రాష్ట్రంలో సమ్మె ప్రభావం అంతంతే!

రాష్ట్రంలో సమ్మె ప్రభావం అంతంతే!
  • సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి, బ్యాంక్‌‌‌‌‌‌‌‌ సేవలపై ఎఫెక్ట్‌‌‌‌‌‌‌‌
  • ఎప్పట్లాగే నడిచిన బస్సులు, ఆటోలు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు చేపట్టిన 2రోజుల దేశవ్యాప్త సమ్మె ఎఫెక్ట్‌‌‌‌‌‌‌‌ రాష్ట్రంలో పెద్దగా కనిపించలేదు. వివిధ కార్మిక సంఘాలు సమ్మెకు మద్దతు ప్రకటించాయి. ఆర్టీసీ బస్సులు ఎప్పటిలాగే రోడ్డెక్కాయి. ఆర్టీసీ యూనియన్లు సమ్మె నోటీస్‌‌‌‌‌‌‌‌ ఇచ్చినా, బంద్‌‌‌‌‌‌‌‌లో పాల్గొనాలని పిలుపునిచ్చినా కార్మికుల నుంచి పెద్దగా స్పందన రాలేదు. క్యాబ్స్, ఆటోలు సాధారణంగానే నడిచాయి. విద్యుత్‌‌‌‌‌‌‌‌ రంగ కార్మికులు డ్యూటీలకు హాజరయ్యారు. కార్మిక చట్ట సవరణకు వ్యతిరేకంగా, మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్​మెంట్ గ్యారంటీ యాక్ట్ కింద వేతనాలు పెంచడం, కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయడం వంటి డిమాండ్లతో యూనియన్లు సమ్మెకు దిగాయి. బ్యాంక్‌‌‌‌‌‌‌‌లు మాత్రం మూతబడ్డాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీక‌‌‌‌‌‌‌‌రణ, బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు-2021ను నిరసిస్తూ ఉద్యోగులు విధులు బహిష్కరించారు. సింగరేణి కాలరీస్‌‌‌‌‌‌‌‌లో కార్మికులు విధులకు హాజరుకాలేదు. ఎల్‌‌‌‌‌‌‌‌ఐసీ, బీఎస్‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌ ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. 

నిరసనలు, ఆందోళనకే పరిమితం

అనేక కార్మిక సంఘాలు నిరసనలు, ఆందోళన కార్యక్రమాలకే పరిమితమయ్యాయి. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని ఖైరతాబాద్‌‌‌‌‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ భవన్‌‌‌‌‌‌‌‌ ఎదుట క్యాబ్‌‌‌‌‌‌‌‌, ఆటో డ్రైవర్లు ధర్నా చేశారు.  కొన్ని డిపోల్లో ఆర్టీసీ యూనియన్‌‌‌‌‌‌‌‌ లీడర్లు బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. వివిధ ప్రాంతాల్లో ఆశవర్కర్లు, అంగన్‌‌‌‌‌‌‌‌వాడీ టీచర్లు ర్యాలీలు తీశారు. పలు చోట్ల మాత్రం టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ లీడర్లు నిరసనలు, ఆందోళనకు మద్దతు తెలిపారు.  మంగళవారం కూడా సమ్మె కొనసాగనుంది.

సమ్మె ఓ నాటకం: ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయని, దాని ప్రభావం ఎక్కడా కనిపించలేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చెప్పారు. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నారని  మీడియా సమావేశంలో ఆరోపించారు. సమ్మె ఒక బూటకం, నాటకం అని ఆరోపించారు. కమ్యూనిస్ట్, కాంగ్రెస్ హయాంలోనే ప్రభుత్వ రంగ సంస్థలు మూతపడ్డాయన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు టీఆర్ఎస్ కార్యకర్తలకే అందుతున్నాయని ఆరోపించారు.