నెట్టెంపాడు ఫేజ్ 2 లిఫ్టులో పేలిన ఎంసీబీ బోర్డు

నెట్టెంపాడు ఫేజ్ 2 లిఫ్టులో పేలిన ఎంసీబీ బోర్డు

నెట్టెంపాడు ఫేజ్ 2 లిఫ్టులో పేలిన ఎంసీబీ బోర్డు
ఇద్దరు కార్మికులకు తీవ్రగాయాలు

గద్వాల, వెలుగు: నెట్టెంపాడు లిఫ్ట్ ఫేజ్2 లో ఎంసీబీ బోర్డు పేలి ఇద్దరు కాంట్రాక్ట్ వర్కర్లు తీవ్రంగా గాయపడ్డారు. జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల మార్లబీడు గ్రామం వద్ద శుక్రవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల వివరాల మేరకు.. నెట్టెంపాడు లిఫ్ట్ 2 దగ్గర డ్యూటీ చేసే కాంట్రాక్ట్ వర్కర్లు నాగిరెడ్డి, నవీన్ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం ఎంసీబీ బోర్డు(250 యాంపియర్స్)ను ఓపెన్​చేసేందుకు ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో ఇద్దరి ముఖాలకు తీవ్రమైన కాలిన గాయాలయ్యాయి.

పక్కనే ఉన్న మరో వ్యక్తి ప్రతాప్ రెడ్డి కూడా స్వల్పంగా గాయపడ్డారు. బాధితులను వెంటనే గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఫస్ట్ ఎయిడ్ చేసి మెరుగైన చికిత్స కోసం కర్నూల్ తీసుకెళ్లారు. ఎంసీబీ బోర్డులు, ఫీజుల తదితర కరెంటుకు సంబంధించిన ఎలక్ట్రీషియన్ లతో చేయించాలి, కానీ కాంట్రాక్టర్ శ్రీనివాసరెడ్డి ఈ పనులను కూడా డైలీ వేజ్ ప్రతిపాదికన నియమించుకున్న కాంట్రాక్ట్ వర్కర్లతో చేయించడంతో ఈ ప్రమాదం జరిగిందని కార్మికులు చెప్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రమాదానికి కారణమైన కాంట్రాక్టర్​పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.