
- మెదక్ జిల్లాలో వ్యక్తిని హత్య చేసిన గుర్తుతెలియని వ్యక్తులు
- వివాహేతర సంబంధాన్ని బయటపెట్టిండని కరీంనగర్‌లో ఫ్రెండ్‌ను హత్య చేసిన యువకుడు
శివ్వంపేట, వెలుగు : ఇంట్లో ఒంటరిగా ఉన్న వ్యక్తిపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి చంపేశారు. ఈ ఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలం టిక్యా దేవమ్మగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని సామ్య తండాలో ఆదివారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే... తండాకు చెందిన మదన్‌లాల్ (40) తల్లిదండ్రులు కొన్నేండ్ల చనిపోగా, అతడి భార్య సైతం భర్తతో గొడవ పడి పుట్టింటికి వెళ్లిపోయింది.
దీంతో కొన్ని రోజులుగా ఒంటరిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు మదన్‌లాల్ ఇంట్లోకి చొరబడి కత్తులతో పొడిచి హత్య చేశారు. ఆదివారం సాయంత్రం మదన్‌లాల్ ఇంటి డోర్లు తెరిచి ఉండడాన్ని గమనించిన స్థానికులు లోపలికి వెళ్లి చూడగా రక్తపు మడుగులో కనిపించాడు.
వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై మధుకర్‌రెడ్డి తన సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకున్నారు. అనంతరం తూప్రాన్ సీఐ రంగా కృష్ణతో పాటు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సిబ్బంది చేరుకొని ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
బీరు తాగుదామని పిలిచి...
కరీంనగర్ క్రైం, వెలుగు : వివాహేతర సంబంధాన్ని బయటపెట్టిండన్న కోపంతో ఓ యువకుడు తన ఫ్రెండ్‌నే హత్య చేశాడు. ఈ ఘటన కరీంనగర్‌లో ఆదివారం జరిగింది. కరీంనగర్ నగర శివారులోని బొమ్మకల్ గ్రామానికి చెందిన బెజ్జంకి మహేశ్ (22), కాల్వ సతీశ్ ఫ్రెండ్స్. సతీశ్‌కు ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయాన్ని మహేశ్ బయటకు చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.
ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం బీరు తాగుదామని మహేశ్‌ను పిలిచిన సతీశ్ అతనితో వాగ్వాదానికి దిగాడు. అనంతరం బీరు బాటిల్‌ను పగులగొట్టి మహేశ్ గొంతు కోసి హత్య చేశాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కరీంనగర్ రూరల్ సీఐ ప్రదీప్‌కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.