
జగదేవ్ పూర్ (కొమురవెల్లి), వెలుగు: అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ మండలం తీగుల్ కు చెందిన రైతు బుదారి నరేందర్(34) తనకున్న కొద్ది భూమితో పాటు మరో మూడెకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. పంట ఖర్చులకు రూ.10 లక్షల నుంచి15 లక్షల దాకా అప్పులు చేశాడు.
ఇటీవల ఎనిమిది గుంటల భూమిని అమ్మినా అప్పులు తీరలేదు. కాగా.. పంట చిట్టికి సుమారు రూ.60 వేల వరకు కట్టాల్సి ఉండగా ఎవరిని అడిగినా ఇవ్వకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందాడు. శుక్రవారం ఉదయం తన పొలం వద్దకు వెళ్లి వేప చెట్టుకు ఉరేసుకుని చనిపోయాడు.
పక్క పొలాలకు చెందిన రైతులు చూసి కుటుంబ సభ్యులకు తెలిపారు. మృతుడికి భార్య రేవతి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. నరేందర్ భార్య ఫిర్యాదుతో జగదేవ్ పూర్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసి.. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
పురుగుల మందు తాగి యువకుడు..
దండేపల్లి : అప్పుల బాధతో మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కొండాపూర్ కు చెందిన యువకుడు శుక్రవారం పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. దండేపల్లి ఎస్ఐ తహసీనోద్దిన్ తెలిపిన ప్రకారం.. ఇప్ప మనోజ్(31) గతేడాది ఫైనాన్స్ లో హార్వెస్టర్ కొన్నాడు. నష్టాలు రావడంతో దాన్ని అమ్మివేసి, మరో రూ. 4 లక్షలు అప్పు చేసి ట్రాక్టర్ కొన్నాడు. అది రిపేర్లు వచ్చి బిజినెస్ నడవడంలేదు.
దీంతో అప్పులు ఎలా తీర్చాలోనం టూ మనస్తాపంతో గురువారం రాత్రి గ్రామ శివారులోకి వెళ్లి గుర్తు తెలియని పురుగుల మందు తాగి.. తన బంధువుకు ఫోన్ చేసి చెప్పాడు. అతడి చికిత్స కోసం లక్షెట్టిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చనిపోయినట్టు తెలిపారు. మృతుడి భార్య శిరీష ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.