందిలో ఆరుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. చీకటి పడటంతో గాలింపు చర్యలు నిలిచిపోయాయి. గల్లంతైన మరో ఇద్దరి ఆచూకీ కోసం రేపు (బుధవారం) గాలింపు చర్యలు కొనసాగిస్తామంటున్నారు అధికారులు. సీలేరు నది రిజర్వాయర్‌లో రెండు నాటు పడవలు బోల్తా పడిన విషయం తెలిసిందే.  ప్రమాదం జరిగిన సమయంలో రెండు పడవల్లో 11మంది ఉన్నట్లు సమాచారం. వీరంతా ఒడిశాలోని కోందుగూడ గ్రామస్తులు.
తొలుత వీరు హైదరాబాద్ శివారులో ఇటుకల బట్టిలో పనికి వెళ్లారు. కరోనా లాక్ డౌన్ వల్ల ఇబ్బందులుపడుతూ తమ ప్రాంతానికే చెందిన   35మంది స్వగ్రామాలకు బయలుదేరారు. కొందరు సీలేరు రిజర్వాయిర్ మీదుగా నాటు పడవలపై తొలి విడతగా  గ్రామానికి చేరుకున్నారు. ఇక రెండో ట్రిప్‌లో ఐదు పడవల్లో మిగిలిన వారు బయలుదేరారు. కొద్ది దూరం వెళ్లిన వెంటనే రెండు పడవలు నీట మునిగాయి. నీట మునిగిన పడవల్లో ఉన్న 11మందిలో ముగ్గురు సురక్షితంగా బయటపడగా.. మరో ఎనిమిది మంది గల్లంతయ్యారు. గాలింపు చర్యలు చేపట్టగా ఆరుగురి మృతదేహాలు దొరికాయి.