జాబ్‌‌ రాలేదని.. ఇద్దరు నిరుద్యోగుల ఆత్మహత్య

జాబ్‌‌ రాలేదని.. ఇద్దరు నిరుద్యోగుల ఆత్మహత్య

జగిత్యాల, గండీడ్, వెలుగు: జాబ్​ రాలేదన్న కారణంతో మరో ఇద్దరు నిరుద్యోగులు ప్రాణాలు తీసుకున్నారు. మహబూబ్‌‌నగర్ జిల్లా గండీడ్‌‌లో ఒకరు, జగిత్యాల జిల్లాలో మరొకరు పురుగు మందు తాగి ఆత్యహత్యకు పాల్పడ్డారు. గండీడ్‌‌ మండలంలోని వెన్నచేడ్‌‌కు చెందిన మంగలి శ్రీకృష్ణ ( 24) డిగ్రీ చదివాడు. పోలీస్ కానిస్టేబుల్‌‌తో పాటు ఆర్మీ ఉద్యోగాలకు చాలా కాలంగా ట్రై చేస్తున్నాడు. నాలుగేళ్ల కిందట తన తండ్రికి గొంతు క్యాన్సర్ రావడంతో అప్పులు చేయాల్సి వచ్చింది. ఉద్యోగం రావడం లేదని, అప్పులు ఎలా తీర్చాలని ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో కొన్నాళ్ల కిందట సెలూన్‌‌ పెట్టుకున్నాడు. సెలూన్‌‌ నుంచి వచ్చే డబ్బులు అప్పులు తీర్చేందుకు సరిపోవడం లేదు. మరోవైపు జాబ్స్‌‌ నోటిఫికేషన్లు కూడా రావడం లేదు. దీంతో ఈ నెల 14న రాత్రి 9 గంటలకు భోజనం చేసి పొలం వద్దకు వెళ్లాడు. 12 గంటల సమయంలో పురుగుల మందు తాగి.. ఇంటి పక్కన ఉండే మంగలి మహేందర్ కు ఫోన్ చేసి చెప్పాడు.  వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా.. అందరూ కలిసి పొలానికి వెళ్లారు. 108 వాహనంలో గండీడ్ పీహెచ్‌‌సీకి, అక్కడి నుంచి  జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ సోమవారం చనిపోయాడు.

ఎంబీఏ చేసినా ఉద్యోగం రాక..

జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన చిర్ర లవన్ కుమార్.. ఈ మధ్యే ఎంబీఏ పూర్తి చేశాడు. కొన్ని నెలలుగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు. సర్కారు నోటిఫికేషన్లు రాక, బయట ఉద్యోగాలు దొరక్క తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లేందుకు కూడా ప్రయత్నాలు చేశాడు. కానీ అదీ ఫెయిల్ కావడంతో ఈ నెల 14న ఇంట్లో ఏవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. కరీంనగర్‌‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.