ఇయ్యాల, రేపు ప్రజాపాలన బంద్

ఇయ్యాల, రేపు ప్రజాపాలన బంద్
  • మూడోరోజు కొనసాగిన దరఖాస్తుల స్వీకరణ
  •     పలు సెంటర్లను పరిశీలించిన బల్దియా కమిషనర్ రోనాల్డ్ రాస్ 
     

హైదరాబాద్, వెలుగు: ప్రజాపాలన కార్యక్రమానికి ఆది, సోమవారం రెండ్రోజుల పాటు సెలవు ఉంటుందని బల్దియా అధికారులు తెలిపారు. తిరిగి మంగళవారం నుంచి జనవరి 6వ తేదీ వరకు యధావిధిగా దరఖాస్తులను తీసుకోనున్నారు. సిటీలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రజా పాలన కౌంటర్లను శనివారం బల్దియా కమిషనర్ రోనాల్డ్​రాస్  పరిశీలించారు. 

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. అర్హులైన సిటిజన్లు ఆరు గ్యారంటీలకు దరఖాస్తు చేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. కౌంటర్ల వద్ద మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా వీల్ చైర్లను ఏర్పాటు చేశామన్నారు. 

అవసరమైతే దరఖాస్తులు నింపి ఇవ్వండి: కలెక్టర్ అనుదీప్

ప్రజా పాలన దరఖాస్తులు ఇచ్చేందుకు వచ్చే వారు అప్లికేషన్ ఫామ్​లో అన్ని  కాలమ్స్ నింపే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, అవసరమైతే అధికారులే దరఖాస్తును నింపి ఇవ్వాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. శనివారం బహదూర్​పురాలోని కిషన్​బాగ్ పార్కు, చాంద్రాయణగుట్టలోని ఎన్ఏసీ, చార్మినార్​లోని పేట్ల బురుజులో ఏర్పాటు చేసిన ప్రజా పాలన కౌంటర్లను ఆయన సందర్శించారు. 

దరఖాస్తులు ఇచ్చేందుకు వారితో మాట్లాడారు. అన్ని కాలమ్స్​ పూర్తిగా నింపే విధంగా అధికారులు.. అర్జీదారులకు సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.అర్హులకు ఆరు గ్యారంటీలను అందిస్తం: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

వికారాబాద్: ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రజా పాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. వికారాబాద్ జిల్లా మోమిన్ పేట మండలంలోని తహసీల్దార్ ఆఫీసులో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కౌంటర్లను శనివారం ఆయన సందర్శించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన వారందరికీ ఆరు గ్యారంటీలు అందుతాయన్నారు. వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని వార్డు నం.7లో ఏర్పాటు చేసిన ప్రజా పాలన కౌంటర్ ను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సందర్శించారు.