
- మహారాష్ట్రలో దొంగ చేతివాటం
ముంబై: కొడితే జాక్ పాట్ తగలాలనుకున్నాడో ఏమో ఓ దొంగ.. ఎమ్మెల్యే జేబుకే కన్నం వేశాడు. మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ బొండ్రే ఆయన భార్యతో కలిసి విదర్భ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణిస్తుండగా ఓ దొంగ తన చేతివాటం చూపించాడు. ఓ స్టేషన్ లో ట్రైన్ ఆగగానే ఏసీ బోగిలోకి ఎక్కి.. ఎమ్మెల్యే భార్య చేతిలోని పర్సుతో పాటు ఓ ఫైల్ ను క్షణాల్లో మాయం చేశాడు. అప్రమత్తమైన ఎమ్మెల్యే ఆ దొంగని పట్టుకునేందుకు ప్రయత్నించాడు కానీ, చూస్తుండగానే అతడు మాయమయ్యాడని పోలీసులకు మంగళవారం ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. రూ.51వేల నగదు, డాక్యుమెంట్లు పోయాయని పేర్కొన్నారు. ముంబైకి దగ్గర్లోని కల్యాణ్, థానె రైల్వే స్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.
సేమ్ టు సేమ్ మరో ఎమ్మెల్యే విషయంలోనూ ఇదే సీన్ రిపీట్ అయ్యింది. శివసేన ఎమ్మెల్యే రైముల్కర్.. దేవనాగరి ఎక్స్ ప్రెస్ లో జల్నా నుంచి ఛత్రపతి శివాజీ టెర్మినల్ కి వెళ్తున్నారు. ఎమ్మెల్యే కాసేపు కునుకు తీసి లేచేసరికి.. మొబైల్, రూ.10వేల నగదు, ఐడీ కార్డులు మాయమయ్యాయి. కల్యాణ్, సీఎస్ఎమ్టీ స్టేషన్లలో రెండు వేర్వేరు ఫిర్యాదులు నమోదయ్యాయని, నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ‘2014 ఎన్నికల నుంచి అచ్చే దిన్ వస్తాయని బీజేపీ లీడర్లు చెబుతున్నారు. దొంగలకే అచ్చే దిన్ వచ్చాయా?. ఎమ్మెల్యేలకు కేటాయించిన బోగిలోనే ఇలాంటి ఘటన జరిగితే.. సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు’ అని ఎమ్మెల్యే రాహుల్ బొండ్రే మీడియాతో అన్నారు.