
మంచిర్యాల, వెలుగు: వీ6 న్యూస్ పేరిట బెదిరింపులకు పాల్పడుతున్న ఇద్దరు నకిలీ రిపోర్టర్లను మంచిర్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. టౌన్ సీఐ ప్రమోద్ రావు వివరాల ప్రకారం.. మంచిర్యాల ఆర్పీ రోడ్లోని శ్రీ సాయి శ్రీనివాస బార్ లో బైపాస్ రోడ్ ఏరియాకు చెందిన సయ్యద్ సిరాజ్ అనే వ్యక్తి బుధవారం మద్యం తాగాడు. అనంతరం తనకు ఫ్రీగా బిర్యానీ కావాలని, ఇవ్వకపోతే మీడియాను పిలిచి మీ అంతు చూస్తానని బెదిరించినట్లు బార్ మేనేజర్ గురువిందర్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా... ఎల్ఐసీ కాలనీకి చెందిన బండి కిరణ్ అనే వ్యక్తి సిరాజ్ కు వీ6 న్యూస్ పేరిట నకిలీ ఐడెంటిటీ కార్డు తయారుచేసి ఇచ్చినట్టు చెప్పాడు. ఇద్దరూ కలిసి కొంతకాలంగా వీ6 పేరు చెప్తూ బెదిరింపులకు పాల్పడుతున్నట్టు విచారణలో తేలిందని సీఐ తెలిపారు. వీరిద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా మేజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్
విధించారన్నారు. అనంతరం లక్సెట్టిపేట జైలుకు తరలించినట్లు పేర్కొన్నారు.