పాలమూరులో కల్తీ కల్లుకు మరో ఇద్దరు బలి

పాలమూరులో కల్తీ కల్లుకు మరో ఇద్దరు బలి
  • పాలమూరులో కల్తీ కల్లుకు మరో ఇద్దరు బలి
  • 4 రోజుల్లో మూడుకు చేరిన మృతుల సంఖ్య
  • మరో ఇద్దరు మహిళల పరిస్థితి సీరియస్​
  • ఇంకా 50 మందికి కొనసాగుతున్న చికిత్స

మహబూబ్​నగర్/మహబూబ్ నగర్ టౌన్,వెలుగు : పాలమూరులో కల్తీ కల్లుకు మరో ఇద్దరు బలయ్యారు. ఆశన్న అనే వ్యక్తి ఆదివారం మృతి చెందగా..బుధవారం మరో ఇద్దరు కల్తీ కల్లు కారణంగా చనిపోయారు. దీంతో 4 రోజుల్లోనే మృతుల సంఖ్య మూడుకు చేరింది. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. 50 మంది ఇంకా జనరల్​ హాస్పిటల్​లో  చికిత్స పొందుతున్నారు. మహబూబ్​నగర్​లోని అంబేద్కర్​ కాలనీకి చెందిన విష్ణు ప్రకాశ్​ (27) శుక్రవారం కల్లు తాగినప్పటి నుంచి అస్వస్థతకు గురయ్యాడు. అతడిని మహబూబ్​నగర్​లోని జనరల్​ హాస్పిటల్​లో అడ్మిట్​ చేశారు.

మూడ్రోజుల చికిత్స తర్వాత బుధవారం తెల్లవారుజామున పరిస్థితి విషమించి చనిపోయాడు. మహబూబ్​నగర్  జిల్లా కేంద్రంలోని దొడ్లోనిపల్లికి చెందిన రేణుక (38) అనే మహిళ కూడా చికిత్స పొందుతూ బుధవారం ప్రాణాలు కోల్పోయారు. కాగా, మహబూబ్​నగర్​ జనరల్​ హాస్పిటల్​లో కల్తీకల్లు బాధితులకు సంబంధించి ఎలాంటి సమాచారాన్ని బయటకు రానివ్వడం లేదు. శుక్రవారం నుంచి ఎంత మంది హాస్పిటల్​లో అడ్మిట్​ అయ్యారు? ఎంత మందికి క్యూర్​ అయ్యింది? ఎంత మంది కండిషన్​ సీరియస్​గా ఉంది? అన్న విషయాలను రహస్యంగా ఉంచుతున్నారు. బుధవారం విష్ణు ప్రకాశ్​చనిపోయిన విషయం తెలుసుకున్న మీడియా.. హాస్పిటల్​కు చేరుకోగా, అప్పటికే హాస్పిటల్​ మెయిన్​ ఎంట్రెన్స్​ వద్ద పోలీసులు మోహరించారు. మీడియా ప్రతినిధులను లోనికి వెళ్లనివ్వలేదు.

దాదాపు 3 గంటల వరకు వేచి ఉన్నా, అనుమతి ఇవ్వలేదు. సూపరింటెండెంట్​ పర్మిషన్​ ఉంటేనే అనుమతిస్తామని చెప్పారు. అదే టైంలో సూపరింటెండెంట్​ రాం కిషన్​ అటుగా వెళుతుండగా మీడియా ప్రతినిధులు ఆయన్ను అడ్డుకున్నారు. ఇది ప్రభుత్వ ఆసుపత్రి అని, ప్రైవేట్​ ప్రాపర్టీ కాదని, తమను ఎందుకు అనుమతించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి సమాధానం చెప్పకుండా ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

ఎక్సైజ్ మంత్రి రాజీనామా చేయాలి: డీకే అరుణ

కల్తీకల్లు ఘటనపై విచారణ చేపట్టాలని, దీనికి బాధ్యత వహిస్తూ ఎక్సైజ్  శాఖ మంత్రి శ్రీనివాస్   గౌడ్  రాజీనామా చేయాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. స్థానిక మంత్రి చేతుల్లోనే ఎక్సైజ్ శాఖ ఉన్నా కంట్రోల్ చేయలేకపోతున్నారని బుధవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కలిసేందుకు మీడియాను ఎందుకు అనుమతించలేదని ప్రశ్నించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కనుసన్నుల్లోనే కల్తీ కల్లు దందా సాగుతోందని ఆరోపించారు. 

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే సహించం: మంత్రి శ్రీనివాస్ 

ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడేవారిని సహించబోమని, కల్తీ కల్లు కారణంగా చనిపోయినట్టు తేలితే  బాధ్యులపై క్రిమినల్​ కేసులు పెట్టి చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. బుధవారం మహబూబ్ నగర్  జనరల్​ హాస్పిటల్​లో బాధితులను ఆయన పరామర్శించారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ, ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు వస్తే వారు ఎలా చనిపోయారో తెలుస్తుందన్నారు. తమ ప్రభుత్వం నిక్కచ్చిగా పనిచేస్తున్నదని, అస్సాం నుంచి లిక్కర్  వస్తోందని గతంలో తమకు సమాచారం అందితే అధికారులు అక్కడికి వెళ్లి పట్టుకున్నారన్నారు. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ఆసుపత్రి సూపరింటెండెంట్, ఎక్సైజ్  సూపరింటెండెంట్​ కల్తీ కల్లు ఘటనపై విచారణ చేస్తారని తెలిపారు