మెదక్ జిల్లాలో విషాదం.. పేలిన గ్యాస్ సిలిండర్ 

మెదక్ జిల్లాలో విషాదం.. పేలిన గ్యాస్ సిలిండర్ 

మెదక్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చేగుంట మండలం చిన్న శివనూరు గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు మృతి చెందారు. గ్రామానికి చెందిన అంజమ్మ అనే మహిళ తన ఇద్దరు కుమారులతో కలిసి హైదరాబాదులో నివాసం ఉంటోంది. నిన్న మనవరాలుతో కలిసి రేషన్ బియ్యం కోసం చిన్న శివనూరు గ్రామానికి వచ్చింది. అర్ధరాత్రి సమయంలో గ్యాస్ సిలిండర్ పేలడంతో అంజమ్మతో పాటు తన ఆరు సంవత్సరాల మనవరాలు సజీవ దహనమయ్యారు. 

గ్యాస్ సిలిండర్ పేలిన సమయంలో భారీ శబ్దం వచ్చింది. దీంతో భయాందోళనకు గురైన గ్రామస్తులు వెంటనే మంటలను ఆర్పారు. అప్పటికే ప్రమాదంలో అంజమ్మ, ఆమె మనవరాలు సజీవ దహనమయ్యారు. విషయం తెలియగానే సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.