
- అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగివ్వడం లేదని ఒకరు..
- జాండీస్ తో బాధపడుతూ మరొకరు
కరీంనగర్/హుజురాబాద్, వెలుగు: సెల్ఫీ వీడియోలు తీసుకుంటూ గడ్డి మందు తాగి ఇద్దరు చనిపోయిన ఘటనలు కరీంనగర్ జిల్లాలో జరిగాయి. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. హుజూరాబాద్ టౌన్ లోని పాతవాడకు చెందిన పంజాల కృష్ణ(34), తన డబ్బుతో పాటు మరొకరి వద్ద తీసుకుని మొత్తం రూ.25 లక్షలు మూడేండ్ల కింద పోచమ్మవాడకు చెందిన వనం హరీశ్‌కు అప్పుగా ఇచ్చాడు. ఎన్నిసార్లు అడిగినా తిరిగి ఇవ్వడంలేదు.
ఆపై గొడవపడుతూ.. ‘ నీకు పిల్లలు లేరు.. నీకెందుకురా డబ్బు. నువ్వు ఏదైనా మందు తాగి చావు పో’ అని హరీశ్తిడుతుండడంతో కృష్ణ మనస్తాపం చెందాడు. అప్పు ఇస్తే తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని, తన చావుకు హరీశ్కారణమని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో తీసుకుని ఈనెల 3న రాత్రి 9.30 గంటలకు హుజురాబాద్ హైస్కూల్ గ్రౌండ్ లో కృష్ణ గడ్డి మందు తాగాడు. హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. కృష్ణ భార్య పంజాల తిరుమల ఫిర్యాదుతో హరీశ్‌పై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
‘హ్యాపీగా చస్తున్నా..’ అని యువకుడు
జిల్లాలోని సైదాపూర్ మండలం బూడిదపల్లికి చెందిన అమరగొండ రాహుల్(22) శుక్రవారం సాయంత్రం తమ వ్యవసాయ బావి వద్ద పురుగుల మందు తాగాడు. ‘ నేను ఎప్పుడో సచ్చిపోదామనుకున్న. ఆ రోజు రావాలి అనుకున్న. ఈరోజు వచ్చింది. అందరికీ బై.. మిస్ యూ ఆల్. హ్యాపీగా చస్తున్నా.. ఎవరూ బాధపడొద్దు.’ అని సెల్ఫీ వీడియో తీసుకుని పురుగుల మందు తాగాడు.
అతడిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం చనిపోయాడు. తన కొడుకు రాహుల్ కు మూడు రోజులుగా జ్వరం రావడంతో ఆస్పత్రిలో చూపించగా.. జాండీస్ అని తేలిందని, రెండు రోజుల్లో మళ్లీ వెళ్దామనుకునేలోపే, పురుగుల మందు తాగాడని మృతుడి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.